విజృంభిస్తున్న మహమ్మారి

Updated By ManamWed, 04/04/2018 - 04:20
helth

patientప్రపంచం ముఖమ్మీద నుంచి ‘క్షయవ్యాధి’ని తుడిచిపెట్టేశామని అభివృద్ధి చెందిన దేశాలు విర్రవీగుతుంటే, అభివృద్ధి చెందని దేశాల్లో క్షయవ్యాధి మళ్ళీ విజృంభిస్తోంది. ఈసారి అది మందులకు లొంగని మొండి వ్యాధిగా మారి వేలాది ప్రాణాల్ని బలి తీసుకుం టోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2016 నాటికి 10.4 మిలియన్ల మంది కొత్తగా క్షయవ్యాధి బారిన పడ్డారు. ఈ 10.4 లక్షల మందిలో 64 శాతం మంది మన దేశం లోనే ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్ని ఎండిఆర్ టీబీ మహమ్మా రిలా వేధిస్తోంది. క్షయవ్యాధి ఇప్పుడు రెండు ముఖాలుగా జనాన్ని పట్టిపల్లారుస్తోంది. ఎయిడ్స్‌తో కూడిన క్షయవ్యాధి ఒకటైతే, ఐదేళ్ళ లోపు వయస్సున్న పిల్లలకు సోకే క్షయ వ్యాధి మరొకటి. 
తెలంగాణ రాష్ట్రంలో కూడా క్షయ మళ్ళీ విజృంభిస్తున్నదన్న సత్యం ఆందోళన కలిగిస్తోంది. ‘ఇండియా టీబీ నివేదిక - 2018’ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో క్షయవ్యాధి తీవ్రత దారుణంగా ఉన్నట్టు తేలింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో గత ఏడాది 39,398 మంది క్షయ వ్యాధిగ్రస్తులున్నారని ఆ నివేదిక చెబుతోంది. హైదరా బాద్‌లో కూడా దీని తీవ్రత తక్కువేమీ కాదు. రాష్ట్రంలో క్షయవ్యాధిలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. నగరంలో నాలుగువేల మందికి పైగా క్షయవ్యాధితో బాధపడుతున్నారు. శీఘ్రగతిన ప్రబలుతున్న క్షయవ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి ఈ వ్యాధిని సంపూర్ణంగా తుదముట్టించా లని నిర్ణయించింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకు వేసి 2025 నాటికల్లా దేశం నుంచి క్షయవ్యాధిని పారద్రోలుతానని శపథం చేశారు. అయితే ఈ శపథం నెరవేరడం అంత సులభసాధ్యమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. 

మొండి ఘటం
ఇంతవరకు క్షయవ్యాధిని మానవాళి నియంత్రించేసిందన్న భావనతో ఉన్న అంతర్జాతీయ ఆరోగ్య నిపుణుల నమ్మకాన్ని అవహేళన చేస్తూ క్షయవ్యాధి తన రూపాన్ని మరింత వికృతంగా ప్రపంచం ముందు ఆవిష్కరించింది. ప్రతి ఐదుగురు క్షయరోగుల్లో ఒకరికి క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ప్రధానమైన ఔషధాల్లో కనీసం ఒక్కదాన్ని నిరోధించే శక్తి కలిగిన ఒకానొక బ్యాక్టీరియా సంక్రమించి నట్టు పరిశోధకులు కనిపెట్టారు. క్షయవ్యాధిని జయించేశామని భావిస్తున్న తరుణంలో ఇంతటి పెనువిపత్తును కలిగించే బాక్టీరియా తెరమీదికి రావడం పెనుసవాలే. దీనిని అరికట్టే సామర్థ్యం కలిగిన ఔషధాలు కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళనకరం. హెచ్‌ఐవి, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల కన్నా క్షయవ్యాధే ఏటా ఎక్కువ మందిని బలిగొంటోంది. క్షయవ్యాధితో 2015లో 1.8 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే క్షయవ్యాధిని నివారించేందు కు మరిన్ని కొత్త యాంటీబయాటిక్స్ ఔషధాల్ని కనిపెట్టినప్పటికీ, కచ్చితమైన వ్యాధినిర్థారణ, స్పష్టమైన రోగనివారణా ప్రక్రియ, రోగ తీవ్రత, ఎంతమందికి వ్యాధి సంక్రమించింది వంటి వివరాలు అందుబాటులోకి రానంతవరకు ఈ ఔషధాల సామర్థ్యాన్ని అంచనా వేయడం కుదరదని పరిశోధకులు చెబుతున్నారు. క్షయవ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాల్ని కూడా తట్టుకుని జీవించే శక్తి కలిగిన బ్యాక్టీరియా వల్ల వ్యాధి నిర్మూ లన అన్నది ఇవాళ అనూ హ్యమైన విషయంగా మారిపోయింది. ఇలాంటి క్షయవ్యాధికి గురైన వారు కోలు కున్న దాఖలాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. వ్యాధిగ్రస్తులు క్షయతో బాధపడుతూనే ఉన్నారు. 

