కుక్కలు, పిల్లులు, పాములు

Updated By ManamFri, 04/06/2018 - 17:36
amit shah takes jibe at opposition
  • ప్రతిపక్షాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్య వ్యాఖ్యలు

amit shah takes jibe at oppositionన్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్షాలపై వాడివేడి విమర్శలు చేశారు. విపక్షాలను జంతువులతో పోల్చారు. మోదీ ప్రభంజనం నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవన్నీ ఒక్కటవుతున్నాయని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవుతాయన్న ప్రచారం సాగుతోంది. ఎప్పుడైనా భారీ వరద వస్తే.. ఆ వరద నుంచి తప్పించుకోవడానికి పాములు, ముంగీసలు, పిల్లులు, కుక్కలు, చిరుతలు, సింహాలు అన్నీ పెద్దపెద్ద చెట్లెక్కేస్తాయి. అలాగే ఈ విపక్షాలు కూడా’’ అని అమిత్ షా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీని ఓడించాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో.. వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయన్నారు. బూటకపు హామీలతో కాకుండా నాలుగేళ్ల పాలనలో తాము చేసిందేంటో చెప్పి అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ప్రధాని మోదీపై పూర్తి నమ్మకముందని, 2019లో మళ్లీ తమదే అధికారమని అన్నారు. ఇక, ఎస్సీ/ఎస్టీ చట్టానికి మార్పులు చేయాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. తాము రిజర్వేషన్లను రద్దు చేయబోమని, వేరే వాళ్లను రద్దు చేయనివ్వబోమని స్పష్టం చేశారు. తాము రిజర్వేషన్లను రద్దు చేస్తున్నామంటూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను రద్దు చేయబోమని ఆయన తేల్చి చెప్పారు.

English Title
amit shah takes jibe at opposition
Related News