ద్రోహం.. వంచన

Updated By ManamSat, 04/21/2018 - 05:03
babu strike
  • కేసులు పెడతామని బెదిరిస్తున్నారు..  కేంద్రానికి దాసోహమయ్యే పనే లేదు 

  • హోదా వచ్చేవరకు పోరాటం ఆగదు 

  • ప్రజలంతా నాకు మద్దతు పలకండి

  • వైసీపీతో కేంద్రం లాలూచీ పడింది 

  • 25 ఎంపీ సీట్లు నాకు ఇచ్చి పంపండి

  • ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దాం 

  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

  • ధర్మ పోరాట దీక్ష విజయవంతం


babu strikeఅమరావతి (మనం ప్రతినిధి): రాష్ట్రం మీద కేంద్రం కక్ష గట్టిందని, నమ్మకద్రోహం, నయవంచనకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో శుక్రవారం ఒక రోజు ధర్మపోరాట దీక్షను ముగించిన తరువాత నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చుకునే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందనీ, ప్రజలంతా తనకు మద్దతు పలకాలన్నారు. ‘నాకు హై కమాండ్ లేదు..ప్రజలే నా హై కమాండ్’ అని వ్యాఖ్యానించారు. తనపై నమ్మకంతో రైతులు 34 వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారన్నారు. రాజధాని డ్రీమ్ సిటీగా ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో పటేల్ విగ్రహానికి రెండు వేల కోట్లు ఎలా ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రానికి రాజధాని అవసరమా, లేదా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం రిక్తహస్తం చూపించిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పురోగతి కోసం తాను నాలుగేళ్లుగా మౌనంగా ఉన్నానన్నారు. అపుడే ఎన్డీయే నుంచి బయటకు వస్తే రాష్ట్రానికి మరిన్ని కష్టాలు తప్పేవి కావన్నారు. రాష్ట్రంలో నెలకొల్పే జాతీయ విద్యాసంస్థలకు కూడా నిధులివ్వటం లేదని, చివరకు విసిగి వేసారి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తుంటే కేసులు పెడతామని, కర్ణాటక ఎన్నికల తర్వాత సంగతి చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. బెదిరిస్తే బెదిరిపోయే నాయకుడిని తాను కాదని చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీతో వారు లాలూచీ పడ్డారని.. కళంకిత పార్టీతో స్నేహం చేస్తూ ఎన్నో కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ‘నేను మీ చిట్టా విప్పితే అసలు విషయాలు బయటపడతాయి’ అని చంద్రబాబు కేంద్రాన్ని హెచ్చరించారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా కేంద్రానికి దాసోహం అనే పనే లేదన్నారు. తన నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎవరికీ భయపడింది లేదన్నారు. వాజ్ పేయి హయాంలో ఒక్క పదవి కూడా తీసుకోకుండా మద్దతిచ్చిన సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడి అని, కానీ ఆ ప్రాజెక్టు రావటం కొందరికి ఇష్టం లేదన్నారు. విశాఖ రైల్వే జోన్ పై నాలుగేళ్లుగా కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని ఇంటిముందు ధర్నా చేసిన ఏకైక పార్టీ టీడీపీయేునని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాలను బలహీనపర్చాలని చూస్తున్నారన్నారు. వైసీపీ తో లాలూచీపడి తనను  ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా రని, కానీ లాలూచీ రాజకీయాలు తన జీవితంలో లేవని అన్నారు. కలిసి రాని వాళ్ళను ఏం చేయాలో ప్రజలే తేల్చాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా తన వెంటే ఉన్నారని, రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలను ఎన్నికలకే పరిమితం చేసి తనతో పోరాటానికి కలిసి రావాలన్నారు. బంద్‌లు, విధ్వంసాలతో రాష్ట్రప్రగతిని అడ్డుకోవాలని కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. శాంతిభద్రతలు సజావుగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు.

25 సీట్లలో గెలిపించండి babu meet
వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. అపుడు ప్రధానమంత్రిగా ఎవరుండాలో తామే నిర్ణయిస్తామనీ, విభజన హామీలన్నిటినీ నెరవేర్చుకుంటామని అన్నారు. నరేంద్రమోడీకి పరిపూర్ణ మెజారిటీ రావటం వల్లనే ఏపీని నిర్లక్ష్యం చేశారన్నారు. కేంద్రం ఏపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తే సంఘటిత పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. పోరాటంలో ఇది తొలి అంకమేననీ, అన్ని జిల్లాల్లో మేధావులతో సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. తాను ఎవరి వ్యక్తిత్వాన్నీ దెబ్బతీసే కుట్రలకు పాల్పడనని ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు సమాధానమిచ్చారు. ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడడటం, మాట్లాడించడం తన చరిత్రలో లేదన్నారు. అలాంటి రాజకీయాలకు తాను మొదటినుంచి దూరంగా ఉంటానన్నారు.

దీక్ష విరమించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షను విరమించారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లోని పురపాలక మైదానంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన రాత్రి 7 గంటలకు దీక్ష విరమించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చి న ఇద్దరు చిన్నారులు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. తనతో పాటు దీక్షలో పాల్గొన్న 96 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి కృష్ణయ్యకు చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు దీక్షా శిబిరం వద్దకు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. 

English Title
Betrayal .. hypocrisy
Related News