మరో కొత్త పార్టీ

Updated By ManamFri, 11/09/2018 - 06:18
bhupalapally
  • కామన్ సింబల్ కోసం ప్రయత్నం

  • రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ

  • తెరవెనుక జోరుగా సాగుతున్న ప్రయత్నాలు

bhupalapallyభూపాలపల్లి: తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో భూపాలపల్లి ఒక ప్రత్యేకత సంతరించుకోనుందా?  మరో కొత్త పార్టీ ఇక్కడి నుంచే పురుడు పోసుకోనుందా?  ఆ పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీచేయనున్నారా? అంటే.. జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే అవుననే తెలుస్తోంది. ఉద్యమాల పురిటిగడ్డ సింగ రేణి నల్లబంగారు నేల మరో సంచలనానికి నాందీ వాచకం పలుకబోతోంది. అన్ని పార్టీల్లోని టికెట్ రాని ఆశా వహులు, తిరుగుబాటు అభ్యర్థులుగా ఈ పార్టీ గుర్తుపై పోటీచేయనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పథక రచన కూడా పూర్తి అయినట్టు విశ్వసనీయ సమాచారం.  ఉత్తర తెలంగాణ లోని పలు అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులుగా బరిలో నిలిచే వారు ఇప్పటికే సుమారు 15 మంది వరకు ఈ పార్టీ గుర్తుతో బరిలోకి దిగడానికి సన్నాహాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.  ఈ పార్టీకి కామన్ సింబల్ ఉండటంతో పాటు, ప్రతి ఒక్కరికీ తెలిసే గుర్తు కూడా ఖరారు అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  విషయం బయటకు పొక్కకుండా చాపకింద నీరులా తమ పని గుట్టుగా చేసుకుని పోతున్నట్టుగా సమాచారం. ఈ ప్రయత్నాలు చేస్తున్న వారు ఇప్పటికే దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతూ, తమకు రాజకీయాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాల్లో తమకు సహకరించాలని కోరినట్టు, వారు కూడా ఓకే అన్నారని సమాచారం. అంతే కాకుండా దేశ ,విదేశాల్లోని తెలంగాణ వారు, తటస్థులుగా ఉంటూ రాజకీయాలను సునిశితంగా గమనిస్తున్న వారు కూడా మూస రాజకీయాలను దూరంగా  ఉండే వీరికి మద్దతుగా నిలుస్తున్నట్టు  తెలుస్తోంది. ఏది ఏమైనా సంచలనాలకు నెలవైన ఉత్తర తెంలంగాణ జిల్లా ఇప్పుడు మరో సంచలనానికి వేదిక కానుందనేది మాత్రం అక్షర సత్యంగా కానవస్తోంది. పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండాపై రెండు,మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

English Title
Another new party
Related News