ఆ 39 మంది.. ఇక లేరు

Updated By ManamWed, 03/21/2018 - 02:17
image
  • ఇరాక్‌లో భారతీయుల దుర్మరణం

  • అధికారికంగా తెలియజేసిన ప్రభుత్వం

  • డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు

  • వాటిని వారి బంధువులకు అందజేస్తాం

  • రాజ్యసభలో మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన

  • లోక్‌సభలో మంత్రి ప్రకటనకు సభ్యుల అడ్డు

  • సింధియాను రాహుల్ రెచ్చగొట్టి పంపారు

  • చావులతో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది

  • తీవ్రంగా మండిపడిన విదేశీ వ్యవహారాల మంత్రి

imageఇన్నాళ్లూ అదృశ్యమయ్యారని భావించి న 39 మంది భారతీయులు మరణించారు. వారు ఎవరెవరన్న విషయాన్ని కూడా భార త ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో బాధాతప్త హృదయంతో ప్రకటించారు. భారతీయులు ఎక్కడ మరణించారో సరిగా తెలియకపోయినా మోసుల్‌కు ఆగ్నేయ దిశలోని బాదోష్ అనే చోట మృతదేహాలు లభ్యమయ్యాయని, డీఎన్‌ఏ పరీక్ష ద్వారా వారిని గుర్తించామని స్వరాజ్ చెప్పారు. తగిన ఆధారాల్లేకుండా ఏ ఒక్కరూ మరణించినట్లు తాను చెప్పబోనని ఇంతకుముందు అన్న విషయాన్ని గుర్తుచేసిన సుష్మ.. బరువెక్కిన హదయంతో, పూర్తి ఆధారాలతో ఇప్పుడు మృతదేహాలను వారి సంబంధీకులకు అప్పగించి, కేసు క్లోజ్ చేసినట్లు తెలిపారు. 
 

అలా చేస్తే పాపం
సరైన పరీక్షలు చేయకుండా ఎవరో ఒకరి మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తే అది పాపమని.. అందుకే డీఎన్‌ఏ పరీక్షలు పూర్తిచేసి సాక్ష్యాలు ఇచ్చేవరకు ఆగానని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఎవరికీ తప్పుడు హామీలు ఇవ్వలేది, ఎవరినీ చీకట్లో ఉంచలేదని ఆమె అన్నారు. మృతులలో 27 మంది పంజాబ్‌కు, ఆరుగురు బిహార్‌కు చెందినవారు కాగా నలుగురు హిమాచల్ ప్రదేశ్, మరో ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. మొత్తం 39 మందిలో 38 మంది డీఎన్‌ఏ శాంపిళ్లు పూర్తిగా సరిపోయాయని, మిగిలిన ఒక్కరిది 70 శాతం సరిపోయిందని తెలిపారు. ఐసిస్ చెర నుంచి తప్పించుకుని వచ్చిన హర్జిత్ మాసి చెప్పిన విషయం తప్పని.. భారతీయులను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు అతడు చెప్పినా, ఇప్పుడలా జరగలేదని మంత్రి వివరించారు. 
 

మృతదేహాలను అప్పగించనున్న వీకే సింగ్
విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకేసింగ్ స్వయంగా ఇరాక్ వెళ్లి మృతదేహాలను ప్రత్యేక విమానంలో తీసుకొస్తారని ఆమె తెలిపారు. తిరిగి వచ్చేటపుడు తొలుత అమృతసర్‌లో ఆగి అక్కడ, తర్వాత హిమాచల్‌ప్రదేశ్, ఆ తర్వాత పట్నా, ఆపై కోల్‌కతా వెళ్లి అక్కడక్కడ వారి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారన్నారు. మంత్రి ఈ ప్రకటన చేయగానే.. చైర్మన్ వెంకయ్యనాయుడు ఇది చాలా దుర్వార్త అని చెప్పారు. అనంతరం మృతులకు సంతాప సూచకంగా సభ్యులు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. భారతీయులంతా సురక్షితంగా ఉంటారని ప్రభుత్వం గత సంవత్సరం చెప్పిందని ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ గుర్తుచేశారు. భారతీయుల మరణంపై ఆయన సంతాపం తెలిపారు. 
 

లోక్‌సభలో గందరగోళం
లోక్‌సభలో మాత్రం ఈ అంశంపై సుష్మా స్వరాజ్ ఎలాంటి ప్రకటనా చేయలేకపోయారు. సభలో ముందు నుంచి తీవ్ర గందరగోళం నెలకొనడంతో.. సుష్మా స్వరాజ్ ఒక సీరియస్ అంశం గురించి ప్రకటన చేయబోతున్నారని, అందువల్ల సభ్యులు అదుపులో ఉండాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే కోరారు. ఈ సమయంలో సుష్మా ఏం మాట్లాడుతున్నారో వినపడనివ్వకుండా.. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు ‘నో.. నో’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఇరాక్‌లో 39 మంది భారతీయుల దుర్మరణం గురించి ఆమె చెప్పాలనుకుంటున్నారని, మంత్రి చెప్పేది వినాలని స్పీకర్ కోరారు. కానీ సభలో గందరగోళ పరిస్థితి ఉండటంతో తాను ఇలాంటి సీరియస్ అంశం చెప్పలేనని సుష్మా స్వరాజ్ చేతులెత్తేశారు. తాను సభలో సాక్ష ్యం ప్రవేశపెట్టాలనుకుంటున్నానని, దయచేసి తాను చెప్పేది వినాలని ఆమె కోరారు. కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాల సభ్యులు ఆమె మాటలు వినిపించుకోకుండా తమ నినాదాలు కొనసాగించారు. రాజ్యసభలో తను ప్రకటన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో సహనంతో విన్నారని, అంతా సంతాపం కూడా ప్రకటించారని, అదే లోక్‌సభలో కూడా జరుగుతుందని తాను భావించినా.. ఇక్కడ మాత్రం జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళం సష్టించార ని, ఇది చాలా దురదష్టకరమని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా నీచ రాజకీయాలకు దిగజారిందని, బహుశా కాంగ్రెస్ అధ్యక్షుడే రాజ్యసభలో ఎలాంటి గందరగోళం ఎందుకు జరగలేదని భావించి సిందియాను లోక్‌సభలో నిరసనలకు నాయకత్వం వహించమని చెప్పి ఉంటారని, చావులతో కూడా వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆ తర్వాత.. సభ అదుపులో లేనందున ఇక ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేమంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
 

