25 ఏళ్ళ ‘అల్లరి ప్రియుడు’ 

Updated By ManamMon, 03/05/2018 - 16:22
allari

allari priyuduడా. రాజశేఖర్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘అల్లరి ప్రియుడు’ ఒకటి. అంతవరకు యాంగ్రీ యంగ్ మాన్‌గా తెరపై కనిపించిన రాజశేఖర్‌లో ప్రేమికుడి కోణం కూడా ఉంద‌ని చూపించిన చిత్రమిది. సాధారణంగా.. ఒక సినిమా విజయం సాధిస్తే.. అందులో నటించిన హీరో హీరోయిన్ పాత్రల గురించి.. వారి మధ్య పండిన కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఈ సినిమా విష‌యంలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు.. ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే.. టైటిల్‌లో ప్రియుడు అనే ప‌దం ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా స్నేహం చుట్టూ తిరిగే క‌థ ఇది. ఒక‌రి కోసం మ‌రొక‌రు ఎంత‌టి త్యాగం చేసుకోవ‌డానికైనా సిద్ధ‌ప‌డే ప్రాణ స్నేహితురాళ్ళుగా ఇందులో రమ్యకృష్ణ, మధుబాల త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. తెరపై వీరిని చూస్తుంటే.. నిజమైన స్నేహితులు ఇలాగే ఉంటారేమో అన్నంత‌గా.. వీరిమధ్య కెమిస్ట్రీ కుదిరింది.

అలాగే దర్శకుడు కె. రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్  కీరవాణి కాంబినేషన్ చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.  అప్పటికే ఈ ద్వయం ‘అల్లరి మొగుడు’, ‘ఘరానా మొగుడు’, ‘సుందరకాండ’తో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. నాల్గవ సినిమాగా చేసిన ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. “రోజ్  రోజ్ రోజ్‌ రోజ్ రోజా పువ్వా..”, “అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు”, “చెప్పకనే చెబుతున్నది”, “అందమా నీ పేరేమిటి”, “ఉత్తరాల ఊర్వశి”, “ఏం పిల్లది”, “ప్రణయమా” .. ఇలా పాటలన్నీ జనాదరణ పొందాయి. ఈ చిత్రంతో బెస్ట్ డైరెక్టరుగా కెరీర్లో మూడోసారి ఫిలింఫేర్‌ను కె. రాఘవేంద్రరావు అందుకోగా.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టరుగా కెరీర్‌లో రెండోసారి ఫిలింఫేర్‌ను కీరవాణి దక్కించుకున్నారు. ఈ చిత్రంతో కెరీర్‌లో రెండోసారి నంది అవార్డులను అందుకుంది ఈ ద్వయం.

మార్చి 5, 1993న విడుదలైన ఈ సినిమా తొలి వారం యావ‌రేజ్ టాక్‌తో న‌డిచినా.. ఆ త‌రువాత బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. స్లాబ్ సిస్ట‌మ్ వ‌చ్చాక అత్య‌థిక కేంద్రాల‌లో సిల్వ‌ర్ జూబ్లీ (175 రోజులు) ఆడిన ఈ చిత్రం.. నేటితో 25 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

English Title
25 years for 'allari priyudu'
Related News