2018-ఆధార్ నామ సంవత్సరం!!

Updated By ManamSat, 12/30/2017 - 13:51
aadhar

Aadharఆధార్‌కు సంబంధించినంత వరకు కొత్త సంవత్సరం (2018) అత్యంత కీలకంకానుంది. ప్రజల జీవితాలతో విడదీయలేని మరింత బంధాన్ని ఆధార్ పెనవేసుకోనుంది.  పలు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఆధార్ అనుసంధానం విషయంలో 2017లో పలు వివాదాలు, గందరగోళాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. పౌరుల ప్రైవసీకి విఘాతం కలిగించే ఆధార్‌ను ప్రభుత్వ సేవలకు తప్పనిసరి చేయడం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లపై 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. 

బ్యాంకు అకౌంట్లు, మొబైల్ ఫోన్లు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై 2018 మార్చి 31న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే...డిజిటల్ ఇండియా దిశగా ఓ గొప్ప ముందడుగు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్ తప్పనిసరిగా మారనుంది. ఆ రకంగా ప్రభుత్వ పథకాలకు ఆధారే మూలం కారణం కానుంది. నేర విచారణలోనూ ఆధార్‌లోని వేలిముద్రలు వంటి వివరాలు పోలీసుల చేతిలో కీలక ఆయుధాలుగా మారనున్నాయి. 

aadharప్రైవేటు రంగంలోనూ ఆధార్ వివరాలను విరివిరిగా వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పలు ఉద్యోగ నియామక సంస్థలు అభ్యర్థుల నుంచి ఆధార్ వివరాలను తీసుకుంటున్నాయి. కొత్తగా అకౌంట్ తెరిచేందుకు ఆధార్‌లో ఉన్నట్లు పేరు ఇవ్వాలని ఫేస్‌బుక్ సంస్థ కోరడం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇప్పటికే కొన్ని సేవలకు సంబంధించి వినియోగదారుల ఆధార్ వివరాలు కోరుతోంది. అటు బెంగుళూరుకు చెందిన క్యాబ్ రెంటల్ సంస్థ-జూమ్‌కార్ ఆధార్ ప్రూఫ్ చూపనిదే బుకింగ్స్ స్వీకరించడం లేదు. 

ఇలా 2018లో ఆధార్‌ను పలు ప్రైవేటు సంస్థలు కూడా తమ సేవలు పొందాలంటే వినియోగదారులు ఆధార్ వివరాలు సమర్పించడం తప్పనిసరి చేయనున్నాయి. ఆ రకంగా ఎవరికి నచ్చినా...నచ్చకపోయినా...2018 ఆధార్ నామ సంవత్సరం కావడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. 

English Title
Aadhaar will be the basis of your life in 2018
Related News