యాక్ష‌న్ హీరోతో ‘బొమ్మరిల్లు’ భాస్క‌ర్‌?

Updated By ManamTue, 03/13/2018 - 20:25
bhaskar

bhaskar‘బొమ్మరిల్లు’ చిత్రంతో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా నంది అవార్డు అందుకున్నారు భాస్కర్. ఈ కుటుంబ క‌థా చిత్రంతో అన్ని వ‌ర్గాల వారి దృష్టినీ ఆకర్షించారు. ఆ తర్వాత భాస్కర్ చేసిన ‘పరుగు’ చిత్రం కూడా కమర్షియల్‌గా మంచి హిట్ అయింది. అయితే.. మూడో ప్ర‌య‌త్నంగా రామ్‌చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’  ఘోర పరాజయాన్ని చవిచూసింది.  ఫ‌లితంగా.. ‘ఆరెంజ్’ తర్వాత భాస్కర్‌కి చెప్పుకోద‌గ్గ అవకాశాలు రాలేదు. కొంత‌కాలం గ్యాప్ తర్వాత రామ్‌తో ‘ఒంగోలు గిత్త’ చేశారు. అది కూడా వర్కవుట్ అవ్వలేదు. ఆ త‌రువాత‌.. 2016లో ఓ తమిళ సినిమా చేశారు. అది కూడా భాస్కర్ కెరీర్‌కు ఉపయోగపడలేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. దాదాపు 5 సంవత్సరాల తర్వాత భాస్క‌ర్‌కు తెలుగులో  సినిమా చేసే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. యాక్ష‌న్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ హీరోగా ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించేందుకు భాస్కర్ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. అలాగే అల్లు అరవింద్, సురేష్‌బాబు బేనర్స్‌లో కూడా సినిమాలు చేయడానికి భాస్కర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ సంవత్సరం భాస్కర్‌కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. 

English Title
'bommarillu' director with action hero?
Related News