‘అజ్ఞాతవాసి’ మూవీ రివ్యూ

Updated By ManamWed, 01/10/2018 - 13:18
Agnathavaasi
agnathavaasi

చిత్రం: అజ్ఞాతవాసి

తారాగణం: పవన్ కల్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, బోమన్ ఇరాని, ఖుష్బూ, ఆది పినిశెట్టి, జ‌య ప్ర‌కాష్‌, రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప‌రాగ్ త్యాగి, ప‌విత్రా లోకేష్‌, ర‌ఘుబాబు, ఇంద్ర‌జ‌ తదితరులు

ఛాయాగ్రహణం: వి. మ‌ణికంథ‌న్‌

కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు

సంగీతం: అనిరుధ్‌

నిర్మాత: ఎస్.రాధాకృష్ణ

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

విడుదల: జనవరి 10, 2018

 

agnathavaasiకొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాయి. అలాంటి కాంబినేషనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సెన్సేషనల్ సృష్టించాయి. ‘జల్సా’ తర్వాత ఐదేళ్ళకు ‘అత్తారింటికి దారేది’ విడుదలైంది. ‘అత్తారింటికి దారేది’ విడుదలైన ఐదేళ్ళకు ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఇది పవన్ కల్యాణ్ కి 25వ చిత్రం కావడం విశేషం. ఎన్నో విశేషాల‌తో పాటు భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాపై 'మనం' అందిస్తున్న సమీక్ష మీ కోసం:

కథ:

agnathavaasiఎబి గ్రూప్ అధినేత గోవిందా భార్గవ్(బోమన్ ఇరాని). అత‌ని భార్య ఇంద్రాణి (ఖుష్బూ), కొడుకు మోహన్ భార్గవ్.  గోవిందా, మోహ‌న్‌ని ప్లాన్ ప్ర‌కారం చంపేస్తారు. తన భర్త, కొడుకుల‌ అనూహ్య మ‌ర‌ణం ఇంద్రాణికి ఓ పెద్ద షాక్‌. చ‌నిపోయేట‌ప్పుడు విందా కాల్‌లో రికార్డ్ చేసిన ప్ర‌కారం.. వీరి చావుకి కార‌ణం అత‌ని బోర్డు మెంబ‌ర్స్ వ‌ర్మ (రావు రమేష్‌), శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌) అని అర్థ‌మ‌వుతుంది. అయితే.. అస‌లు ఎందుకు చంపి ఉంటారు అనేది మిస్ట‌రీగా ఉండిపోతుంది. ఇది తెలుసుకోవ‌డం కోసం  ఆమె అస్సాం నుంచి ఒక యువకుడిని పిలిపిస్తుంది. అత‌నే బాల‌సుబ్ర‌మ‌ణ్యం (ప‌వ‌న్ క‌ల్యాణ్‌). అస‌లు విష‌యాలు రాబ‌ట్ట‌డం కోసం.. ఎబి గ్రూప్ ఆఫీస్‌లో ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు బాలు. అక్కడ శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) ఫోన్ డాటా ద్వారా ఈ హత్య గురించి తెలుసుకోవాలనుకుంటాడు బాలు. ఈ ప్రాసెస్ లో వాళ్లకు దగ్గరవడం కోసం శర్మ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్న సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయేల్)కి, అలాగే వర్మ కూతురు సుకుమారి (కీర్తి సురేష్)కి కూడా దగ్గరౌతాడు బాలు. అయితే తర్వాత బాలుకి..ఈ హత్యలతో శర్మ, వర్మలకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. మరి ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకోసం చేసారు? ఆ హత్యల తదనంతరం ఈ కంపెనీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? హత్యలు జరిగిన వెంటనే బాలునే ఎందుకు ఇంద్రాణి పిలిపించింది? మరి బాలు ఆ హత్య ఉదంతాన్ని ఛేదించాడా? ఇంతకీ హంతకుడు ఎవరు?  సీతారామ్ (ఆది పినిశెట్టి) ఎవరు? అభిషిక్త్ భార్గ‌వ్‌కి, బాలుకి సంబంధం ఏమిటి? ఎ.బి.గ్రూప్‌లోని ఎ.బి. ఎవ‌రు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ:

