ఏప్రిల్ 28.. తెలుగు సినిమాకు ప్ర‌త్యేకం

Updated By ManamSat, 04/28/2018 - 16:22
tfi

apr 28తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఏప్రిల్ 28వ‌ తేదీకి ప్ర‌త్యేక స్థానముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే తేదీన విడుద‌లైన కొన్ని సినిమాలు చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యం సాధించాయి. అలాగే మ్యూజిక‌ల్‌గానూ మెప్పించాయి. ఆ చిత్రాల వైపు కాస్త దృష్టి పెడితే..

అనార్క‌లి (1955) 
అంజ‌లీ దేవి టైటిల్ రోల్‌లో న‌టించిన చారిత్రక చిత్రం 'అనార్క‌లి'. స‌లీమ్‌గా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు , అక్బ‌ర్‌గా ఎస్వీ రంగారావు న‌టించిన ఈ క్లాసిక్ మూవీకి వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పి.ఆదినారాయ‌ణ రావు సంగీతంలో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా ఘంట‌సాల, జిక్కి ఆల‌పించిన 'రాజ‌శేఖ‌రా' పాట అయితే అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. 28 ఏప్రిల్ 1955న విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

అడ‌వి రాముడు (1977)
మ‌హాన‌టుడు నంద‌మూరి తారక రామారావు కెరీర్‌లో 'అడ‌వి రాముడు' చిత్రానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. రామారావు, రాఘవేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్ర‌మిది. ఆ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో 11 సినిమాలు రాగా.. వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీతంలో పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'కృషి ఉంటే మ‌నుషులు రుషులౌతారు', 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. జ‌య‌ప్ర‌ద క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో జ‌య‌సుధ ఓ కీల‌క పాత్ర పోషించారు. 28 ఏప్రిల్ 1977న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

య‌మ‌లీల (1994)
హాస్య న‌టుడిగా రాణిస్తున్న అలీని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. అప్ప‌ట్లో వ‌రుస విజ‌యాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ కుటుంబ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ఫాంట‌సీ మూవీ 'య‌మ‌లీల‌'. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో అలీ, మంజు భార్గ‌వి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంటాయి. ఇందులో య‌ముడిగా స‌త్య‌నారాయ‌ణ‌, చిత్ర గుప్తుడిగా బ్ర‌హ్మానందం చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ సినిమా త‌రువాత‌ య‌ముడి పాత్ర‌లాగే ప్రేక్ష‌కులు కూడా ఐస్ క్రీమ్‌ల‌ను హిమ క్రీములుగా పిల‌వ‌డం ఆన‌వాయితీ అయిపోయింది. ఇక‌ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో పాట‌ల‌న్నీ హిట్టే. ముఖ్యంగా 'సిరిలొలికించే చిన్ని న‌వ్వులే' పాట అయితే ఎవ‌ర్‌గ్రీన్‌. అలీకి జోడీగా ఇంద్ర‌జ న‌టించిన ఈ సినిమా 28 ఏప్రిల్ 1994న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

పోకిరి (2006)
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం 'పోకిరి'. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు హీరోను పోకిరిగా చూపించి.. చివ‌రి స‌న్నివేశాల్లో అత‌ను పోకిరి కాదు పోలీస్ అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేసింది. ఇలియానా అందాలు, మ‌ణిశ‌ర్మ సంగీతం ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. పాట‌ల్లో 'గ‌ల గ‌ల పారుతున్న గోదారిలా' గుర్తుండిపోయే మెలోడీ అయితే.. 'ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే' అంటూ సాగే ప్ర‌త్యేక గీతం అయితే ఓ సెన్సేష‌న్‌. 28 ఏప్రిల్ 2006న విడుద‌లైన ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మే.

బాహుబ‌లి 2 (2017)
తెలుగు సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన 'బాహుబ‌లి' సిరీస్‌లో రెండో భాగంగా వ‌చ్చిన 'బాహుబ‌లి 2 - ది కంక్లూజ‌న్‌'.. జాతీయ స్థాయిలో రికార్డు వ‌సూళ్ళు ఆర్జించింది. అంతేగాకుండా.. తెలుగులో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్ర‌భాస్ టైటిల్ రోల్‌లో సంద‌డి చేయ‌గా.. అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, రానా, నాజ‌ర్‌, స‌త్య‌రాజ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఎం.ఎం.కీర‌వాణి సంగీతంలోని పాట‌ల‌న్నీ ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'సాహోరే బాహుబ‌లి' పాట సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.  ప్ర‌భాస్‌, అనుష్కపై చిత్రీక‌రించిన 'ఓరోరి రాజా' విజువ‌ల్స్ ప‌రంగా మెప్పించింది. 28 ఏప్రిల్ 2017న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

మొత్త‌మ్మీద‌.. 'అడ‌విరాముడు', 'పోకిరి', 'బాహుబ‌లి 2' వంటి ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాల‌న్నీ ఏప్రిల్ 28న రావ‌డం యాదృచ్ఛిక‌మైనా.. ఇలాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రాలు రిలీజైన తేదీ కావ‌డంతో ఏప్రిల్ 28 తెలుగు సినిమాకు ప్ర‌త్యేకంగా నిలిచింది. మున్ముందు కూడా ఇదే తేదీన మ‌రిన్ని సంచ‌ల‌న చిత్రాలు విడుద‌ల‌వుతాయేమో చూడాలి.             

                                                                                             - మ‌ల్లిక్ పైడి

English Title
apr 28th is special for telugu film industry
Related News