192 మంది జలసమాధి?

Updated By ManamThu, 06/21/2018 - 08:06
image
  • ఇండొనేషియా సుమత్రా దీవిలో ఘోరం

  • రెండు రోజుల క్రితం సరస్సులో ఫెర్రీ మునక

  • ఇప్పటి వరకు 18 మందిని రక్షించిన గజ ఈతగాళ్లు

  • సామర్థ్యం 60 మంది.. ఎక్కించుకుంది 210 మందికిపైగా

  • రంజాన్ నేపథ్యంలో వెల్లువెత్తిన స్థానికులు, టూరిస్టులు

imageటిగారస్(ఇండోనేషియా): ఇండోనేషియాలోని సుమత్రా దీవీలో పెను విషాదం చోటు చేసుకుంది. సుమత్రా దీవీలోని తోబా సరస్సులో పడవ మునిగి 192 మంది గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గల్లైంతెన వారికోసం సహాయక సిబ్బంది ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు. సామర్థ్యం కంటే ఐదు రెట్లు మంది ప్రయాణీకులతో పాటు డజన్ల కొద్ది మోటారు సైకిల్స్ ఉండగా పడవ సరస్సులోకి బయలుదేరింది. పడవ సామర్థ్యం 60 మంది కాగా పడవలో 45 లైఫ్‌జాకెట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. బోటులోనే అనేక మంది ప్రయాణీకులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు  18 మందిని మాత్రమే రక్షించారు. ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంపై స్పష్టత లేదు. రంజాన్ పండగ నేపథ్యంలో స్థానికులతోపాటు టూరిస్టులు వెల్లువెత్తడంతో వారంతా ఫెర్రీలో ఎక్కినట్లుగా భావిస్తున్నారు.  గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తోబా సరస్సు సుమారు 450 మీటర్ల లోతు ఉంటుందని చెబుతున్నారు. అయితే బోటు ఏ ప్రాంతంలో మునిగిందన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. సుమారు 25 మంది డైవర్లు గల్లైంతెన వారి కోసం అన్వేషిస్తున్నారు. ప్రభుత్వ చేపడుతున్న సహాయక చర్యల పట్ల బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాలింపు చర్యలు వేగం పెంచాలని వేడుకుంటున్నాయి.

ప్రమాదానికి గురైన పడవలో సోమవారం ఎప్పుడు లేనంత రద్దీ ఉందని, చాలాసార్లు ఆ పడవలో ప్రయాణించాననిimage ఎప్పుడు అంత రద్దీ చూడలేదని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఓ మహిళ చెప్పారు. సుమారు 20 నిమిషాలు సరస్సులో ప్రయాణించిన తర్వాత పెద్ద పెద్ద అలల తాకిడికి పడవ ఊగిపోయిందని, జనం కంగారుపడి ఒక్కసారి అటుఇటు కదలడంతో నీట మునిగిందని ఆమె చెప్పారు. కొందరు వెంటనే నీళ్లలోకి దూకేశారని, చాలామంది పడవలోనే ఉండిపోయారని ఆమె చెప్పారు. సుమారు 1,145 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తోబా సరస్సు, సుమత్రా దీవీలో ప్రధాన ఆకర్షణ. అంతేకాక ఇండోనేషియాలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు సరస్సు వద్ద అక్కడి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతుంది.

English Title
192 people aquatic?
Related News