భారతి..తెలుగు కథకు హారతి

Updated By ManamMon, 04/16/2018 - 01:02
image

    ‘ఏ చదువు వల్ల పక్షులు పై కెగరగిలిగెనో!

    ఏ చదవు వల్ల చేప పిల్ల ఈద గలిగెనో!!’

imageఅక్షర జ్ఞానమే లేని మొన్నటి పశువుల కాపరి యాద గిరి(బండెనక బండి కట్టి), మూడవ తరగతి వరకు మాత్ర మే చదువుకున్న మరో పశుల కాపరి, తరువాత తాపీ మేస్త్రీ అయిన నిన్నటి అందె ఎల్లయ్య (మాయమైపోతున్న డమ్మా మనిషన్న వాడు), అయిదవ తరగతి వరకు మాత్ర మే చదువుకున్న నేటి యండపల్లి భారతి తమ చుట్టూ ఉన్న జీవితాన్ని చదివిన జీవిత పండితులు.

‘పుటుక, చావు, ఈ రెండూ మనకు సంబందం లేకుండా జరిగేటివి. మన బతుకుమటుకు మన చేతులారా జరిగేది. కులాన్ని బట్టి, చదువును బట్టి, జరుగుబాటును బట్టి, నడవడికను బట్టి రకరకాల ఒడిదుడుకుల్లో సాగి పోతా ఉంటాయి. నగువూ, ఏడుపు, కోపమూ తాపమూ, కుళ్లు బోత్తనమూ, కనికరమూ... ఇట్ల అడుగుకొక మలుపు మనిసి బతుకులో’ అంటూ జీవన వాస్తవాన్ని,  తాత్విక తను ఎండపల్లి భారతి తన కథాసంపుటి ‘ఎదారి బతు కులు’ పరిచయ వాక్యాల్లో చెపుతారు.
నిజానికి ఈ ‘ఎదారి బతుకులు’ కథలు కావు.  భారతి పుట్టి పెరిగిన మాదిగవాడలో నిత్యం కనిపించే దుర్భర జీవితాలు. భారతదేశంలోని అట్టడుగు వర్గాల జీవి తాలకు అద్దంపట్టిన జీవన వాస్తవాలు. ఎలాంటి అరమ రికలు, మొహమాటాలూ, దాపరికాలూ, కల్పనలూ లేకుం డా, భేషజాలకు పోకుండా, మధ్యతరగతికి, పట్టణ భద్ర జీవులకు తెలియని జీవితపు కోణాల్ని ఉన్నది ఉన్నట్టు చూపించారు. ఆ వాడలో తనచుట్టూ ఉన్న మహిళల కష్టా లను, కన్నీళ్లను, వ్యథలను, బాధలను, ఆకలిని, ఆనందా న్ని వారి భాషలోనే, వారి యాసలోనే మనకు చిన్నచిన్న కతలుగా చెప్పుకొచ్చారు. 

‘నిన్నటి వరకూ మాయమ్మ మట్టికడవను సంకనేసు కుని నడిసిన నడకకీ, ఈ పొద్దు ఇత్తలి బిందిని నడుముకు ఆనించుకుని నడుస్తుండే నడకకీ ఎంతో వారా ఉండాది’ అంటూ ‘ఇత్తలి బింది’ కథలో  చెప్పే మాటల్లో దారిద్య్రపు నీడలు పొడచూపుతాయి. ‘సామీ మీరురెడ్లు. మేము అర గాసు మాదిగోళ్లము. మీరు మమ్మల్ని ఆసిస్తే ఎట్ల’ అంటూ ప్రశ్నించినా వదలని ఆ ఆసామి పచ్చిబాలింతను బలవం తంగా ఎత్తుకెళ్లి చెరుకు తోటలో చేసిన పనిని ఇంతకాలం ఎవ్వరికీ చెప్పకుండా తన మనవరాలికి ‘అవ్వ తలపులు’ లో చెప్పిన విధానం ఆశ్చర్య పరుస్తుంది. ‘ఆపొద్దు అయి వారు కొట్టకుండా ఉన్నింటే, మాయన్న బాగా సదువుకుని నీడపాటున పనిచేసుకుంటా ఉన్నుండునేమో’ అంటూ ‘మాయన్న సదువు’ ముగించిన విధానం కలిచివేస్తుంది. చేబులో వేసుకున్న గొడ్డుకూర ముక్కలు తినడమే వాళ్లన్న చేసిన తప్పు?! ‘రేయ్ మాదిగనా..., ఇంటి ముందరకు రావద్దు, ఈ పొద్దు గురుదేవర, మీ మాదిగోళ్లని చూడ గూడదు’ అంటూ ఈసడించుకున్న సామిరెడ్డోళ్లమ్మ మాట ల్లో ఇప్పటికీ గ్రామాల్లో దళితులపట్ల ఉన్న వివక్ష కళ్లకు కట్టినట్టు ‘గురుదేవర’లో కనిపిస్తుంది.

మురిపెంగా పెంచుకున్న కోడిపెట్ట అందాలను ‘పూలపెట్ట’లో, సారాకి బాని సైన బతు కులను ‘వాసాల కింద కప్ప డం’లోను, ‘తాగుబోతు’లోనూ, ‘మొగుని పొటుకుల రామాయణం లేని కొంప ఏడుండాది’ అంటూ భార్యలపై భర్తల దాష్టీకాలను, ‘ఈరవ్వ ఏమి తినబెట్టిం దో!’లో స్త్రీ, పురుష సంబంధాలను సున్నితంగా చెప్ప డంలోనూ, ‘తొలీత బొట్టు కట్టినోడికి తాడు తెంపల్ల’ అంటూ ‘సచ్చి సాధిం చడం’లోనూ ఆ వాడలోని సంప్రదా యాల వెనుక ఉన్న బాధను చెప్పుకొ చ్చారు. ‘తిన్నారా లేదా అని అడిగేటట్లు లేరు కొడుకులు. కోడాండ్ల యితే బరువు నెత్తికెత్తు కున్న ట్లుంటుంది. మూతట్ల పెట్టుకోని కోళ్లకు, కుక్కలకు వేసిన ట్లు బుద్దిపుట్టినప్పుడు అన్ని మె తుకులు వేస్తా ఉండారు. కోటి సాపెన్లు సాపిస్తా ఉండారు’ అంటూ పెద్దయ్య అనే ఓ వృద్ధుడి మనోగతాన్ని చెప్పే ‘బొగు దవడ కేసుకుని’ కథలో వార్థక్యంలో పడే కష్టాలను చూపిస్తారు. చివరికి ‘చిట్టెంటుకలు’లో రాలి పోయే తలవెంట్రుకలను కూడా వదల్లేదు. ‘ఆవయితే పేయదూడలు కనల్ల. అదే ఆడోళ్లయితే మగబిడ్డను కనల్ల. ఆవులు కోడె దూడలను ఈనితే అమ్మేస్తారు. ఆడోల్లు ఆడబిడ్డను కంటే ఆరుపోరు పెడతారు. ఇదెక్కడి న్యాయమబ్బా’ అని ‘ఆవ యితే పేయదూడ ఆడదైతే మగపిల్లోడు’ అన్న కథలో వేసి న ప్రశ్న అమాయకంగా కనిపించినా, వాడల్లో కూడా ఉన్న ఆడపిల్లలపట్ల ఉన్న వివక్షను ఎత్తిచూపిస్తారు. అట్టమీద బొమ్మతో పాటు ప్రతికథకు కిరణ్ కుమారి గీసిన బొమ్మ లు ఆ వాడను, ఆ వాడలోని జీవితాన్ని సజీవంగా చూపి స్తాయి. ‘ఎదారి బతుకులు’ను అచ్చేయించి, ఆ పుస్తకాన్ని పాఠకుల లోగిళ్లలో వాలేలా చేస్తున్న ఆమె కృషి పైకి కనపడనిది. 

ఈ కథల్లో పాత్రలు మాట్లాడే భాష, రచయిత్రి కథ చెప్పే విధానం మాండలిక మాధుర్యపు సొబగులతో సాగుతుంది. రాయలసీమ మాండలికం ఒకేరకంగా ఉం డదు. అందులో భాగమైన చిత్తూరు జిల్లా మాండలికం తమిళ, కన్నడ భాషల ప్రభావంతో రూపుదిద్దుకుని, వారు వాడే పదాల్లో, పలికే తీరులో భిన్నత్వం ఉంటుంది. భారతి కథలన్నీ కర్ణాటకకు సరిహద్దున ఉన్న మదనపల్లె ప్రాంతంలో మాట్లాడే చిక్కని మాండలికాలతో నిండి ఉంటాయి. ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న అనేక పదాలు ఆ జిల్లాలోనే మిగతా ప్రాంతాల వారికి అర్థం కా వు. అందుకే ప్రతి కథ చివరన కొన్ని మాండలిక పదాలకు అర్థాలను ఇచ్చారు. అయినప్పటికీ  చాలా మాండలిక ప దాలు భారతి వంటివారు చెపితే తప్ప మనకు బోధ పడవు. భాషలు, యాసలు, మాండలి కాల వైవిధ్యమంతా జీవవైవి ద్యంలో భాగంగానే రూపుదిద్దుకున్నాయి. గతంలో చిత్తూ రు జిల్లా మాండలికంలో పులికంటి కృష్ణారెడ్డి, నామిని సుబ్రమణ్యం నాయుడు వంటి వారు కథలు రాసినప్పటికీ, మదనపల్లె ప్రాంత దళితుల మాండలికంలో రాస్తున్న వారిలో భారతి ప్రథములు. ‘ఈ కతల్లోదంతా మాపల్లె ఆడవాళ్ల బతుకు. దీన్లో బాసంతా మా పల్లె బాస. చానామందికి బూతులు, చెడ్డ మాటలు అనిపించేవాటిని, మేము కడుపు మండినబ్బుడు మామూలుగా మాట్లాడుకుంటాము. వాటిని బూతులు అనుకోవద్దండి. మా బతుకుల్లో బాగమే మా బాస’ అంటూ భారతి ఎంతో వినమ్రంగా తన కథల గురించి చెపుతారు.
- రాఘవశర్మ
9493226180

English Title
Bharathi .. telugu story
Related News