వ్యవసాయ కమిషన్లన్నీ  కంటితుడుపులే-2

Updated By ManamThu, 08/23/2018 - 23:28
farmer

 farmerతీవ్ర అసంతృప్తితో ఉద్యమించేందుకు సంసిద్ధులవుతున్న వ్యవసాయ జనావళిని నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం వైపుకు కదలించలేకపోతే, అశేష గ్రామీణ బడుగు, బలహీన వర్గాల ఉపాధిని ధ్వంసంచేస్తూ భారీ వ్యవసాయ క్షేత్రాలు, జాతీయ వ్యవసాయ మార్కెట్లు, స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్ ట్రేడింగ్ రూపంలోని కార్పొరేట్ వ్యవసాయాన్ని ఈ సంక్షోభానికి పరిష్కారంగా తీసుకొచ్చేందుకు పాలకులు చొరవ చేస్తున్నారు. వ్యవసాయ సంక్షోభంతో ఆ రంగంపై ఆధారపడుతున్న ప్రజలను ఇతర రంగాలలో అనుబంధ, నైపు ణ్యరహిత కార్మికులుగా మారే విధంగా ప్రభుత్వాలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ రంగ సంక్షోభ పరిష్కారానికి వ్యవసాయదారుల జనాభాను పారిశ్రామిక రంగ అనుబంధ నైపుణ్య రహిత చౌక శ్రమశక్తిగా అంటే ‘అదనపు జనాభా’గా మార్చే ప్రభుత్వ విధానాల వల్ల రైతాంగ ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయి. అందులో భాగంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరు మీద వ్యవసాయయోగ్యమైన భూమిని ప్రభుత్వాలు కారుచౌకగా సేకరించి స్వదేశీ, విదేశీ కార్పొ రేట్ వర్గాలకు ధారాదత్తం చేస్తున్నాయి. వ్యవ సాయరంగ కారణాలను ఉత్పత్తి పార్శ్వంలో గాక, పంపిణీ - వినిమయ పార్శ్వంలో నుంచి... గిట్టుబాటు ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోవడం, రుణభారం, దళారీ వ్యవస్థ తదితర అంశాల్లో చూపించడం; 70 శాతం నష్టాల ఊబిలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని పట్టుకు వేలాడకుండా ఇతర పారిశ్రామిక, సేవలరం గానికి తరలిపోయేందుకు వ్యవసాయ జనాభాను ప్రోత్సహించడం; అంతర్జాతీయ వ్యవసాయ మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవసాయ క్షేత్రాలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి, వారిని కార్పొరేట్ వ్యవసాయ క్షేత్రాలకు వ్యవసాయ ‘అదనపు జనాభా’గా మార్చేందుకు రంగం సిద్ధంచేసే విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టి స్తున్నాయి. 

