నేటి నుంచి అసెంబ్లీ 

Updated By ManamWed, 09/05/2018 - 23:49
Kodela Shiva Prasada Rao
  • 8 రోజులపాటు సమావేశాలు.. హాజరుకాబోమన్న విపక్షం

  • స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్ లేఖ.. అవసరమైతే సమావేశాలు పొడిగింపు: స్పీకర్

spekaerఅమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమవుతున్నాయి. 7 నుంచి 8 రోజుల పాటు జరిగే సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు హాజరుకావడం లేదని ఆ పార్టీ అధినేత జగన్ స్పష్టం చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు. ఫిరాయింపు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని జగన్ లేఖలో కోరారు. నలుగురు మంత్రులను కూడా బర్తరఫ్ చేయాలని జగన్ పేర్కొన్నారు. విజయవాడలో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 22 మందితో నడుపుతున్న దానిని శాసనసభ అంటారా అంటూ ప్రశ్నించారు. అందువల్లే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు మినహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. కాగా, తొలి రోజు సభలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయికి, రెండో రోజు నందమూరి హరికృష్ణకు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ రద్దు అంశం గురువారం రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారనుంది. 

పటిష్ట భద్రత ఏర్పాట్లు : ఫరూఖ్
గురువారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్ ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న రోజుల్లో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో పోలీసులు, అసెంబ్లీ భద్రతా సిబ్బందితో బుధవారం జరిగిన సమావేశంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇటీవల నారా హమారా...టీడీపీ హమారా సభలో జరిగిన గలాటాను ఆయన అధికారులకు వివరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు.  

ఎవ్వరినీ నొప్పించొద్దు: కోడెల 
వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ఏడెనిమిది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అవసరమనుకుంటే మరికొన్ని రోజులు పొడిగించే అవకాశముందన్నా రు. అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల గేట్ల వద్దే ఉండే పోలీసులు, భద్రతా సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. అసెంబ్లీ చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, గట్టి నిఘా పెట్టాలన్నారు. విజిటర్లకు ఇచ్చే పాస్‌లు క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలి అనుమతించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ గత సమావేశాల మాదిరిగా వర్షాకాల సమావేశాలకూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. డీజీపీ ఆర్.పి.ఠాకూర్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. ఈ సమావేశాల్లో  పోలీసు అధికారులు, అసెంబ్లీ భద్రతా సిబ్బంది  పాల్గొన్నారు.

అన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వాలి..
అసెంబ్లీలో సభ్యుల వేసే అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వాల్సిందేనని శాసనమండలి చైర్మన్ ఎండీ ఫరూక్ స్పష్టంచేశారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఫరూక్, కోడెల సమావేశమయ్యారు. ఇంత వరకూ జరిగిన 11 సెషన్లకు గానూ 792 ప్రశ్నలకు సమాధానాలు ఇంకా ఇవ్వాల్సి ఉందన్నారు.

English Title
Assembly from today
Related News