అసలేం జరిగింది...
ఇరాక్‌లో రెండో అతిపెద్ద నగరమైన మోసుల్‌లో 2014 సంవత్సరంలో 40 మంది భారతీయులతో పాటు కొంతమంది బంగ్లాదేశీలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందినవారే. 40 మంది భారతీయుల్లో గుర్‌దాస్‌పూర్‌కు చెందిన హర్‌జీత్ మాసి మాత్రం ఎలాగోలా తప్పించుకుని వచ్చి.. మిగిలిన వారి హత్యాకాండను చూసినట్లు చెప్పారు. ఆయన కథనాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. అవన్నీ కాకమ్మ కథలని అప్పట్లో సుష్మా చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింగా నకిలీపేరు చెప్పి అతడు ఐసిస్ బారి నుంచి తప్పించుకుని వచ్చాడన్నారు. భారతీయులను తొలుత ఒక వస్త్రాల మిల్లులో పెట్టినా, హర్‌జీత్ తప్పించుకున్నాక వారిని బాదోష్‌లోని జైలుకు తరలించారు. వారి కోసం తీవ్రంగా గాలించగా.. చివరకు బాదోష్‌లో సామూహిక సమాధులు కనిపించాయి. భూమి లోపలికి వెళ్లే రాడార్ సాయంతో అక్కడ మృతదేహాలున్నట్లు గుర్తించారు. వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం బాగ్దాద్ పంపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మోసుల్ నగరాన్ని స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు చాలామంది ఇరాకీలు ఆ నగరం విడిచి వెళ్లిపోయినా భారతీయులు, బంగ్లాదేశీలు మాత్రం అక్కడే ఉండిపోయారు. వారు ఒకరోజు భోజనం చేసి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ పతనం తర్వాత సహాయమంత్రి వీకే సింగ్ వెళ్లి అక్కడ ఇరాకీ అధికారుల సాయంతో 39 మృతదేహాలను గుర్తించారు. వెతికే సమయంలో సింగ్ ఒక చిన్న ఇంట్లో నేలమీద కూడా పడుకోవాల్సి వచ్చిందని చెబుతూ.. ఆయన సేవలను సుష్మా ప్రస్తుతించారు. 
 

నేనింకా నమ్మలేను
కొన్నేళ్లుగా తన సోదరుడు బతికే ఉండి ఉంటాడని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెబుతున్నారని.. ఇప్పుడు మళ్లీ ఆమె చెబితే తప్ప తన సోదరుడు మరణించిన విషయాన్ని తాను నమ్మలేనని పంజాబ్‌కు చెందిన గుర్‌పీందర్ కౌర్ అంటున్నారు. ఇరాక్‌లో మరణించిన 39 మందిలో ఆమె సోదరుడు మన్‌జీందర్ సింగ్ కూడా ఒకరు. తాను టీవీలలో విన్నానని, కానీ మంత్రి లేదా ఆమె కార్యాలయం అధికారులు తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పేవరకు తాను ఈ విషయాన్ని నమ్మలేనని ఆమె వాపోయారు.
 

బతికింది ఒకే ఒక్కడు
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి సజీవంగా తప్పించుకుని వచ్చిన ఏకైక వ్యక్తి... హర్‌జీత్ మాసి. అతడితో పాటు మరో 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా మరణించినట్లు తాను ముందునుంచి చెబుతున్నానని హర్‌జీత్ అన్నారు. తాను నిజమే చెప్పానని పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ జిల్లా కాలా అఫ్ఘానా గ్రామంలో ఆయన తెలిపారు. తన కళ్ల ముందే మిగిలినవారందరినీ చంపేశారని.. అదే విషయం తాను ఇన్నేళ్లుగా చెబుతున్నానని అన్నారు. కానీ ప్రభుత్వం ఇంతకుముందు తన మాటలు నమ్మలేదన్నారు. ఒక రోజు తమను మోకాళ్ల మీద కూర్చోబెట్టి వరుసగా తుపాకులతో కాల్చేశారని, తనకు మాత్రం అదృష్టవశాత్తు తొడలో బుల్లెట్ తగిలి స్పృహతప్పి పడిపోయానని చెప్పారు. తనకు గాయమైందని ఉగ్రవాదులకు చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. 

English Title
The 39 people are no longer
Related News