ఇకపై ఆస్తులకూ ఆధార్!

Updated By ManamMon, 05/14/2018 - 01:08
Aadhar
  • మునిసిపాలిటీల్లో అనుసంధానం.. వేగవంతం చేయాలని ఆదేశాలు

  • తద్వారా అక్రమ ఆస్తులకు చెక్... ప్రతి నెలా ఆస్తి పన్నుల సవరణ

  • నిర్మాణం పూర్తయిన 30 రోజుల్లో.. పన్నుపరిధిలోకి తెచ్చేందుకు కార్యాచరణ

aadharహైదరాబాద్: ఓవైపు వివిధ సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ అనుసంధానంపై చర్చ నడు స్తోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీల్లోని ప్రైవేట్ ఆస్తులకు ఆధార్‌తో అనుసంధానించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.  పన్ను చెల్లించే ప్రతిఆస్తికీ ఆధార్‌ను అనుసంధానం చేసే పనిని వేగవం తం చేయాలని పురపాలకశాఖ రాష్ట్రం లోని మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. 
ఆస్తులకు  ఆధార్‌ను అనుసంధానం చేసే విషయమై గతంలోనే ఆదేశాలున్నా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో ఇంటింటి సర్వే నిర్వహించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం సీడీఎంఎ ఆదేశాలతో ఆధార్ అనుసంధానంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించనున్నారు. ఆధార్ అనుసంధానంతో అక్రమాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆధార్ అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఎవరి పేరుమీద ఎన్ని ఆస్తులున్నాయి, అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆధార్‌తో పాటు సెల్‌ఫోన్ నెంబర్లను అనుసంధానించే విధంగా అధికారులు కసరత్తు చేపట్టారు.

ఇక ప్రతి నెలా ఆస్తిపన్ను..
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తిపన్ను సవరణలు చేసే విధంగా మునిసిపాలిటీలు పురపాలకశాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్నిర్మాణం చేసిన, విస్తరించిన కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకు వచ్చేందుకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. భవనాల నిర్మాణాలు పూర్తి అయిన 30 రోజుల్లో, గృహనిర్మాణం చేసిన మరుక్షణం నుంచి వాటిని పన్ను పరిధిలోకి తీసుకువచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని పురపాలక శాఖ మునిసిపాలిటీలకు సూచించింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకోవాలని సూచించింది. మునిపాలిటీల్లో  కొత్తగా ఏర్పాటు కానున్న 68 మునిసిపాలిటీల పరిధిలో వసూలు చేస్తున్న ఆస్తిపన్నుల వివరాలను ఆయా గ్రామపంచాయతీల నుంచి పురపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాల్సి ఉంది. 72 మునిసిపాలిటీల్లో  ఉన్న ఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ చేసి ఆస్తిపన్నుల జాబితాలో ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50శాతం తక్కువగా పన్నులు వసూలైనట్లుగా వెల్లడైంది. దీంతో ఈ నెల 15లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మున్సిపల్ అధికారులను పురపాలకశాఖ ఆదేశించింది. ఆస్తిపన్నుల సవరణలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అనుమతి లేకుండా నిర్మించిన ప్రైవేటు, ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా వందశాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పన్నుల డిమాండ్ నోటీస్‌లో భవనం యజమాని పేరుకు బదులు భవనాన్ని ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు రాయాలని మున్సిపల్ అధికారులకు  పురపాలకశాఖ సూచించింది.

Tags
English Title
Aadhaar for assets no more!
Related News