క్షయవ్యాధిని సాధారణంగా కొన్నిరకాల యాంటీబయాటిక్ ఔషధాలతో నయం చేస్తారు. అయితే యాంటీబయాటిక్ ఔషధాల్ని ప్రపంచమంతటా పరిమితికి మించి ఉపయోగించడం వల్ల ఈ యాంటీబయాటిక్ ఔషధాల్ని సైతం తట్టుకుని జీవించే శక్తి కలిగిన బ్యాక్టీరి యా ఉద్భవించింది. ఇదే ఇప్పుడు పెనుముప్పుగా మారింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఇరవై మంది క్షయరోగుల్లో ఒకరు రెండు యాంటీబయాటిక్ ఔషధాల్ని నిష్ఫలం చేసే శక్తి కలిగిన క్షయవ్యాధి బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. ఇలా రెండు యాంటీబయాటిక్ ఔషధాల్ని నిష్ఫలం చేయగల బ్యాక్టీరియా సోకిన రోగుల్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ(ఎండిఆర్ టీబీ) రోగులుగా పరిగణిస్తారు.  ఇలా ఎండిఆర్ టీబీ బారిన పడిన వాళ్ళలో సగం మంది భారతదేశం, చైనా, రష్యాల్లోనే ఉన్నారు. అంటే ఫ్లూరోక్వినోలోన్స్ లేదా ఇంజక్షన్ల ద్వారా ఇచ్చే మందులు వీరికి పని చేయవన్న మాట. అయితే ఇప్పుడు ఎండిఆర్ టీబీ బారిన పడిన వాళ్ళని రక్షించేందుకు ‘బెడాక్విలైన్’, ‘డెలానమిడ్’ అనే రెండు మందులు అత్యవసరంగా రోగులకు అందాల్సి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి ప్రస్తుతం మన దేశంలో కేవలం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు మందులకు తప్పనిసరిగా లైసెన్సుల్ని మంజూరు చేయాల్సిందిగా దాదాపు అరవై అంతర్జాతీయ స్వచ్ఛందసంస్థలు ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఔషధాల జాబితాలో చోటు చేసుకున్న ఈ మందులకు లైసెన్సుల్ని మంజూరు చేయడం వల్ల వీటి ధర 95 శాతం వరకు తగ్గి పోతుంది. ఆరునెలల పాటు వాడాల్సిన బెడాక్విలైన్ ధర సుమారు 60,000 రూపాయలు ఉంటుంది, అంతే ప్రమాణంలో డెలానమిడ్ ధర దాదాపు 1.11 లక్షల రూపాయలు ఉంటుంది. ఎండిఆర్ టీబీ సోకిన రోగి ఈ మందుల్ని 18 నెలల పాటు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అంటే ఒక రోగికి 5.1లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ భారాన్ని తగ్గించడానికే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ఈ మందులకు లైసెన్సును తప్పనిసరి చేయాలంటూ ప్రధానికి లేఖ రాశారు. అయితే ఈ మందులు అంతర్జాతీయ విపణిలో దొరకడం కష్టతరంగా మారిందని, అంతేగాక ఈ మందుల వల్ల గుండెకు సంబంధించిన రుగ్మతలు వస్తాయన్న వాదన కూడా వినిపిస్తోంది కాబట్టి ఈ అభ్యర్థనను పక్కనబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

