30 ఏళ్ళ ‘ఆఖరి పోరాటం’

Updated By ManamMon, 03/12/2018 - 12:31
aakhari poratam

aakhari poratamదుష్ట‌శిక్ష‌ణ కోసం, శిష్ట‌ర‌క్ష‌ణ కోసం ద‌శావ‌త‌రాలు ఎత్తిన మ‌హా మ‌నిషిగా త‌న‌ను తాను దేవుడి అంశ‌లా చెప్పుకుంటూ.. దేశాన్ని నియంతలా పాలించాలన్న‌ ఉద్దేశంతో అనంతానంత స్వామి (అమ్రిష్ పురి) అనే దొంగ‌స్వామి చేసే నేరాలను, అరాచకాలను బయటపెట్టిన ఓ సీబీఐ ఆఫీస‌ర్ క‌థే ‘ఆఖరి పోరాటం’ చిత్రం. ఈ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది సి.బి.ఐ.ఆఫీసర్‌ ప్రవల్లిక పాత్ర‌లో జీవించేసిన శ్రీ‌దేవి. ఒక ర‌కంగా ఈ చిత్రానికి ఆ పాత్రే హీరో. అప్ప‌ట్లో అత్య‌థిక పారితోషికం (రూ.12 ల‌క్ష‌లు) తీసుకున్న క‌థానాయిక‌గా ఈ సినిమాతో గుర్తింపు పొందారు ఆమె. ఇక ఆమెకు అన్నివిధాలా సహకరించే  విహారి పాత్రలో నాగార్జున నటించారు. యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రానికి కథను అందించ‌గా.. “హాస్య బ్రహ్మ”జంధ్యాల మాటలను అందించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమా.. అక్టోబ‌ర్ 18, 1987న ప్రారంభ‌మై కేవలం 65 రోజుల్లో చిత్రీకరణను పూర్తిచేసుకుంది.  
akhari poratamటెక్నాలజీ (దొంగ స్వామి ఇచ్చే తావీజులో సీక్రెట్ మైక్.. ఈ త‌ర‌హా స‌న్నివేశాలు ఆ త‌రువాత 'మ‌న్మ‌థుడు', 'ధృవ' చిత్రాల్లో చూడొచ్చు ) పరంగా కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వ‌నీ దత్ నిర్మించారు. శ్రీ‌దేవితోనూ అశ్వ‌నీద‌త్‌తోనూ నాగ్‌కు ఇదే తొలి చిత్రం. అలాగే కె.రాఘవేంద్ర‌రావు, ఇళ‌యరాజా కాంబినేష‌న్‌లో రూపొందిన మొద‌టి సినిమా కూడా ఇదే. అదేవిధంగా బాలీవుడ్ న‌టుడు అమ్రిష్ పురికి కూడా ఇదే తొలి తెలుగు చిత్రం కావ‌డం విశేషం. ఇందులో త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకుని.. త‌న మార్క్‌ డైలాగ్ డెలివ‌రీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారాయ‌న‌. సుహాసిని, చంద్రమోహన్, సత్యనారాయణ, జయంతి, నూతన్ ప్రసాద్, విజయన్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్యపాత్రలు పోషించారు.

aakhari poratamస‌హ‌జంగానే ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన చిత్రాల్లో పాటలకి పెద్ద పీట వేస్తారు. తన గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రంలో కూడా పాటలన్నీ హైలైట్‌గా నిలిచాయి. వేటూరి కలం చేసిన ప‌ద‌విన్యాసాల‌కు చక్కని స్వరాలను సమకూర్చారు లయరాజా ఇళయరాజా. “నైటింగేల్ ఆఫ్ ఇండియా” లతా మంగేష్కర్‌తో ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం క‌లిసి గానం చేసిన‌ “తెల్ల చీరకు తకధిమి” పాట విన‌డానికి ఎంత విన‌సొంపుగా ఉంటుందో.. తెర‌పై అంతకన్నా అందంగా దృశ్యీక‌రించారు దర్శకేంద్రుడు. పూర్తిగా తెలుపు రంగు వ‌స్త్రాల్లో శ్రీ‌దేవి.. అతిలోక‌సుంద‌రిలానే క‌నిపిస్తారు. అలాగే.. ప్రముఖ గాయని చిత్రను “అబ్బ దీనిసోకు సంపంగి రేకు” పాటతో తెలుగులో నేరుగా పరిచయం చేసిన ఘనత కూడా ఈ చిత్రానిదే.

aakhari poratam1989లో జరిగిన 12వ ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. అలాగే.. రోజుకి 5 ప్రదర్శనలతో, 5 సెంటర్లలో (నెల్లూరు, ఆదోని, కర్నూల్, తిరుపతి, అనంతపూర్) 50 రోజుల పండుగను జరుపుకున్న ఏకైక చిత్రం ఇది. అలాగే 35 కేంద్రాల్లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైంది. ఇలా.. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ చిత్రం మార్చి 12, 1988న‌ విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నేటితో ఈ సినిమా 30 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

English Title
30 years for 'aakhari poratam'
Related News