ఒక్క ‘కామా’.. 32 కోట్ల పరిహారం!

Updated By ManamSun, 02/11/2018 - 10:59
comma representational
  • వాక్యంలో ఒక్క కామా మిస్సయినందుకు 32 కోట్ల పరిహారం చెల్లించిన సంస్థ

comma representationalవాషింగ్టన్: ఒక్కోసారి చిన్నచిన్న తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు తీసుకొస్తాయి. కోట్లు చెల్లించాల్సి రావొచ్చు. అచ్చం అమెరికాలో అలాగే జరిగింది.. ఒక్క కామా (,) కొన్ని కోట్ల పరిహారాన్ని చెల్లించేలా చేసింది ఆ కంపెనీకి. పోర్ట్‌లాండ్‌లోని మైన్‌లోగల ఓఖర్స్ డైరీ (పాల ఉత్పత్తి) అనే సంస్థ.. ‘కామా’ తప్పునకు గానూ తన డ్రైవర్‌లకు 5 మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. భారత క రెన్సీ ప్రకారం దాని విలువ.. సుమారు రూ.32 కోట్లు. అంటే సంస్థ కామా పొరపాటు చేసినందుకు 32 కోట్ల రూపాయల చేతి చమురును వదిలించుకుందన్నమాట. 

ఇదీ కథ...
సంస్థకు చెందిన ముగ్గురు డ్రైవర్లు.. నాలుగేళ్లకుపైబడి తాము చేసిన ఓవర్‌టైంకు సంస్థ జీతం చెల్లించనంటోందని, తమ ఓవర్‌టైంకు డబ్బులు చెల్లించేలా చూడాలని 2014లో కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మైన్ చట్టం ప్రకారం 40 పనిగంటలు దాటిన తర్వాత ప్రతి గంటకూ వేతనంలో సగం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అందులో పలు మినహాయింపులను పెట్టారు. క్యానింగ్, ప్రాసెసింగ్, ప్రిజర్వింగ్, ఫ్రీజింగ్, డ్రయింగ్, మార్కెటింగ్, స్టోరింగ్, ప్యాకింగ్ ఫర్ షిప్‌మెంట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్‌లకు ఆ అధిక పనిగంటల వేతనం నుంచి మినహాయింపును ఇచ్చింది. ఇందులో చివరి వాక్యం ‘ప్యాకింగ్ ఫర్ షిప్‌మెంట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్’లోనే ఆ కామా తప్పిదం భారీ మూల్యానికి కారణమైంది. షిప్‌మెంట్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనే దాంట్లో ‘ప్యాకింగ్ ఫర్’ అనేది షిప్‌మెంట్‌కు వర్తిస్తుందా.. లేదంటే డిస్ట్రిబ్యూషన్‌కా అనే దానిపైనే సందిగ్ధం తలెత్తింది. షిప్‌మెంట్ తర్వాత ఓ ‘కామా’ పడేసుంటే ఇంత సందిగ్ధానికి కారణమై ఉండేది కాదు. దీనిపై వాదనలు విన్న యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్.. ఒక్క కామా లేకపోవడం వల్ల కేసు మొత్తం డ్రైవర్ల వైపునకు మళ్లిందని, అది లోపమైనా ఏదైనా సరేగానీ చట్టంలో పేర్కొన్నదాని ప్రకారం డ్రైవర్లకు సంస్థ ఓవర్‌టైం డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ మేరకు సంస్థ.. తన డ్రైవర్లకు 5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. 

English Title
$ 5 million Compensation for missing Comma
Related News