వాట్సప్‌లో ‘మోమో’ చాలెంజ్

Updated By ManamTue, 08/07/2018 - 16:17
WhatsApp Momo Challenge
  • మరో బ్లూవేల్ చాలెంజ్

  • వాట్సప్‌లో వస్తున్న మోమో చాలెంజ్

  • తల్లిదండ్రులూ.. అప్రమత్తం

  • శిల్పం బొమ్మతో చాలెంజ్

  • జాగ్రత్తగా ఉండాలి: నిపుణులు

After Blue Whale Challenge, is Momo Challenge

లండన్ : నిన్న మొన్నటి వరకు హల్‌చల్ చేసిన బ్లూవేల్ చాలెంజ్ లాగే ఇప్పుడు మరో కొత్త చాలెంజ్ టీ నేజర్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ సరికొత్త మోమో చాలెంజ్ వాట్సాప్ ద్వారా వ్యాపిస్తోంది. వాట్సాప్‌లో ముందుగా ఓ శిల్పం బొమ్మ వస్తుందని, అందులో పలు చాలెంజిలు వస్తాయని చెబుతున్నారు. క్రమంగా అవి అందుకున్నవారి జీవితాలు ప్రమాదంలో పడతాయి. అచ్చం బ్లూవేల్ చాలెంజ్‌లాగే చాలా తీవ్రమైన ప్రవర్తన రూపంలో ఈ చాలెంజలు వస్తాయి.

ఏంటీ మోమో..?
వాట్సాప్‌లో ఓ శిల్పం బొమ్మ వస్తుంది. దాన్ని జపాన్‌కు చెందిన కళాకారుడు మిదొరి హయాషి తయారు చేశాడని అంటున్నారు. అయితే ఆ శిల్పానికి గానీ, ఈ కళాకారుడికి గానీ గేమ్‌తో సంబంధం లేదు. టోక్యోలోని వెనీలా గ్యాలరీలో ఉన్న ‘మదర్ బర్డ్’ శిల్పం ఫొటోనే ఇలా బయటకు వస్తోంది. దాంతోపాటు కొన్ని భయంకరమైన కళారూపాలు కూడా వస్తాయి. అర్జెంటీనాలో 12 ఏళ్ల అమ్మాయి ఈ చాలెంజ్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు బ్యూనస్ ఏర్స్ టైమ్స్ తెలిపింది. దాంతో ఆమెకు ఈ మెసేజిలు పంపింది ఎవరో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్పెయిన్ పోలీసులు కూడా మోమో చాలెంజితో జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

నిజమేనా.. ఉత్తదా?
వాస్తవానికి మోమో చాలెంజ్ అనేదాన్ని కొంతమంది సైబర్ నేరస్తులు వాడతారని, యూజర్ల సమాచారాన్ని దీనిసాయంతో వాళ్లు తస్కరిస్తారని నిపుణులు అంటున్నారు. ఈ గేమ్ ఇప్పటికి ఎంతవరకు వ్యాపించిందో తెలియదు గానీ, యువతలో మాత్రం ఆత్మహత్యకు ప్రేరేపించేలాగే ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి పనికిమాలిన చాలెంజిల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యువతతో పాటు తల్లిదండ్రులను కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఉచ్చులో పడొద్దని చెబుతున్నారు. 

English Title
After Blue Whale Challenge, is Momo Challenge Pushing Teens to Suicide on WhatsApp?
Related News