రఫేల్‌పై మాటల యుద్ధం

Updated By ManamWed, 09/19/2018 - 00:51
 Nirmala Seetharaman
  • ఒప్పందంపై కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు

  • హెచ్‌ఏఎల్‌ను తప్పించిందే యూపీఏ సర్కారు

  • దస్సాల్ట్‌తో హెచ్‌ఏల్‌కు అంగీకారం కుదరలేదు

  • ఇది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది: నిర్మల

  • ఒప్పందంలోని నిజాలను అణిచివేస్తున్నారు

  • హెచ్‌ఏఎల్ ప్రతిష్ఠను దిగజార్చారు: ఆంటోని

antoniన్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒప్పందం నుంచి భారత ప్రభుత్వం సంస్థ హెచ్‌ఏల్‌ను తొలగిపునకు మీరంటే మీరు కారణమని పరస్పరం ఆరోపించుకున్నాయి. మంగళవారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, రక్షణశాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ దీటుగా బదులిచ్చారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం నుంచి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ( హెచ్‌ఏఎల్)ను తొలగించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని  ఆమె వెల్లడించారు. రఫేల్ యుద్ధవిమానాల అసెంబ్లింగ్ బాధ్యతల నుంచి హెచ్‌ఏఎల్‌ను తొలగించడం ద్వారా ఆ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చారని  ఆంటోని ఆరోపణలపై స్పందిస్తూ.. విమానాల ఉత్పత్తికి సంబంధించి హెచ్‌ఏఎల్, రఫేల్ తయారీ  సంస్థ దస్సాల్ట్ ఏవియేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, దాంతో ఈ ఒప్పందం నుంచి హెచ్‌ఏఎల్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ‘‘రెండింటి మధ్య ఒప్పందం కుదరలేదు. కలిసివెళ్లేందుకు వాటిమధ్య అవగాహన కుదరలేదు. ఇది ఎవరి హయాంలో జరిగిందో కాంగ్రెస్ నేతలు చెప్పాలి’’ అని నిర్మల పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పంజాబ్ కాంగ్రెస్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వాను కౌగింలించుకోవాల్సి ఉండేది కాదని అన్నారు. అలా చేయడంతో  మన దేశ  సైనికుల్లో నైతిక సామర్థ్యం దెబ్బతిన్నదని అన్నారు.

నిజాలు దాస్తున్నారు: ఆంటోని
రాఫెల్ డీల్‌పై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నిజాలను తొక్కిపెడుతున్నారని మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఏకే ఆంటోని పేర్కొన్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయమని అడిగితే ఎందుకు పారిపోతున్నారని ఆయన నిలదీశారు.  ఈ ఒప్పందం విషయంలో జాతీయ భద్రతతో ప్రభుత్వం రాజీ పడిందని ఆరోపించారు. అసెంబ్లింగ్ బాధ్యతలను హెచ్‌ఏఎల్‌కు అప్పగించకపోవడంతో ఆసంస్థ ప్రతిష్టను దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా దిగజార్చేందుకు  ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ డీల్ కంటే 9 శాతం చవకగా కొత్త ఒప్పందం చేసుకున్నట్టు న్యాయశాఖ మంత్రి చెబుతుండగా, ఆర్థిక మంత్రి 20 శాతం చవకగా కొన్నామంటున్నారని, భారత వైమానిక దళ అధికారి ఒకరు 40 శాతం చవకగా కొన్నామని అంటున్నారని పేర్కొన్నారు. చవకగా కొనడం నిజమైతే 36 విమానాల దగ్గరే ఎందుకు ఆగిపోయరని, తాము కుదుర్చుకున్న 126 జెట్ల కంటే ఎక్కువ విమానాలను ఎందుకు కొనుగోలు చేయలేకపోయారని అన్నారు.

English Title
The Battle of Rafael
Related News