సమాజంలోని ఆస్తి సంబంధాల పునాదిగా మిగతా ఉత్పత్తి సంబంధాలైన శ్రమ సంబంధాలు, పంపిణీ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఒక వ్యవ స్థలో తలెత్తే సంక్షోభపు తల్లివేరు కేంద్రం శ్రమ సంబంధాలు, పంపిణీ సంబంధాల్లో కాక, ఆ సమాజపు ఆస్తి సంబంధాల్లో ఉంటుంది. ఆస్తి సంబంధాల విప్ల వాత్మక పునర్నిర్మాణంపై ఆధారపడి శ్రమ సంబంధాలు, పంపిణీ సంబంధాల్లో మౌలిక మార్పులు సంభ వించడం కద్దు. నేడు దేశంలో సుడులు తిరుగుతున్న వ్యవసాయ సంక్షోభం యంత్రాలు తదితర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడం, దళారీ వ్యవస్థ వంటి ‘వినిమయ పార్శ్వ’ సమస్యల్లో లేదు. అందుకు భిన్నంగా 90 శాతం దాకా చిన్న కమతాల్లో సాగవుతున్న పరిస్థితి, 70 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, దళిత సమూహాలకు చెందినవారు కౌలు రైతులుగా మారడం వంటి భూ యాజమాన్య సంబంధాల్లో సంక్షోభాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. దేశ వ్యవసాయ రంగం 70శాతానికి పైగా నష్టదాయకంగా మారడానికి ప్రధాన కారణం చిన్న కమతాల్లో సేద్యం చేయడమే. లక్షల ఎకరాలు సొంతంగా కలిగిన  భూస్వాములున్నప్పటికీ వారి సేద్యం భారీ కమతాల్లో కాక, కౌలు రైతుల ద్వారా చిన్న కమతాల్లోనే వ్యవసాయం చేయిస్తారు. పెట్టుబడిదారీ వ్యవసాయం భారీ కమతాల్లో ‘సమిష్టి శ్రమ’ ద్వారా, యంత్రాల ద్వారా సాగితే, భూస్వామ్య వ్యవసాయం చిన్న కమతాల్లో కౌలు రైతుల ద్వారా వైయక్తిక శ్రమ రూపంలో సాగుతుంది. భూస్వామ్యం లేదా ఆసియాటిక్ ఉత్పత్తి విధానంలో ఉన్న భారత్‌ను బ్రిటిష్ పెట్టుబడిదారీ విధానం వలసగా మార్చింది. అంటే భారత్‌లోని భూస్వామ్య/ ఆసియాటిక్ ఉత్పత్తి సంబంధాలన్నీ వలస సంబంధాలుగా మారడంతో వ్యవసాయ సంబంధాల్లో మౌలిక మార్పులు సంభవించాయి. భారత్ దేశపు వ్యవసాయ మిగులు ఉత్పత్తిదారుల వద్దనో, స్థానిక జమీందారుల వద్ద మాత్రమే పోగవలేదు. ఆ మిగుల్లో అధిక భాగం రైత్వారీ, జమీందారీ విధానాల ద్వారా సంచయనమై, ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రమైన బ్రిటన్ పారిశ్రామిక వ్యవస్థను పెంచేందుకు తరలిపోయింది. ఆ రకంగా భారత దేశ మిగులు ప్రపంచ పెట్టుబడిదారీ విధానంతో అనుసంధానం కావడమే కాదు, అంతర్భాగమైంది. 

ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి మార్కెట్లు, శ్రమశక్తి మార్కెట్లు, ముడిసరుకుల మార్కెట్లు, సరకుల మార్కెట్లుగా విభజితమైంది. ఉత్తరార్ధ గోళ పారిశ్రామిక దేశాలు ఉత్పత్తి మార్కెట్లుగా ప్రపంచార్థిక వ్యవస్థకు ‘కేంద్రం’ కాగా, అదే శ్రమశక్తి మా ర్కెట్లు, ముడిసరుకుల మార్కెట్లు, సరుకుల మార్కెట్ల యిన దక్షిణార్ధగోళ జీవవైవిధ్యం మెండుగా ఉన్న వ్యవసాయక దేశాలు ప్రపంచార్థిక వ్యవస్థకు పొలిమేర ప్రాంతాలుగా మారాయి. పెట్టుబడి సమీకరణ సాంద్రీ కరణ (ఒకే రంగంలోని శ్రమ జీవులు సృష్టించే  అదనపు విలువ) , కేంద్రీకరణ (ఇతర పారిశ్రామిక రంగాలను సంశ్లేషించడం ద్వారా ఆయా రంగాల అదనపు విలువలు కూడా వచ్చి చేరడం) అనే రూపాలలో ఏకకాలంలో సాగుతుంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రంలో  ‘సాంద్రీకరణ’ ప్రధానంగాను, దానికి అనుబంధంగా కేంద్రీకరణ రూపంలో పెట్టుబడి సమీకరణ జరుగుతుంది. అదే ‘పొలిమేర’ వ్యవసాయక దేశాలలో పెట్టుబడి సాంద్రీకరణ ప్రధానంగా, కేంద్రీకరణ అనుబంధ రూపంలో విస్తరిస్తుంది. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేంద్రంలోని పెట్టుబడిదారీ సంబంధాలకు, పొలిమేర దేశాల్లోని పెట్టుబడిదారీ సంబంధాలకు వ్యత్యాసం ఏర్పడింది. భారత్‌లోని విడివిడి భూస్వాముల వద్ద పోగుపడిన రైతాంగం సృష్టించినత అదనపు విలువ సమీకరణ ప్రవాహాన్ని దారి మళ్లించడం ద్వారా బ్రిటిష్ పెట్టుబడి మరింత పెంపొందింది. దాంతో స్థానిక భూ ఆస్తి సంబంధాలు బ్రిటన్ పెట్టుబడికి అనుబంధంగా మారడమే కాకుండా, ఒక విధంగా అంతర్భాగమయ్యాయి. భారత భూస్వామ్య సంబంధాలు రూపొంతరం చెంది వలస సంబంధాలుగా మారి బ్రిటన్ పెట్టుబడిదారీ సంబంధాలతో అనుబంధితమయ్యాయి. అలా భారత్ వంటి వ్యవసాయ ప్రధాన దక్షిణార్ధ గోళంలోని ఆర్థిక సంబంధాలు ప్రపంచ పెట్టుబడిదారీ విధానంతో అనుబంధితమవడం ద్వారా పొలిమేర ప్రాంతదేశాల్లో ఒక ప్రత్యేక తరహా పెట్టుబడిదారీ సంబంధాలుగా అవతరించాయి. ఈ క్రమం సామ్రాజ్యవాద దశలో (పెట్టుబడిదారీ విధాన అత్యున్నత దశ) మరింత వేగవంతమైంది. గ్లోబల్ ద్రవ్య పెట్టుబడికి అనుబంధంగా, దాని యంత్రాంగం పరిధిలోని బ్యూరాక్రటిక్ పెట్టుబడిదారీ సంబంధాలు (దేశ, విదేశీ కార్పొరేట్ పెట్టుబడి సారథ్యంలో ప్రభుత్వ పెట్టుబడి, భూస్వామ్య మిగులుతో కలగలసిన మిశ్రమ పెట్టుబడి)తో కూడిన పొలిమేర ప్రాంత పెట్టుబడిదారీ సమాజం భారత్ వంటి దక్షిణార్ధగోళ వ్యవసాయక దేశాలలో ఆవిర్భవించింది. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు తదితర వ్యవసాయోపకరణాల వ్యాపారం చేసే దేశ, విదేశీ అగ్రి బిజినెస్ కన్సార్టియం రూపంలో ఆ మిశ్రమ పె ట్టుబడి వ్యవసాయ రంగాన్ని పీల్చి పిప్పి చేస్తుండడంతో సంక్షోభ తీవ్రత శృతిమించి చిన్న కమతాల రైతులు, కౌలుదారులు రుణగ్రస్థులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

