మరో అడుగు దూరంలో

pv sindhu
  • ఫైనల్‌కు చేరిన సింధు

  • సమీర్‌వర్మకు షాక్ 

  • వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ ఫైనల్స్

గ్వాంగ్‌జూ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించటానికి మరో అడుగు దూరంలో ఉంది. ఈ టోర్నీలో సింధు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారమిక్కడ జరిగిన సెమీస్‌లో సింధు 21-16, 25-23తో 2013లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన రాట్‌చనొక్ ఇంటానొన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. తొలి రౌండ్‌లో తనైదెన ఆటతీరుతో ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచిన సింధు 21-16తో గెలుచుకోగా... రెండో రౌండ్‌లో ప్రత్యర్ధి ఇంటానొన్ నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. కానీ సింధు ముందు ఇంటానొన్ రెండో రౌండ్‌లో కూడా 25-23తో ఓడిపోవాల్సి వచ్చింది. గతేడాది దుబాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో సింధు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఫైనల్‌కు చేరిన ఒలింపిక్ రజత పతక విజేత సింధు టైటిల్ కోసం జపాన్‌కు చెందిన నొజొమి ఒకుహరతో పోటీపడనుంది. వీరిద్దరూ ఇప్పటీవరుకు 12 మ్యాచ్‌ల్లో తలపడగా ఇద్దరూ చెరో ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సింధు... ‘ ఇంటానొన్ కంటే నేను 2-3 పాయింట్లు మాత్రమే ముందంజలో ఉన్నాను. కానీ చివరికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రతి పాయింట్ కోసం పోరాడి విజయం సాధించాను. నా ఆటతీరును నేను పూర్తిగా మార్చుకున్నాను. మన ఆటని మనం చాలా సహనంతో ఆడాలి’ అని సింధు తెలిపింది. వరల్డ్ నెంబర్ 6వ ర్యాంక్‌లో కొనసాగుతున్న సింధు ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో విజయం సాధించలేకపోతుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు, 2017, 2018ల్లో వరల్డ్ చాంపియన్‌షిప్‌ల్లో సిల్వర్ పతకమే గెలవగా... ఈ ఏడాది జరిగిన ఆసియా గేమ్స్ లో రజతంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల విభాగంలో తొలిసారి ఈ టోర్నీ కి అర్హత సా దించిన సమీర్‌వర్మ సెమీస్‌లో 21-12, 20-22, 17-21 తో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షీ యు కీ (చైనా)తో చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో ఇప్పు డు ఆశలన్నీ సింధుపైనే ఉన్నాయి.
 

Tags

సంబంధిత వార్తలు