ఇప్పుడు అవసరం లేదు

Updated By ManamMon, 04/16/2018 - 17:33
asifa rape and murder file photos
  • అసిఫా కేసును సీబీఐకి బదిలీ చేయలేం.. అసిఫా కుటుంబానికి భద్రతనివ్వండి

  • కథువా అత్యాచారం, హత్య కేసులో జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

asifa rape and murder file photosన్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం, హత్య కేసును సుప్రీం కోర్టు విచారించింది. చిన్నారి అసిఫా కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాకుండా బాధిత కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాదులకు కూడా పటిష్ఠ భద్రత కల్పించాలని నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం అసిఫా అనే 8 ఏళ్ల బాలికను గుళ్లో బంధించి దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసిఫా తల్లిదండ్రులకు భద్రత కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సోమవారం ఆ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం వారికి భద్రత కల్పించాలని ఆదేశించింది. ‘‘మధ్యంతర చర్యల్లో భాగంగా అసిఫా కుటుంబం, వారి తరఫున వాదిస్తున్న ఇద్దరు లాయర్లు దీపికా సింగ్ రాజావత్, తాలిబ్ హుస్సేన్‌లకు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేయండి’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జమ్మూకశ్మీర్ పోలీసులను ఆదేశించింది.

అంతేగాకుండా కేసులో నిందితుడిగా ఉన్న బాల నేరస్తుడికీ సరైన భద్రత కల్పించాలని, అతడిని ప్రస్తుతం ఉంచిన బాల నేరస్తుల గృహం వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, కేసును సీబీఐకి బదిలీ చేయాలని పలువురు కోరిన నేపథ్యంలో.. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే ఉందని అసిఫా తండ్రి చెప్పారు. సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. దీంతో అసిఫా తండ్రి దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే కేసును సీబీఐకి బదిలీ చేయడం గురించి ఆలోచించట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కి వాయిదా వేసింది. 

English Title
Apex Court Issues Notices to Jammu Kashmir Govt Over Asifa family protection
Related News