అజేయ భారత్.. అటల్ బీజేపీ

Updated By ManamSun, 09/09/2018 - 22:38
modi
  • వచ్చే ఎన్నికల్లో కమలం నినాదం.. కార్యవర్గ సమావేశంలో మోదీ పిలుపు

  • దివంగత వాజ్‌పేయికి అత్యున్నత గౌరవం.. ఆయన పాటించిన విలువలకు కట్టుబడ్డాం

  • కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్య.. వచ్చే 50 ఏళ్లు అధికారం బీజేపీదే: అమిత్‌షా

modiన్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘అజేయ భారత్..అటల్ బీజేపీ’ నినాదంతో ప్రజల్లోకి కమలదళం వెళ్లనుంది. ఢిల్లీలో  ఆదివారం రెండోరోజు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి సూచించిన మార్గంలో ప్రతి కార్యకర్తా నడవాలని సూచించారు. పార్టీ విలువలకు, దేశ పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, బీజేపీ పాలనలో దేశం పురోభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు అటల్ బిహారి వాజ్‌పేయికి అత్యున్నత గౌరవం కల్పిస్తూ వచ్చే ఎన్నికల్లో ‘అజేయ భారత్.. అటల్ బీజేపీ’ నినాదంలో ముందుకు పోనున్నామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదిరించే పార్టీయే లేదని, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు  వెళ్తున్నామని పేర్కొన్నారు. పరోక్షంగా రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల్లోని ఏ చిన్న పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే స్థితిలో లేవని ఎద్దేవా చేశారు. విపక్షాలు ఏకతాటిపై నిలబడలేవని, ఇందుకు అనేక అంశాల్లో బీజేపీ సాధించిన విజయాలే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని, దేశంలోని 125 కోట్ల మంది మద్దతు బీజేపీకే ఉందన్నారు. 

వచ్చే 50 ఏళ్లు అధికారం బీజేపీదే: అమిత్‌షా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, అంతేగాక వచ్చే 50 ఏళ్లు బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో రెండోరోజు ఆదివారం పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఉద్ఘాటించారు.

నవభారతం నిర్మిస్తాం
తమ కాషాయ పార్టీని ఓడించాలన్న ప్రతిపక్షం కలలు కల్లలుగానే మిగిలిపోతాయని బీజేపీ కుండ బద్దలుకొట్టింది. 2022 నాటికల్లా నవభారతాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి పార్టీ కట్టుబడి ఉండాలని తీర్మానం చేసింది. ప్రతిపక్షానికి ఒక నాయకుడూ లేడు.. ఒక విధానమూ లేదని, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నాయకుడని చెప్పింది. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో రాజకీయ తీర్మానాన్ని సీనియర్ నాయకుడు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. సమావేశానంతరం వివరాలను కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ మీడియాకు వెల్లడించారు. గత నాలుగేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేశామని, 2022నాటికి నవభారతాన్ని నిర్మిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ఒక దూరదృష్టి ఉందని, ప్రభుత్వం ఏం చేసిందో కనపడుతోందని తెలిపారు. 2022 నాటికి దేశంలో ఉగ్రవాదం, కులతత్వం, మతతత్వం ఉండవని, ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండరని ఆయన చెప్పారు. ప్రతిపక్షానికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదని, కేవలం ప్రధాని మోదీని ఆపడమే వారి లక్ష్యమని విమర్శించారు. 2019లో మరింత మెజారిటీతో బీజేపీ నెగ్గుతుందన్నారు. 

English Title
Ajay Bharat .. Atal bjp
Related News