దేశంలోని భూస్వామ్య విధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వ్యవసాయ బ్యూరాక్రటిక్ పెట్టుబడిదారీ విధానంగా రూపాంతరం చెందింది. గ్రామాలలో పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలు అమ్మే కొట్టు యజమాని నుంచి దేశ, విదేశ విత్తన, ఎరువుల, పురుగు మందుల కంపెనీలతో అనుబంధితమైన పెద్ద అంతర్జాతీయ యంత్రాంగం వ్యవసాయరంగాన్ని తన కబంధ హస్తాల్లో బంధించింది. ఈ మిశ్రమ పెట్టుబడి సారాంశంతో ఏర్పడిన ప్రభుత్వాలు భూస్వామ్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో కాగితాలకు పరిమితమైన భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని రూపొందించాయేగానీ, ఎన్ని ఎకరాల భూమిని సాగుచేస్తే, రైతుకు నష్టం ఉండదో సూచించే ‘భూ కనిష్ఠ పరిమితి చట్టాన్ని’ రూపొందించాలనే స్పృహే వాటికి లేదు. ఏడాదికి ఎకరాకు పదివేల రూపాయల ఆదాయం వస్తే, ఒక చిన్న రైతు కుటుంబం భరోసాగా జీవించడానికి కనీసం 20 ఎకరాల భూమి అవసరం ఉంటుందని నిపుణుల అంచనా. అంతకంటే తక్కువ పరిమాణంలో భూమిని సాగుచేస్తే వ్యవసాయం నష్ట దాయకంగా మారుతుంది. అందువల్ల సాగుభూమికి సంబంధించిన ‘కనిష్ఠ భూ పరిమితి’ని ప్రభుత్వం నిర్ణయించాలి. రైతులు నష్టాల్లో కూరుకుపోకుండా కనీసం అవగాహన కోసమైనా ‘కనిష్ఠ భూ పరిమితి’ అవగాహన ఉపకరిస్తుంది. భూ కనిష్ఠ పరిమితికి దిగువన ఉన్న రైతాంగానికి పాశ్చాత్య దేశాల్లోలాగా ఉత్పత్తి కారకాల కొనుగోళ్ళు, మార్కెటింగ్‌లో 50 శాతానికి పైగా ప్రత్యక్ష సబ్సిడీ అంద జేయగలిగితేనే రైతు ఆత్మహత్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు వ్యవసాయ దేశాల నుంచి పెద్ద ఎత్తున ‘లాభాలు’ గడిస్తున్నాయి కాబట్టి తమ దేశ వ్యవసాయ రంగానికి భారీ సబ్సిడీలను అందించి ప్రోత్సహించ గలుగుతున్నాయి. భారత్ వంటి వెనకబడిన వ్యవసాయక దేశాలు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి సబ్సిడీల ద్వారా, గిట్టుబాటు/లాభసాటి ధరలు కల్పించే విధానాల ద్వారా వ్యవసాయరంగ సంక్షోభాన్ని పరిష్కరించగలిగే అవకాశం దక్షిణార్ధ గోళ వ్యవసాయ దేశాలలో లేదు. అలాంటి చర్యలతో పరిష్కారాలు సాధ్యం కావు. అవి కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగులుతాయి. అయితే సమకాలీన పారిశ్రామిక వ్యవసాయ మార్కెటింగ్ వాతావరణంలో చిన్న కమతాల స్థానంలో భూ కనిష్ఠ పరిమితి పునాదిగా పెద్ద కమతాలు లేదా పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో సాగుచేసే లాభసాటి వ్యవసాయ ఉత్పత్తి పద్ధతి అమలులోకి తీసుకురాగలిగితే ప్రపంచ మార్కెట్ పోటీలో మన రైతాంగం మనగలుగుతుంది. 

