ఆశావాదంతో ఆరోహణ

Updated By ManamWed, 08/22/2018 - 00:54
bse
  • ఆశావాదంతో ఆరోహణ రికార్డు స్థాయిల్లో ముగిసిన సూచీలు

bseముంబై: స్టాక్ మార్కెట్లకు గీటురాయిగా భావించే ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు మంగళవారం వరుసగా మూడో సెషన్‌లోనూ ఆరోహణను కొనసాగించాయి. లాభపడింది స్వల్పమే అయినా, నూతన గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్ల కొనుగోళ్ళు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఆశావాదం మార్కెట్లకు ఊతమిచ్చాయి.  బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 7 పాయింట్లు పెరిగి 38,285.75 పాయింట్ల నూతన శిఖరంపై ముగిసింది. మునుపటి (సోమవారంనాటి) 38,278.75 పాయింట్ల అధిక ముగింపు రికార్డును అధిగమించింది. ‘సెన్సెక్స్’ ఇంట్రా-డేలో  ఒక దశలో 38,402.96 పాయింట్ల జీవిత కాల అత్యధిక స్థాయిని తాకింది. సోమవారం ఇంట్రా-డేలో అది 38,340.69 పాయింట్ల అధిక స్థాయిని తాకింది. ఇక మంగళవారం అది 38,213.87 పాయింట్ల కనిష్ఠ స్థాయిని కూడా చూసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 19.15 పాయింట్ల లాభంతో 11,570.90 తాజా అధిక స్థాయి వద్ద ముగిసింది. ఇంతకుముందు (సోమవారం) దాని ముగింపు రికార్డు స్థాయి 11,551.75 పాయింట్లుగా ఉంది. ‘నిఫ్టీ’ మంగళవారం ఇంట్రా-డేలో 11,581.75 పాయింట్లను తాకింది. ఆ విధంగా అది సోమవారం నాటి 11,565.30 పాయింట్ల రికార్డును బద్దలు కొట్టింది. డే ట్రేడ్‌లో సూచి 11,539.60 పాయింట్ల కనిష్ఠ స్థితిని చూసింది. 

దేశీయ మదుపు సంస్థల నిర్విరామ కొనుగోళ్ళు, ప్రపంచ మార్కెట్లలోని సానుకూల సెంటిమెంట్ దేశీయ మార్కెట్లు తాజా అత్యధిక స్థాయిలను అందుకునేందుకు సాయపడ్డాయని బ్రోకర్లు చెప్పారు. అమెరికా, చైనా వాణిజ్య చర్చలపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు వాటి సానుకూల ఫలితంపై ఆశావాదంతో ఉన్నారు. ఆ రెండింటి మధ్య సాగుతున్న సుంకాల యుద్ధం కొంత కాలంగా ప్రపంచ మార్కెట్లను అస్థిమితం చేస్తున్నాయి. ఈ రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య మంగళ, బుధవారాల్లో జరుగనున్న చర్చలు మార్కెట్ సెంటిమెంట్ల మెరుగుదలకు దారితీశాయని బ్రోకర్లు అన్నారు. కోల్ ఇండియాలో కొద్ది వాటాను విక్రయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వార్తలు సూచించడంతో ఆ కంపెనీ షేర్  ధర మంగళవారం 2.59 శాతం పెరిగి రూ. 291.55 వద్ద ముగిసింది. ఒక రకమైన చర్మ వ్యాధి చికిత్సకు ఉపయోగించే లోషన్‌కు అమెరికా ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ నుంచి తుది ఆమోదం లభించిందని లుపిన్ ప్రకటించడంతో మంగళవారం దాని షేర్  ధర 2.23 శాతం పెరిగింది. దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 593.22 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 483.04 కోట్ల విలువ చేసే షేర్లను  విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది. చైనా దిగుమతులపై అమెరికా విధించిన 16 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలు ఈ వారంలో అమలులోకి రావలసి ఉంది. వాటిని అమలులోకి తెస్తే అంతకుఅంత తామూ సుంకాలు విధిస్తామని చైనా హెచ్చరించింది. కాగా, బక్రీద్ సందర్భంగా బుధవారంనాడు బి.ఎస్.ఇ, ఎన్.ఎస్.ఇలకు సెలవు ప్రకటించారు.

English Title
Ascension to optimism
Related News