వైద్యుల ధర్నా.. ఓపీ, సర్జరీలు బంద్..!

Updated By ManamFri, 04/27/2018 - 11:04
representational

aiims representationalన్యూఢిల్లీ: ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు నిరవధిక స్ట్రైక్‌కు (ధర్నా)కు పిలుపునిచ్చారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్‌ను ఫాకల్టీ మెంబర్ కొట్టడంతో ఎయిమ్స్ వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ఫలితంగా ఔట్ పేషెంట్ (ఓపీ) రోగులు, శస్త్రచికిత్సలపై పెను ప్రభావం పడనుంది. ఓపీ, శస్త్రచికిత్సలకు తీవ్ర విఘాతం కలగనుంది. దాంతో పాటు విద్యా సంబంధిత కార్యకలాపాలకూ నిరవధిక ఆటంకం ఏర్పడనుంది. వైద్యుల నిర్ణయంపై స్పందించిన ఎయిమ్స్ యాజమాన్యం.. ఫాకల్టీ సభ్యుడు క్షమాపణలు చెప్పారని, ఘటన జరిగిన వెంటనే పదే..పదే క్షమాపణలు కోరారని ప్రకటించింది. గురువారం కూడా క్షమాపణలు చెప్పారని తెలిపింది. క్షమాపణలు చెబితే ఎలాంటి చర్యలు తీసుకోబోనని బాధిత రెసిడెంట్ డాక్టర్.. డైరెక్టర్‌కు లేఖ రాశారని పేర్కొంది. అంతేగాకుండా ఈ ఘటనపై విచారించేందుకు రీసెర్చ్ డీన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని డైరెక్టర్ ఏర్పాటు చేశారని వివరించింది. బాధిత రెసిడెంట్ డాక్టర్‌కు సెలవు ఇచ్చేందుకూ అంగీకారం తెలిపినట్టు పేర్కొంది.

అయితే, రెసిడెంట్ డాక్టర్స్ మాత్రం పట్టు వీడడం లేదు. ఫాకల్టీ సభ్యుడు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ‘‘ఫాకల్టీ సభ్యుడితో కలిసి రెసిడెంట్ డాక్టర్ రౌండ్స్‌కు వెళ్లారు. అదే సమయంలో ఆ రెసిడెంట్ డాక్టర్ ఫోన్ మోగింది. దానిని ఆయన సైలెంట్‌లో పెట్టే ప్రయత్నం చేస్తూ కంగారు పడ్డాడు. ఆయన చేతిలోని మొబైల్‌ను లాక్కొన్న సదరు ఫాకల్టీ సభ్యుడు.. దానిని విసిరేసే ప్రయత్నం చేశారు. దానిని రెసిడెంట్ డాక్టర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా చెంప చెళ్లుమనిపించారు ఫాకల్టీ సభ్యుడు. దీంతో రెసిడెంట్ డాక్టర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు’’ అని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ హరిజిత్ సింగ్ భాటి తెలిపారు. 

English Title
AIIMS Doctors Call For Indefinite Strike
Related News