వ్యవసాయ అదనపు విలువ పంపిణీని నిర్ణయించే వ్యవసాయక ఉత్పత్తి పార్శ్వమైన ఆస్తి/యాజమాన్య సంబంధాల మౌలిక పరివర్తనలోనే వ్యవసాయ సంక్షోభ పరిష్కారముంటుంది. దేశంలోని వ్యవసాయ రంగ బ్యూరోక్రటిక్ ఆస్తి సంబంధాలు వ్యవసాయ మిగులును దిగమింగుతూ, ఉత్పత్తిదారులైన రైతులను/కౌలుదారులను బికారులుగా, రుణ గ్రస్థులుగా మార్చుతూ ఆత్మహత్యలు చేసుకునేందుకు పురిగొల్పుతోంది. ఉత్పత్తి సాధనాలపై నేరుగా పెత్తనం లేకపోయినా వివిధ పారిశ్రామిక రంగాల్లోని అదనపు విలువను స్వాయత్తం చేసుకుంటున్న, పెత్తనం చేస్తున్న ద్రవ్యపెట్టుబడిలాగా, వ్యవసాయక బ్యూరోక్రటిక్ పెట్టుబడి వ్యవసాయ రంగంలో పుట్టే అదనపు విలువనంతా స్వాయత్తం చేసుకొని రైతుల జీవితాలను శాసిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయక ఆస్తి సంబంధాలలో మౌలిక మార్పులు రాకుండా ఆ రంగంలో సంక్షోభం పరిష్కారం కాదు. ప్రకృతి-సమాజం మధ్య ఆదాన ప్రదానాలకు, సమతుల్యతకు విఘాతం కలిగించని ‘సహకార/సమిష్టి వ్యవసాయ క్షేత్రాల’ రూపంలోని ఆస్తి సంబంధాలతో కూడిన ‘సహచరిత ఉత్పత్తిదారుల’ (అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్) వ్యవస్థ నిర్మాణమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమని సోషలిస్టుల అభిప్రాయం. అందుకోసంతీవ్ర అసంతృప్తితో ఉద్య మించేందుకు సంసిద్ధులవుతున్న వ్యవసాయ జనావ ళిని నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం వైపు సోషలిస్టులు కదలించలేకపోతే, అశేష గ్రామీణ బడుగు, బలహీన వర్గాల ఉపాధిని ధ్వంసంచేస్తూ భారీ వ్యవసాయ క్షేత్రాలు, జాతీయ వ్యవసాయ మార్కెట్లు, స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్ ట్రేడింగ్ రూపంలోని కార్పొరేట్ వ్యవసాయాన్ని ఈ సంక్షోభానికి పరిష్కారంగా తీసుకొచ్చేందుకు పాలకులు చొరవ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!

Tags
English Title
All of the agricultural commissions are contagious
Related News