30 ఏళ్ళ‌ ‘రుద్ర‌వీణ’  

Updated By ManamSun, 03/04/2018 - 11:28
chiranjeevi

rudraveenaఉన్న‌త‌మైన బ్రాహ్మ‌ణ కులంలో పుట్టి “చ‌దువు, సంస్కారం క‌న్నా క‌రుణే మిన్న” అని భావించి.. దాన్నే ఆచ‌ర‌ణ‌లో పెట్టి దశాబ్ది యువకుడిగా ఎదిగిన‌ ఓ యువ‌కుడి క‌థే ‘రుద్ర‌వీణ’. బిళ‌హ‌రి గ‌ణ‌ప‌తి శాస్త్రి అనే సంగీత విద్వాంసుడికి ముగ్గురు పిల్ల‌లు. పెద్ద‌వాడు ఉద‌యం, రెండోవాడు సూర్య నారాయ‌ణ శాస్త్రి (సూర్యం), కూతురు సంధ్య‌. ఉద‌యం పుట్టు మూగ‌. నాద‌స్వ‌రం బాగా వాయిస్తాడు. సూర్యం తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ.. సంగీత క‌చేరీలు చేస్తూ ఉంటాడు. అయితే.. త‌న సంగీత జ్ఞానం ఏ కొంత‌మందికో సొంతం కాకూడ‌దు.. "పంచే గుణ‌మే పోతే.. ప్ర‌పంచ‌మే శూన్యం" అనే న‌మ్మి జ‌నజీవ‌న స్ర‌వంతిలో క‌లుస్తుంటాడు. తొలుత కొడుకు వెళ్లే దారి న‌చ్చ‌క ఇంట్లోంచి వెళ్ల‌గొట్టిన తండ్రి.. త‌ర్వాత‌ కొడుకు గొప్ప‌త‌నం తెలుసుకొని "సూర్య నారాయ‌ణ శాస్త్రి తండ్రిని నేను" అని గర్వంగా చెప్తూ.. సూర్యం వెళ్ళేదారే గొప్ప‌ద‌ని అభిప్రాయానికి వ‌స్తాడు. 
ఈ చిత్రంలో సూర్యంగా చిరంజీవి ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం అద్భ‌త‌మ‌నే చెప్పాలి. ఇక సూర్యం తండ్రి పాత్ర‌లో త‌మిళ‌న‌టుడు, మ‌హాన‌టి సావిత్రి భ‌ర్త‌ జెమినీ గ‌ణేశ‌న్ న‌టించారు. చిరుకి జోడీగా శోభ‌న న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌సాద్ బాబు, ర‌మేష్ అర‌వింద్, పి.ఎల్.నారాయ‌ణ, బ్ర‌హ్మానందం త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. 'న‌మ్మ‌కు న‌మ్మ‌కు ఈ రేయిని', 'త‌ర‌లిరాదా త‌నే వ‌సంతం', 'చుట్టుప‌క్క‌ల చూడ‌రా చిన్న‌వాడా'.. ఇలా సిరివెన్నెల రాసిన ప్ర‌తీ పాటలోని అక్ష‌రం మాన‌వ‌త్వాన్ని త‌ట్టి లేపుతుంది. ఆ సాహిత్యానికి ఇళ‌య‌రాజా స‌మ‌కూర్చిన‌ సంగీతం చక్క‌గా కుదిరింది.

అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై చిరంజీవి స‌మ‌ర్పించిన ఈ చిత్రానికి కె.నాగేంద్ర‌బాబు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు (ఉత్త‌మ జాతీయ స‌మ‌గ్ర‌తా చిత్రం, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ గాయ‌కుడు -బాలు)తో పాటు నాలుగు నంది అవార్డుల‌ను, స్పెష‌ల్ జ్యూరీ అవార్డును అందుకుంది. తర్వాత ఇదే సినిమాని త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా 'ఉన్నాల్ ముడియ‌మ్ తంబి' పేరుతో బాల‌చంద‌ర్ రీమేక్ చేశారు.

మార్చి 4, 1988న విడుదలైన ‘రుద్ర‌వీణ’ నేటితో 30 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.

English Title
30 years for 'rudra veena'
Related News