ఆదివాసీ ధ్రువతార

Updated By ManamSun, 03/11/2018 - 02:56
veer-baburao

veer-baburaoభారత తొలి స్వాతంత్య్ర సంగ్రామం నుంచి జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న భూమి పుత్రులను బ్రిటిష్ పాలకులు బలితీసుకున్నారు. కొందరిని బానిసలుగా, పీడితులుగా మార్చారు. రాజ్యదురాక్రమణదారులైన తెల్లదొరలు ఆదివాసులపై కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం ప్రకటిస్తూ తాంతీయా భీల్, రాణి దుర్గావతి, రాణి మా గైడిన్ల్యూ, బిర్సాముండా, రాంజీ గోండ్ మొదలైన ఆదివాసీ యోధులను బలిగొన్నారు. మధ్య భారతదేశంలో క్రీ.శ. 1240-1749 మధ్య మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  పరిధిలో ఏర్పడిన ఆదివాసీ గోండ్వానా రాజ్యంలో రాజులుగా వెలుగొందిన గోండు గిరిజన పాలకులకు, జమీన్‌దారులను, మోకాసాలను బలిగొన్నారు. గోండ్వానా సమర శీలురలో పులిలాంటి యోధుడు పులిసూర్ బాబురావ్ సెడ్మాకీ. గోండ్వానా రాజ్యంలో సెడ్మాకీ ‘ఆదియోధుడు’. గోండ్వానా ప్రాంతమైన చంద్రాపూర్ (మహారాష్ట్ర)లోని గోండులు సెడ్మాకీ ఆధ్వర్యంలో తిరుగుబాటు (1856-58), మరోవైపు ఆదిలాబాద్ సరిహద్దుల్లో మార్సికోల్ల రాంజీగోండ్ బ్రిటిష్ సైన్యాలపై రోహిల్లాలు, గోండుల తిరుగుబాటు (1857-60) ఉద్విగ్నంగా జరిగింది. భారత స్వాతంత్య్ర సమరంలో ఆరి పోతున్న దీపాలను వెలిగిస్తున్నట్లు నేలకొరిగిన వీరుని స్థానంలో మరొక రిని ఎదిగేలా చేసి తెల్లదొరతనంపై ఎదురుదాడికి సిద్ధం చేశాడు. ఎన్నో సవాళ్ళను, ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ గోండ్వానా రాజ్య సంరక్షణ సమరానికి నాయకత్వం వహించిన గోండ్వాన వీరుడు సెడ్మాకీ. గోండ్వానాలో అంతర్భాగమైన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండి గ్రామంలో జమీందార్ కుటుంబంలో 1833, మార్చి 12న జన్మించిన సెడ్మాకీ బాల్యం నుంచే అస్త్ర, శస్త్రవిద్యల్లో నైపుణ్యం సాధించి 28 ఏళ్ళకు జమీందారీ వారసుడిగా బాధ్యతలు తీసు కున్నాడు. దురాక్రమణ, దుశ్చర్యల నుంచి గోండ్వానా రాజ్యరక్షణకు ప్రతిజ్ఞ చేశాడు.

   తెల్లదొరల ఆకృత్యాలను, వారి దాడులను తిప్పికొట్టడానికి కోయత్తోరులను, మరాఠీలు, ముస్లింలను కూడా ఏకం చేసి, తన సైన్యంతో తెల్లదొరలపై తొలిసారి 1858, మార్చి 22న యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని సెడ్మాకీ ఓడించాడు. బ్రిటిష్ కెప్టెన్ క్రికటన్ సారథ్యంలో సిగ్నాపూర్ పరిసరాలలో గోండులపై దండెత్తినా పరాజయం తప్పలేదు. పైగా చంద్రాపూర్ వైపు పారిపోయి తలదాచుకున్నారు. బ్రిటిష్ బలగాలను సెడ్మాకీని ఓడించడానికి బ్రిటిష్ సైన్యాధిపతి నెక్స్‌ఫియార్‌ను గోండుసైన్యాలు సంప్రదాయక ఆయుధాలతోనే ఎదుర్కొని ఓడించారు. యుద్ధంలో పరాజయాన్ని జీర్ణించుకోలేని బ్రిటి ష్ ప్రభుత్వం సెడ్మాకిని కొరియర్ ద్వారా నిర్బంధించడానికి ప్రణాళికలు చేసింది. క్రికటన్, నెక్స్‌పి యార్‌లు సెడ్మాకీని పట్టించిన వారికి కానుకగా జమీందారీగా నియమిస్తామని ప్రకటించారు. తనకు ఆమోదీ రాజపుత్రిక లక్ష్మీబాయి నమ్మినబంటు కావడంతో రక్షణార్థం ఆమె వద్దకు తరచూ వెళ్ళేవాడు. ఆమె సెడ్మాకీ పోరాట పటిమను ప్రశంసిస్తూ, తనవద్ద విశ్రాంతి తీసుకోవాలని కోరింది. నమ్మక ద్రోహంతో సైన్యానికి సమాచారం తెలపడంతో రాత్రికిరాత్రే నిద్రలోని సెడ్మాకీని బంధించి చంద్రాపూర్ తరలించారు. తెల్లదొరల కబంధ హస్తాల్లో 1858 అక్టోబర్ 21న ఉరితీయబడిన బాబురావ్ సెడ్మాకీ అజరామరుడు. స్వతంత్ర సంగ్రామంలో గోండ్వానా రాజ్యపరిరక్షణకు, గోండ్వానా స్వయంపాలనకు కృషిచేశాడు. సెడ్మాకీ ప్రపంచ ఆదివాసీల పోరాట చరిత్రలో ధ్రువతార. సెడ్మాకీ గోండ్వానా రాజ్య కోటలు నేటికీ చంద్రాపూర్‌లో దర్శనమిస్తాయి. సెడ్మాకీ నుంచి తెలంగాణలో కుమ్రంభీం దాకా ఆదివాసీలు తమ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన యోధులు. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్ళయినా ఆదివాసీలు తమ అస్థిత్వ, ఆత్మగౌరవ పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తూ జల్- జంగల్ -జమీన్ కోసం, స్వయంపాలనాధికారాల కోసం ఎదురు చూడటం తప్ప ఆదివాసీలకు వేరే గత్యంతరం లేదేమో!
 గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి
(మార్చి 12న వీరబాబురావ్ సెడ్మాకీ జయంతి)

English Title
Adivasi polar
Related News