పేదలకు మరో ఐదు లక్షల ఇళ్లు 

Updated By ManamMon, 09/10/2018 - 23:54
babu
  • జనవరి నాటికి అన్ని పూర్తి చేస్తాం

  • జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తాం

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

babuఅమరావతి: రాష్ట్రంలో పేదలకు మరో ఐదు లక్షల ఇళ్లు కేటాయిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ. 60వేల కోట్లతో పేదలకు రూ.25 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. 2022 నాటికి పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.4వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. గతంలో పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 20వేలు  మాత్రమే ఇచ్చేవారని, టీడీపీ అధికారంలో రాగానే రూ. లక్షన్నర వరకు సబ్సిడీగా ఇస్తున్నామని తెలిపారు. కుప్పంలో జీ+1 ప్రయోగ పద్ధతిలో రెండు వేలు ఇళ్లు కట్టించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇళ్లు కట్టించేందుకు,  భూ సేకరణకు రూ. 500 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదలకు త్వరలోనే పట్టాలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే విశాఖపట్నంలో పేదలకు 60వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఇళ్లు దెయ్యాలు కొంపలుగా మారాయన్నారు. ఆ ఇళ్లను ఒక్కో ఇంటికి రూ.10వేలు ఖర్చు చేసి బాగు చేయించామన్నారు. ప్రతి ఇంటి  చుట్టూ చెట్లు పెంచాలని పేదలకు పిలుపునిచ్చారు. ఇంటి చుట్టూ చెట్లు ఉండటం కాదని చెట్లలో ఇళ్లు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పేదల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేస్తున్నామని, జనవరిలో సంక్రాంతి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఎన్నికల్లోపు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లు కట్టించి ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.

English Title
Another five lakh homes for the poor
Related News