14న జలసిరికి హారతి

Updated By ManamTue, 09/11/2018 - 23:20
polavaram
  • మూడు రోజుల పాటు పూజలు

  • పోలవరం పనులు పుంజుకోవాలి.. నాణ్యతకు పెద్ద పీట వేయాలి

  • అవుకు టన్నెల్ నుంచి నీళ్లిస్తాం.. అధికారులతో సీఎం చంద్రబాబు

polavaramఅమరావతి: ఈనెల 14, 15, 16 తేదీల్లో  జలసిరికి హారతి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు. ఈ నెల 14న రాయలసీమ, 15న ఉత్తరాంధ్ర లో, 16న రాజధాని ప్రాంతంలో జలసిరికి హారతిలో పాల్గొంటానని సీఎం స్పష్టం చేశారు. 74వ పోలవరం వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌లో చంద్రబాబు మంగళవారం ఉదయం పాల్గొన్నారు. రాబోయే 3నెలలు పోలవరం నిర్మాణానికి అత్యంత కీలకమని, ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 58.15 శాతం పనులు పూర్తయ్యాయని...గత వారం రోజుల్లో 0.25 శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు. హెడ్ వర్క్స్ పనులు ఈ వారం 0.34 శాతం జరగ్గా, మెయిన్ డ్యామ్ పనులు 0.36 శాతం జరిగాయన్నారు. ఎక్సకవేషన్, కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఎడమ ప్రధాన కాలువ పనులు 0.23 శాతం జరిగాయని, స్పిల్ వే ఛానల్ పనుల వేగం తగ్గిందన్నారు. కాంక్రీట్ పనుల వేగం కూడా తగ్గిందని..స్పిల్ వే ఛానల్, కాంక్రీట్ పనులు వేగం పెరగాలని కోరారు. కాంక్రీట్ పనులు జూన్‌లో 1,58,869క్యూ.మీ. గరిష్ఠంగా జరిగిందని.. రాబోయే నెలల్లో దానిని అధిగమించాలని సూచించారు. లక్షా 85వేల క్యూ.మీ కాంక్రీట్ పనులు జరగాలని లక్ష్యం విధించారు. వర్షాలు లేకపోయినా, ప్రాజెక్టు పనులు ఎందుకని ఊపందుకోలేదని అధికారులను ప్రశ్నించారు. 

మా మనవడు ఉత్సాహంగా ఉన్నాడు...
‘మా మనవడు కూడా పోలవరం చూడాలని ఉత్సాహంగా ఉన్నాడు. ‘ఏం చేస్తున్నావురా’ అని అడిగితే ‘పోలవరం కడుతున్నా’ అంటున్నాడు. పిల్లలకు కూడా పోలవరం కట్టాలన్న పట్టుదల ఉంది. భావితరాల భవిష్యత్తు అంతా పోలవరంపైనే ఆధారపడి ఉంది. అధికారులంతా పట్టుదలగా పనిచేయాలి. అడ్డంకులను అధిగమించాలి. ఒక చరిత్రలో మనమంతా భాగస్వాములం అనే స్ఫూర్తితో పనిచేయాలి. రేడియల్ గేట్ల పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి. సిడబ్ల్యూసి నుంచి డిజైన్లకు ఎప్పటికప్పుడు ఆమోదం లభించేలా శ్రద్ధ చూపాలి. మొత్తం 27 డిజైన్లకుగాను సెప్టెంబర్‌లో 19, అక్టోబర్‌లో 8 డిజైన్లకు ఆమోదం వస్తుందని అంచనా. పోలవరం పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు విడుదల..
అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే.. అవుకు టన్నెల్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఛీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర రావు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

English Title
14th on the water
Related News