100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు

Updated By ManamSun, 09/23/2018 - 01:45
Damodara Rajanasirimha
  • అధికారంలోకొస్తే 20 వేల టీచర్ పోస్టుల భర్తీ

  • ‘ప్రజా మేనిఫెస్టో’లో కాంగ్రెస్ హామీలు.. అక్టోబర్ 13 లోగా విడుదల చేస్తాం

  • ఉత్తమ్ హామీలను ఆమోదించాం.. అందరూ సూచనలు చేయొచ్చు

  • కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ

Damodara Rajanasirimhaహైదరాబాద్: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ మేనిఫెస్టోను అక్టోబర్ 13 లోగా విడుదల చేయ నున్నట్లు టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ వెల్లడించారు. మేనిఫెస్టోకు ప్రజామేనిఫెస్టోగా నామకరణం చేసినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. అందులో 20 వేల టీచర్ పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ కూడా ఉంటుందని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఎన్నికల ప్రణాళిక కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశం వివరాలను రాజనరసింహ, కమిటీ సభ్యులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, గాంధీభవన్ కోఆర్డినేటర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్  తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో వివరించారు. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకుని ఎన్నికల ప్రణాళికను రూపొందించనున్నట్లు చెప్పా రు. ప్రజలు నమ్మే, ఆదరించే ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.  రైతులు,రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్య,వైద్యం తదితర అంశాలకు సంబంధించి వ్యక్తులు, మేధావులతో చర్చించనున్నామని చెప్పా రు. వివిధ అంశాలకు సంబంధించి క్షేత్ర స్థాయి నివేదికలు సమర్పిం చేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు రాజనరసింహ చెప్పారు. యూనియన్లు, సంఘాలు తమ సలహాలు, సూచనలను సోమవారం నుంచి 10 రోజుల పాటు ఫోన్ ,ఫేస్ బుక్,ఈ మెయిల్స్ ద్వారా కూడా చెప్పవచ్చని ఆయన కోరారు. మొబైల్ 8523852852కు ఫోన్ చేసి చెప్పవచ్చని, అదే విధంగా మెయిల్ ద్వారా సలహాలు ఇవ్వదల్చుకున్నవారు మేనిఫెస్టో టీపీసీ సీ ఎట్ జీ మెయిల్ .కామ్, ఫేస్ బుక్ ద్వారానైతే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో చిరునామాకు పంపాలని సూచించారు. గాంధీభవన్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబా టులో ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ పార్ట అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. మోసపోయిన వ్యక్తులు, సంఘాలు కూడా వినతిపత్రాలు సమర్పించవచ్చన్నారు. తమ తొలి సమావేశంలో గడచిన రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలను ఆమోదించామని వెల్లడించారు. 45 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చెయ్యాలన్న హామీని ఆమోదించామని, అదే విధంగా 20 లక్షల మంది కౌలు రైతుల సమస్యల ను ఏ విధంగా ఆదుకోవాలని కూడా చర్చించనున్నామని, 10 లక్షల మం ది నిరుద్యోగులకు భృతి చెల్లించడం, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న వారికి అద నపు గది నిర్మాణానికి రూ. 2 లక్షలు మంజూరు చేయడం, సొంత జాగా ఉంటే రూ. 5 లక్షలు చెల్లించి లబ్దిదారులే ఇళ్లు కట్టుకునేవిధంగా ప్రోత్సహిం చడం, ఎస్సీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణానికి రూ. 6 లక్షలతో యూనిట్ మంజూరు చెయ్యడం తదితర హామీలను ఆమోదించామని రాజనరసింహ పేర్కొ న్నారు.  ఏటా 2 లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్షంగా నిర్ణయించనున్నట్లు తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి చౌకధరల దుకాణాల ద్వారా 8 కిలోల సన్నబియ్యంతో పాటు 9 రకాల వస్తువులు పంపిణీ చెయ్యాలన్న హామీని కూడా ఆమోదించామని పేర్కొన్నారు. రైతులకు సంబంధించి రైతు బంధు, రైతు బీమా పథకాలను  మరింత మెరుగైన  రీతిలో రూపొందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

సబ్ కమిటీలు ఇవే..,
ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు 8 సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు దామోదర రాజనరసింహ వెల్లడించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, సాగునీరు అంశాలను కిసాన్ ఖేత్ మజ్దూర్ చైర్మన్ ఎం కోదండరెడ్డి, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ ,వైద్య ఆరోగ్యం, మహిళా సంక్షమం అంశాలను డాక్టర్ పి వినయ్ కుమార్ ,  నూతన పారిశ్రామిక విధానం,  జీహెచ్‌ఎంసీ, అర్బన్ అండ్ రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, పవర్, జెన్ కో, ట్రాన్స్‌కోలను మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లకా్ష్మరెడ్డి , మైనారిటీ సంక్షేమం పీసీసీ  ఉపాధ్యక్షుడు అబిద్ రసూల్ ఖాన్, విద్య, విద్యార్థుల సంక్షేమం, నిరుద్యోగులు, విశ్వవిద్యాలయాలను ప్రొఫెసర్ ఎఆర్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సమస్యలు, ఎన్ ఆర్‌ఐలు, గల్ఫ్‌సమస్యలు, సాధారణ పరిపాలన పీసీసీ ఎన్ ఆర్‌ఐ సెల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, సింగరేణి మైన్స్ ,ఆర్టీసీ, కార్మిక ఉపాధి అంశాలను మాజీ ఎమ్మెల్సీ కె ప్రేమ్ సాగర్ అధ్యయనం చేస్తారు. పై అన్ని కమిటీలను   పీసీసీ ఉపాధ్యక్షులు టి నాగయ్య సమన్వయం చేస్తారు.

English Title
100 jobs in 100 days
Related News