బీజేపీని ఛీ కొడుతున్నారు

Updated By ManamFri, 04/06/2018 - 12:26
bjp

అవిశ్వాసంపై చర్చ జరగకుండా..సభ వాయిదా వేసి పారిపోతారా?   
ఎంపీలే ఢిల్లీలో మన సైనికులు
రాష్ట్రపతి కోవింద్‌తో భేటీ కావాలి
టీడీపీ ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం

imageఅమరావతి: దేశంలో ‘విభజించి- పాలించు’ తరహాలో బీజేపీ పాలన కొనసాగిస్తోందని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీలా మొండిగా వ్యవహరించిన కాంగ్రెస్, రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రాల్లో విపక్షాల మధ్య చీలికలు తెచ్చి చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నారని, దేశం మొత్తం ఛీ కొట్టే రోజు దగ్గరలోనే ఉందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారు. మన ఎంపీల పోరాటాన్ని 5 కోట్లమంది ప్రజలు అభినందిస్తున్నారు. మన పోరాటంలో చిత్తశుద్ధి ఉంది. లక్ష్య సిద్ధి కోసం అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇది నా విధి, నా కర్తవ్యం, నా బాధ్యత అని ప్రతి ఒకరు భావించాలి. రాజ్యసభలో ఎంపీలు మెరుపు ధర్నాతో జాతీయస్థాయిలో ప్రకంపనలు సృష్టించారు. టీడీపీ ఎంపీల పోరాటం రాష్ట్రంలో పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది’’ అని చంద్రబాబు అన్నారు.

వాయిదా వేసుకుని పారిపోతారా..?
‘‘పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఒక స్ఫూర్తితో అమలు చేయాలనడం తప్పా..? పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నేరమా..? ఇన్నిరోజులు సభ వాయిదా వేసుకుని పారిపోతారా..?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ నిరంకుశ పోకడలపై మండిపడ్డారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడితే రాష్ట్రపతితో భేటీ కావాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వివరించాలని, నాలుగేళ్లుగా జరిగిన నష్టాన్ని తెలియజేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చాక 13 జిల్లాల్లో ఎింపీలు పర్యటనలు జరపాలని, బహిరంగ సభల ద్వారా చేసిన పోరాటంపై ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు సూచించారు.  

వైసీపీ గైర్హాజరు మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం
మానవహారానికి వైసీపీ గైర్హాజరు కావడం.. బీజేపీతో ఆ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనటానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. ఐదుగురు లోక్ సభ సభ్యులచే రాజీనామా చేయించిన వైసీపీ, ఇద్దరు రాజ్యసభ సభ్యుల చేత రాజీనామా చేయించదా? అని ప్రశ్నించారు. లోక్ సభ సభ్యులకో న్యాయం, రాజ్యసభ సభ్యులకో న్యాయమా..? అని నిలదీశారు. ఇప్పటిైకెనా వైసీపీ నాటకాలతో రాష్ట్రానికి నష్టం చేయకుండా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ పక్షాన ఉంటారా..? లేక ఏపీ ప్రజల పక్షాన ఉంటారో వైసీపీ తేల్చుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మోదీ పక్షాన ఉండి చరిత్రహీనులుగా మారతారా..? పోరాడి తెలుగుజాతి గౌరవం నిలబెడతారా..? తేల్చుకోవాలన్నారు. ఎంపీలు రాజీనామా చేయడమంటే పోరాటం నుంచి పారిపోవడమేనని, కేంద్రంపై జరుగుతున్న పోరాటంలో ఎంపీలే మన సైనికులని చంద్రబాబు గుర్తుచేశారు.

Tags
English Title
bjp party
Related News