దూకుడు పెంచిన టీఆర్‌ఎస్

Updated By ManamThu, 09/06/2018 - 00:13
trs
  • ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్

  • 50 రోజుల్లో 100 బహిరంగ సభలు! 

  • 7న హుస్నాబాద్ సభతో తొలి అడుగు

  • తమ 4 ఏళ్ళ ప్రగతితో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్

imageహైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తన దూకుడును పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఎన్నికలు సమిపిస్తున్నాయంటూ చెబుతున్న అన్ని పార్టీల నేతల వాదనకు బలం చేకురినట్లయ్యింది. ఎన్నిక లు ఎప్పుడూ వచ్చిన తామంతా అందుకు సిద్దంగానే ఉన్నామని ఎవరికి వారు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఏ ఇద్దరూ ఎక్కడ కలిసినా అందరి నోట ఎన్నికల మాటే వినపడ్తుండటం చూస్తుంటే...ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయనడంలో సందేహం కలుగక మానదు. ఇక, ఇదంతా ఒక ఎత్తయితే, ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ జరిపిన ప్రగతి నివేదన సభలో గులాబి బాస్ ముందస్తు..ఎన్నికలకు సంకేతాలు ఇస్తారన్న అనుమానాలను పటాపంచెలు చేయడంతో.. ప్రతి పక్షాలన్ని టీఆర్‌ఎస్‌పై మండిపడుతూనే...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుకు సిద్దమేనని అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు.

అధికార పార్టీ తన నాలుగేళ్ల అభివృద్ధితో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంద నే ఊహగానాలే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆ వార్తాలను నిజం చేసే విధంగా నేడో..రేపో గులాబి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమే ఎక్కువగా ఉందన్న వార్తలు సైతం అన్ని పార్టీల్లో చర్చకు తెరతీస్తున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్‌ఎస్ తన ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేసింది. ఈనెల 7న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో అధికారుల భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత పది రోజుల్లోనే తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ రెండు సార్లు భేటి అయ్యారు. ఇదిలా ఉండగానే సీఎం కలిసిన రెండు, మూడు రోజుల తర్వాత ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సమావేశమయ్యారు.

ఈ భేటీకి ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అటు సీఎస్‌తో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతకు ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్‌వేర్ ఈఆర్‌వో నెట్ 2 వెర్షన్ అన్ని జిల్లాల ఎన్నికల విభాగం అధికారులకు శిక్షణ ఇచ్చి, వారిని ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తొంది. అయితే, ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తుందని రజత్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. వరుసగా గవర్నర్ నరసింహ్మన్‌తో ఉన్నతాధికారుల భేటీలు, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

English Title
Aggressive TRS
Related News