agnathavaasiపగ, ప్రతీకారంతో తెలిసిన కథనే మళ్ళీ తెరపై చూపించారు..త్రివిక్రమ్. కాకపోతే తన మార్కు కథనంతో, కామెడీతో, మాట‌ల‌తో సినిమాని ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా నడిపించేశారు. 'అత్తారింటికి దారేది'లో మేన‌త్త‌, మేన‌ల్లుడు బంధంని చ‌క్క‌గా చూపించిన త్రివిక్ర‌మ్‌.. ఈ సినిమాలో స‌వ‌తి త‌ల్లి, స‌వ‌తి కొడుకు మ‌ధ్య బంధం బాగా చూపించారు. ప్లాన్ బి అనే కాన్సెప్ట్‌ని త‌న స్క్రీన్ ప్లేలో చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నారు. శ‌ర్మ‌, వ‌ర్మ కామెడీ ట్రాక్ బాగా డిజైన్ చేసుకున్నారు. అయితే సినిమాని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో త‌న మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌లేక‌పోయారు. న‌టీనటుల విష‌యానికి వ‌స్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వన్ మాన్ షో చేసి సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. అస్సోంలో ఇచ్చే ఎంట్రీ సీన్ నుంచి చివ‌రి సీన్ వ‌ర‌కు అడుగ‌డుగున అభిమానుల‌ను అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. రొమాంటిక్ సీన్స్‌, ఆఫీస్ సీన్స్‌లో అమాయ‌కంగా క‌నిపిస్తూ ఇచ్చే హావ‌భావాలు అభిమానుల‌కు బాగా న‌చ్చుతాయి. త‌ను పాడిన 'కొడ‌కా కోటేశ్వ‌ర్రావా' పాట‌లో బాగా యాక్టివ్‌గా క‌నిపించారు. అలాగే సీరియస్ సీన్స్‌లో పవన్ పలికే సంభాషణలు చాలా బాగున్నాయి. ఇక తన కామెడీ టైమింగ్ తో సినిమాని మరో స్థాయికి తీసుకునివెళ్ళారు పవన్. ఇక హీరోయిన్స్‌ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ గ్లామ‌ర్ షో, కామెడీకి ప‌రిమిత‌మ‌య్యారు. ఆది మరోసారి స్టైలిష్ విలన్‌గా తన విలనిజంతో ఆకట్టుకున్నాడు. సవతి తల్లి అయినా... కన్న కొడుకు కంటే ఎక్కువగా స‌వ‌తి కొడుకు అభిని చూసుకునే పాత్రలో ఖుష్బూ నటన బాగుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ హుందాగా క‌నిపించింది. ఇక‌ వీలునామాలో తన వాటాను కూడా అభికే ఇచ్చేయమని భర్తకు చెప్పే సన్నివేశంలో ఆమె నటన చాలా బాగుంది. ఇక మురళీ శర్మ, రావు రమేష్‌లతో ప‌వ‌న్ సీన్స్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి.  మిగిలిన న‌టుల్లో భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ప‌విత్రా లోకేష్  పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. అనిరుధ్‌ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. అలాగే వాటి చిత్రీక‌ర‌ణ లావిష్‌గా ఉంది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అయితే సినిమాని మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది. పోరాట స‌న్నివేశాల్లో.. కొత్త త‌ర‌హాలో ఆర్‌.ఆర్‌. ఇచ్చాడు. మ‌ణికంథ‌న్‌ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. ప్ర‌తి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా ప్రెజంట్ చేసారు. కోట‌గిరి ఎడిటింగ్ మ‌రింత క్రిస్పీగా ఉండాల్సింది. ఇక మాటల విషయానికి వస్తే త్రివిక్రమ్ కలం.. మాటలు రాయడానికి తన పదునంతా చూపించింది. “కుందేళ్ళు కులాసాగా తిరుగుతున్నాయ్...సింహం సరదాగా రావొచ్చు”. “లారీ లాంటి శ్రుతి.. గులాబిలాంటి నా గుండెని తొక్కేసింది” “అందుకే లారీలు వెళ్ళే రోడ్లమీద పూలు పరచకూడదు” “అసలే మనకున్న క్రియేటివిటీ తక్కువ.. ఎక్కువ ఆలోచించకు” “ఆడు కన్నీళ్లు పెట్టుకున్నాడని కాఫీ షాపుకి తీసుకెళ్ళావ్...రేపు ఇబ్బందుల్లో ఉన్నాడని ఇంటిగ్గాని తీసుకొచ్చావ్”, “విమానంలో ఉన్నోళ్ళందరూ ఎగుర్తున్నామనే అనుకుంటారమ్మా...కాని విమానమే ఎగురుతాది”, '''సింహం పార్టీకి పిలిచింద‌ని.. జింక జీన్స్ ఫ్యాంట్ వేసుకుని పార్టీకి వెళ్ళింద‌ట‌'' అనే కామెడీ డైలాగులు.. “రాజ్యం మీద ఆశలేని వాడికంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు”తో పాటు ట్రైల‌ర్‌లో చూపించిన కుర్చీ డైలాగ్ అర్థ‌వంతంగా ఉన్నాయి.  నిర్మాణ విలువ‌ల‌కు ఎక్క‌డా వంక పెట్ట‌లేం.  

 

ప్ల‌స్ పాయింట్స్‌

పవన్ కల్యాణ్

కామెడీ

పాటలు, వాటి చిత్రీక‌ర‌ణ‌

అనిరుధ్ నేప‌థ్య సంగీతం

ఛాయాగ్రహణం

మాటలు

నిర్మాణ విలువ‌లు

 

మైన‌స్ పాయింట్స్‌

రొటీన్ స్టోరీ

ద‌ర్శ‌క‌త్వం

స్క్రీన్ ప్లే

ఎమోష‌న‌ల్ సీన్స్‌ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం

 

చివ‌ర‌గా.. ప్లాన్ బి.. ఫ‌ర్వాలేదు

రేటింగ్‌.. 3/5                   

English Title
Agnathavaasi movie review
Related News