వాగాడంబరం పనికిరాదు
భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం నుంచి క్షయ వ్యాధిని 2025 నాటికల్లా తరిమికొడతానని శపథం చేశారు. అంటే ఏటా 10 నుంచి 15 శాతం మంది కొత్త క్షయరోగుల్ని వ్యాధి బారి నుంచి కాపాడాల్సి ఉంటుంది. ఇలా ఎనిమిదేళ్ళ పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏటా మన దేశంలో కొత్త క్షయరోగుల్ని కేవలం 1.5 శాతం మందిని మాత్రమే కాపాడగలుగుతున్నాం. జన్యు పరిశోధనల్లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రగతి సాధిస్తున్న ఈ రోజుల్లో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒక అంటువ్యాధిని సంపూర్ణంగా ఎందుకు ఎదుర్కోలేక పోతున్నాం? వ్యాధి నిర్ధారణ, చికిత్సల్ని ప్రమాణీకరించకుండా ఇలాంటి శపథాలు నెరవేరబోవు. క్షయవ్యా ధి నిర్మూలన కోసం మరిన్ని నిధుల్ని కేటాయించడం, మరికొ న్ని పటిష్టమైన చర్యల్ని తీసుకోవ డంతో పాటు వ్యాధి నిర్థారణ, చికిత్సలకు సంబంధించి ప్రమా ణాల్ని కూడా కచ్చితంగా పాటిం చాల్సి ఉంది. క్షయ వ్యాధిగ్రస్తులు అనగానే అందర్నీ ఒకేగాటన కట్టి చికిత్స చేసే మూస పద్ధతి పనికి రాదు. ఏ ఇద్దరు క్షయవ్యాధి గ్రస్తులు ఒకటి కాదు. ఎవరికి వారు విడివిడి బ్యాక్టీరియా బారిన పడిన వారే. ఒక ధనికుడైన క్షయవ్యాధిగ్రస్తునికి అనుసరించిన చికిత్సా విధానం ఒక గిరిజన వ్యాధిగ్రస్తునికి ఉపయోగిస్తే అది నిష్ఫలమే అవుతుంది. వ్యాధి తీవ్రతలో ఉన్న వ్యత్యాసాలు, యాంటీమైక్రోబియల్ నిరోధక శక్తి, తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. చురుకైన పద్ధతిలో వ్యాధినిర్థారణ, వ్యాధి తొలిదశలో ఉండగానే కనిపెట్టి చికిత్సను అందించడం వంటివి ఈ మహమ్మారిని అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. క్షయ వ్యాధిని తొలిదశలోనే నిర్ధారించడం, చికిత్సా పద్ధతుల్ని ఆధునీకరించడం వంటివి లక్ష్యసాధనలో ప్రధాన అంశాలని క్షయవ్యాధి నివారణకు సంబంధించిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (ఎన్‌ఎస్‌పి) గుర్తించింది. క్షయవ్యాధి సోకడానికి అవకాశాలున్న పరిస్థితుల్లో జీవిస్తున్న కుటుంబాల్ని గుర్తించడం, అవసరమైతే ఇంటింటికీ వెళ్ళి వైద్య పరీక్షల్ని నిర్వహించడం వంటివి కూడా అవసరమని ఎన్‌ఎస్‌పి భావించింది. ఈ దిశగా కమ్యూనిటీ హెల్త్‌వర్కర్ల సహాయాన్ని కూడా తీసుకోవలసి ఉంటుంది. క్షయవ్యాధిని పలుదశల్లో గుర్తించడం, తగు చికిత్సల్ని అందించడం వంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం, ‘ఆపరేషన్ ఆశా’తో కలిసి పని చేస్తోంది. ఒకసారి వ్యాధిగ్రస్తుణ్ణి గుర్తిస్తే, అతని వల్ల మిగతావారికి వ్యాధి సంక్రమించకుండా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు బాధ్యత వహిస్తారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల సహాయం కూడా హర్షించదగ్గ స్థాయిలోనే ఉంది. అంతేగాక రోగులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందుల్ని వాడేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలా చేయకుంటే, వ్యాధి నివారణకు ఎక్కువ సమయం పడుతుంది, ఈలోగా అది ఇతరులకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది.  ప్రతి రోగి అవసరాల్ని గుర్తించి, వారికి మాత్రమే ప్రత్యేకమైన రీతిలో ఔషధాల్ని ఉపయోగించాలి. 

టిబిఎం
మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్లోసిస్ (టిబిఎం)- మెదడుకు క్షయ అనే వ్యాధిని ప్రభుత్వం ఇంతవరకు గుర్తించనే లేదు. ఈ వ్యాధి నివారణకు ఒక్కో రోగి కనీసం లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2016 నాటికి 500 మంది టిబిఎం వ్యాధిగ్రస్తుల్ని కొత్తగా గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారు శాశ్వతంగా కంటి చూపును కోల్పోవడం లేదా అవయవాల చలనం స్తంభించి పోవడం లేదా ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్రనష్టాలకు గురవుతారు.  ఈ వ్యాధి సోకిన వారిలో చాలామందికి ఎండిఆర్ కూడా సోకుతోంది. 
ఈ వ్యాధిని నిర్ధారించేందుకు అవసరమైన వైద్యపరికరాలు, సాంకేతిక సౌలభ్యం హైదరాబాద్‌లో అందుబాటులో లేదు. వ్యాధిగ్రస్తుల్లో చాలామంది ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో వీరి మీద ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటోంది.

జైలుకే!
వైద్యులు, ఫార్మసిస్టులు, కెమిస్టులు, తదితర నిపుణులు క్షయవ్యాధి నిర్థారణలో ఒక్క కేసులో విఫలమైనా వారికి ఆరు నెలల నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుందంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన ఆదేశాలు వారిలో గుబులును పుట్టిస్తున్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని 269, 270సెక్షన్‌ల కింద ఇకపై వ్యాధినిర్థారణలో విఫలమైన డాక్టర్లు, కెమిస్టులు, ఫార్మసిస్టులు, తదితర నిపుణులకు ