40/35.. 38/35.. మార్కులు వంద శాతంపైనే

Updated By ManamSat, 06/09/2018 - 15:13
Bihar Students Get More Than Actual Marks
  • ఉన్న మార్కుల కంటే ఎక్కువ వేసిన వైనం.. బిహార్ పన్నెండో తరగతి ఫలితాల్లో విచిత్రం

Bihar Students Get More Than Actual Marksపట్నా: అతడి పేరు రాహుల్ కుమార్.. గణితం పరీక్షలో 35 మార్కులకు గానూ 40 మార్కులు వచ్చాయి. ఆమె పేరు జాన్వి సింగ్.. అసలు పరీక్ష రాయకుండానే జీవశాస్త్రంలో 18 మార్కులు పడ్డాయి. అవును, నిజం.. బిహార్ పన్నెండో తరగతి ఫలితాల్లో కనిపించాయి. ఈ నోరెళ్లబెట్టే వాస్తవాలు. ఏ పరీక్షల్లో అయినా గరిష్ఠ మార్కుల శాతం వంద. అక్షరాలా వంద శాతమే. కానీ, వంద శాతానికిపైగా మార్కులు వస్తే.. అది విద్యార్థి కష్టం కాదు.. ఆ పేపర్ దిద్దినవాళ్ల నిర్లక్ష్యమనే గట్టిగా చెప్పొచ్చు. బిహార్‌లో అదే జరిగింది. గరిష్ఠ మార్కుల కన్నా ఎక్కువ మార్కులు, అసలు రాయని పేపర్‌కే మార్కులు, బాగా రాసినా సున్నా మార్కులు.. ఇదీ ఫలితాల్లో వెల్లడైన తంతు. రెండేళ్ల క్రితం జరిగిన బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు పరీక్షల్లో ‘టాపర్’ కుంభకోణం ఘటన మరవకముందే తాజాగా ఈ తతంగం వెలుగులోకి వచ్చింది.

అర్వాల్ జిల్లాకు చెందిన భీం కుమార్ అనే విద్యార్థికి గణితం (థియరీ)లో మొత్తం 35 మార్కులకు గానూ 38, ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో 35కు 37 మార్కులు పడ్డాయి. అయితే, ఆ మార్కులు చూసుకున్న విద్యార్థి కించిత్ కూడా ఆశ్చర్యపోలేదు. కారణం ఏంటని అడిగితే.. బిహార్‌లో తమకు ఇదేం కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతున్నదదే అని అనేశాడు. ఇక, సందీప్ రాజ్ అనే ఈస్ట్ చంపారన్‌కు చెందిన విద్యార్థికి అదే గణితంలో 35కు 38 మార్కులు వచ్చాయి. అది సరే.. అసలు, ఇంగ్లిషు, రాష్ట్ర భాషల్లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు బాగానే రాసినా సున్నా మార్కులు వేయడమేంటని ఆశ్చర్యపోతున్నాడు.

ఇక, రాహుల్ కుమార్ అనే విద్యార్థికి గణితం ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల్లో 35కు 40 మార్కులు వేశారు ఆ పేపర్ దిద్దిన ఘనులు. వైశాలికి చెందిన జాన్వి సింగ్ అనే విద్యార్థిని పరిస్థితి అందుకు భిన్నం. ఆమె రాసింది ఒక పేపర్ అయితే.. రాయని జీవశాస్త్రం పేపర్‌కు 18 మార్కులు వేసి చుట్టేశారు దిద్దినోళ్లు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. అలాంటి ఘటనలు పరీక్ష ఫలితాల్లో కోకొల్లలుగా వెలుగు చూశాయి. 

English Title
Bihar Students Get More Than Actual Marks
Related News