పొత్తుల కసరత్తు

Updated By ManamWed, 08/29/2018 - 05:39
Congress
  • కూటమిపై కాంగ్రెస్‌లో చర్చోపచర్చలు.. మహాకూటమి తరహాలో మరో ప్రయత్నం

  • కలిసి పోటీ చేస్తే అధికార పార్టీకి చెక్!.. టీఆర్‌ఎస్ ద్వంద్వ వెఖరిని ఎండగట్టాలి

  • టీడీపీతో పొత్తుకు ఓకే చెప్పిన నేతలు.. ఇబ్బందిలేని సీట్లు ఇతరులకు ఇవ్వొచ్చు


హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. దీనిపై వివిధ స్థాయిల్లో, పార్టీ నాయకులతో పీసీసీ నాయకత్వం చర్చి స్తోంది. మంగళవారం నాడు పీసీసీ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు, ఏఐసీసీ సభ్యులు, శాసనసభ, శాసన మండలి నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో ఎన్నికల గురించి విస్తృతంగా చర్చించింది. బుధవారం అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు. గాంధీభవన్‌లో మంగళవారం నాడు జరిగిన సమావేశంలో జిల్లాల అధ్యక్షులు, పీసీసీ నాయకులు చాలా మంది రాష్ట్రంలో పొత్తులు పెట్టుకోవాలని నాయకత్వానికి సూచించారు. పార్టీకి ఇబ్బందిలేని సీట్లను కలిసి వచ్చే పార్టీలకు కేటాయిస్తే బాగుంటుందని వీరు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నాయకులు వ్యక్తం చేశారని తెలిసింది. టీడీపీకి అన్ని జిల్లాల్లో బలమైన కార్యకర్తలు ఉన్నారని, వీరి మద్దతు ఉంటే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడం మరింత సులువు అవుతుందని ఈ నాయకులు సమావేశంలో అభిప్రాయపడ్డారని తెల్సింది. పొత్తు కుదిరితే కనీసం 15 సీట్ల వరకు టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. టీడీపీతో పొత్తు విషయాన్ని పీసీసీ స్థాయిలో కాకుండా ఏఐసీసీ స్థాయిలో సంప్రదిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడితో సోనియా లేకుంటే రాహుల్ గాంధీ మాట్లాడితే పొత్తు కుదరడం ఖాయమని అంటున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే చాలా స్థానాల్లో బలాబలాలు తారుమారు కావడం ఖాయమని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు.

image


తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోనూ పొత్తుల గురించి సంప్రదించాలని పీసీసీ నిర్ణయించింది. కోదండరాం ఎన్ని సీట్లు, ఏ సీట్లు కోరుతారన్న దానిపై పొత్తు ఆధారపడి ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. మహాకూటమి తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టాల్సిన బాధ్యత తమపై ఉందని మరో సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. పొత్తులు ఫలప్రదం కావాలంటే పట్టువిడుపులు అవసరం అవుతాయని, సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సిన చోట కాంగ్రెస్ పోటీదారులకు మరో ప్రత్యామ్నాయం చూపించాలని, అప్పుడే విజయం సాధించగలమని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేని నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాల్సి ఉంటుందన్నారు. 

ముందస్తు ఎన్నికలు ముంచుకు వస్తున్నందున పొత్తుల విషయాన్ని సాధ్యమైంత త్వరగా తేల్చి, క్షేత్ర స్థాయికి వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సమావేశంలో చాలా మంది నాయకులు పీసీసీ నాయకత్వానికి సూచించారు. సీపీఐ గతంలోనే తాము కాంగ్రెస్‌తోనే కలిసి ఉంటామని ప్రకటించినందున సీట్ల సంఖ్య విషయంలోనే చర్చలు జరపాల్సి ఉంటుందని పీసీసీ నాయకులు చెబుతున్నారు. సీపీఎం కలిసి వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కవేనని పీసీసీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. సీపీఎం ఇప్పటికే  బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసింది. జనసేనతో జతకట్టేందుకూ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్‌ఎస్ ఒక వైపు ఎంఐఎంతోనూ, మరో వైపు బీజేపీతోనూ ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని, రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చినా, బీజేపీతో స్నేహం చేస్తున్న టీఆర్‌ఎస్‌తో పోతు పెట్టుకుంటే దాన్ని ముస్లింల్లోకి తీసుకుపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. జిల్లాల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు సాధించగలిగితే టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు ఎంఐఎంను టార్గెట్ చేయనున్నారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ మరోసారి మహాకూటమి తరహాలో పొత్తులు పెట్టుకునే అవకాశం స్పష్టంగా ఉంది.

అభ్యర్ధుల ఎంపికకు కమిటీ
ఎన్నికలెప్పుడొచ్చినా మేం రెడీ : ఉత్తమ్ 
బేషరతుగా వచ్చేవారిని చేర్చుకుంటాం

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలొస్తే తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటిం చారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికకు సెప్టెంబర్‌లో కమిటీ వేస్తామని  చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత సమావేశంలో  పీసీసీ కార్యవర్గం , ఏఐసీసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్ రామచంద్ర కుంతియాతో పాటు, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తదిత రులు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికల కసరత్తులో భాగంగా బుధవారం నాడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులతో విమర్శించారు. రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలోధర్నా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని,  ఆక్రమణలకు గురైన వక్ప్ బోర్డు భూముల్లో ఒక్క సెంటు కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు. మైనార్టీలకు కేటాయించిన నిధుల్లో 3,500 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. 2014-15లో రుణాల కోసం లక్షా 53 వేల మంది ముస్లిం యువత దరఖాస్తు చేసుకుంటే, కేవలం 14 వేల మందికి మాత్రమే ఇచ్చారని, తరు వాత ఏ సంవత్సరంలోనూ కనీసం ధరఖాస్తులు కూడా తీసుకోలేదన్నారు.  బీసీల సబ్ ప్లాన్ అమలు చేస్తామని, ఏడాదికి 5 వేల కోట్ల చొప్పున బడ్జెట్ లో కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ ఆ వర్గాలను మోసం చేశారన్నారు. 

అది ఆవేదన సభ 
కేసీఆర్ నిర్వహిస్తున్నది ప్రగతి నివేదన సభ కాదని, ఆది ఆయన ఆవేదన సభ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఏం చేశారని ప్రగతి నివేదన సభలో ప్రజలకు చెబుతారని ప్రశ్నించారు. ఈ సభకు ధీటుగా సభ పెట్టాలని సమావేశంలో వచ్చిన సూచనను ఆమోదించారు. ఈ సభకు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు.  బస్సు యాత్ర విషయంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగేది స్పష్టత వచ్చిన తరువాత పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అభ్యర్ధిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 70 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకుంటామని ఉత్తమ్ చెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ నేత  ఉద్యోగానికి రాజీనామా చేసి కుంతియా, ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

బీజేపీతో పొత్తు కోసమే కేసీఆర్ ఆరాటం: భట్టి
బీజేపీతో పొత్తు కోసమే కేసీఆర్ ఆరాటపడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్‌కు బీజేపీ కావాలి, ఎంఐఎం కావాలని, ఒకే సారి ఎన్నికలు జరిగితే మునిగిపోతామన్న భయంతోనే ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారని చెప్పారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలకు అంత మంచిదన్నారు. ఎన్నికలు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను కమిటీ చూసుకుంటుందని, గెలుపు అవకాశాలపై సర్వేలు కూడా కీలకమన్నారు. నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని సరైన రీతిలో ఖర్చు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నీళ్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, నిధులు మాత్రం ఖర్చుఅయ్యాయని విమర్శించారు.

English Title
Alliances
Related News