శ్రీమఠాన్ని సందర్శించిన అమిత్ షా

Updated By ManamSat, 09/01/2018 - 23:26
Amit Shah
  • రాఘవేంద్రస్వామి కటాక్షంతో దేశం సుభిక్షంగా ఉండాలి : బీజేపీ జాతీయాధ్యక్షుడు

imageమంత్రాలయం: మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి మఠాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం సందర్శించారు. మంత్రాలయంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా, శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో రాఘవేంద్రస్వామి పీఠానికి శనివారం ఉదయం విచ్చేశారు. మఠం సాంప్రదాయాల మేరకు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత అమిత్‌షా గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం శ్రీమఠంలోని జగద్గురువులు శ్రీరాఘవేంద్రస్వామి సజీవ బృందావనం సన్నిధికి చేరుకొని విశిష్ట పూజలు నిర్వహించారు.

పీఠాధిపతి ఆశీర్వాద గదిలో శ్రీసుభుదేంద్రతీర్థులు శ్రీరాఘవేంద్రస్వామి విశిష్టతను, మహిమను అమిత్ షాకుimage తెలియజేశారు. ఆ తర్వాత పీఠాధిపతి అమిత్ షాను మఠం సాంప్రదాయాల మేరకు సన్మానించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేసి, తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆపై అమిత్ షా శ్రీమఠం నిర్వహణలో కొనసాగుతున్న గోశాలను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీసుజయీంద్ర ఆరోగ్యశాల దగ్గర అమిత్‌షా విలేకరులతో మాట్లాడారు. జగద్గురువు శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన కారణంగా మంత్రాలయం ఎంతో చారిత్రక విశిష్టతను సంతరించుకోవడమేగాక పుణ్యభూమిగా రూపుదిద్దుకొందన్నారు. మంత్రాలయం క్షేత్ర దర్శనం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. స్వామి కృపాకటాక్షాలతో దేశం సుబిక్షంగా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ కొనసాగిస్తున్న ప్రజారంజక పాలనతో సంతసించిన దేశవాసులు మరోమారు మోదీనే ప్రధానిగా ఎన్నుకోవడానకి సిద్ధంగా ఉన్నారని అమిత్ షా అన్నారు.

English Title
Amit Shah, visited Sree Matham
Related News