అనంతలో కరువు యాత్ర

Updated By ManamTue, 01/23/2018 - 10:16
pawan kalyan yatra

2019లో ఇరు రాష్ట్రాల్లో జనసేన పోటీ
ఒంగోలులో ఫ్లోరోసిస్ బాధితులను కలుస్తా
కొవ్వాడ అణు విద్యుత్‌పై అవగాహన యాత్ర

 సమస్యలపై పరిష్కారానికే రాజకీయాలు
 ఎవరి లబ్ధి కోసమూ పార్టీ పెట్టలేదు: పవన్
 ప్రస్తుతం సినిమాలపై దృష్టి లేదని ప్రకటన

pawan kalyan yatraకరీంనగర్, జనవరి 22 (మనం న్యూస్ బ్యూరో):
 అనంతపురం జిల్లాలో ఈ నెల 27 నుంచి కరువు యాత్ర చేపట్టనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సోమవారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన తన రాజకీయ ప్రణాళికను వివరించారు. పార్టీ కార్యాలయాలను అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించామని, అక్కడి నుంచి ఏపీలో తన ప్రజాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం ఒంగోలులో ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలుస్తామని, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ పర్యటిస్తామని పేర్కొన్నారు. అలాగే కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వెళ్తామని, దీనిపై  అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. అయితే అనంతపురం పర్యటన పూర్తయిన తర్వాత ఇతర జిల్లాల పర్యటన తేదీలను ఖరారుచేస్తామని పవన్ వెల్లడించారు. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పుడే చెప్పలేమని, తమ పార్టీ బలమెంత అనేది ఎన్నికలకు రెండు నెలల ముందు తెలుస్తుందని, అప్పుడే నిర్ణయం తీసుకోగలుగుతామని చెప్పారు. అయితే తన రాజకీయాలతో చిరంజీవికి సంబంధం లేదని, కుటుంబంలో ఎవరి మద్దతు కోరలేదని, కోరబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం సినిమాలపై ఇక తనకు దృష్టి లేదని వెల్లడించారు. తమ పార్టీని బీజేపీ అసలు గుర్తించడం లేదని, పార్టీ పెట్టడం ఎందుకు బీజేపీలో చేరాలని అమిత్ షా తనకు సూచించారని, ఆయన ప్రతిపాదనను తాను సున్నితంగా తిరస్కరించానని పవన్ చెప్పారు. సమస్యల పరిష్కారం కోసమే తాను రాజకీయాలు చేస్తానని, ఎవరికీ లబ్ధి చేకూర్చడానికి పార్టీ పెట్టలేదని వివరించారు. 
ఇరు తెలుగు రాష్టాల్లో చాలా సున్నితమైన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి పోరాడుతామని అన్నారు. విధ్వంసపూరిత రాజకీయాలు చేయబోనని, తాను ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసే వ్యక్తిని కాదని, జనసేన ప్రతి అడుగు నిర్మాణాత్మకంగా ఉంటుందని చెప్పారు. ఓటుకు నోటు అంశం తప్పని తనకు తెలిసినప్పటికీ రాజకీయంగా అస్థిరతకు కారణమవ్వడం ఇష్టంలేక మౌనంగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు ఈ పని అన్ని పార్టీలు చేస్తున్నదేనని అభిప్రాయపడ్డారు. కాగా, దశాబ్దాల పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై తమ పార్టీ బృందం అధ్యయనం చేస్తోందని చెప్పారు. అలాగే అన్ని జిల్లాల కార్యకర్తలతో చర్చించి.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సూచనలు చేస్తామని అన్నారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ప్రేమ ఉందని, ఇక్కడ కూడా తనకు అభిమానులు ఉన్నారని, రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణపై అవగాహన ఉన్న మేధావులతో జనసేన చర్చిస్తోందని, వారు పార్టీలోకి రాకపోయినా.. వారి సలహాలతో ముందుకు వెళ్తామని పవన్ చెప్పారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు వివరించారు.
కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటి?
సీఎం కేసీఆర్‌ను కలవడంపై వచ్చిన ఆరోపణలను పవన్ కల్యాణ్ ఖండించారు. సీఎం కేసీఆర్‌కు తాను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయనను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్ష కేసీఆర్ వల్లే సాకారమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ ఏకీకరణ చేసిన ఘనత ఆయనదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారని, ఆయన చేయగలిగింది చేస్తున్నారని పవన్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటి పరిష్కారానికి జనసేన చేయగలిగిన సాయం చేస్తుందని వెల్లడించారు.

కొండగట్టు ఆంజనేయస్వామిని నమ్మితే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం కొండగట్టుకు బయలుదేరిన పవన్‌కు ఆయన భార్య అన్నా లెజినోవా హారతి ఇచ్చి.. బొట్టు పెట్టి సాగనంపారు. ఆయన కారుకు మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి పంపారు. అంతకు ముందు పార్టీ మహిళా విభాగం ‘వీర మహిళ’ ఫేస్‌బుక్ పేజీని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకుని అంజన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అంజన్న దయ వల్లే. నేను 2009 ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఆయన దయతో ప్రాణాలతో బయటపడ్డా. నేను సంపూర్ణ రాజకీయ జీవితంలోకి రావాలనుకున్నప్పుడు కొండగట్టు అంజన్నను దర్శించుకోవాలనుకున్నాను. అంజన్నను నమ్ముకుంటే అసాధ్యాలైనా సుసాధ్యం కావాల్సిందే. అందుకే ఇక్కడి నుంచే ప్రజా యాత్ర ప్రారంభిస్తున్నా’ అని చెప్పారు. కాగా, ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.11 లక్షల విరాళాన్ని అందజేశారు.
 

English Title
anantalo karuvu yatra
Related News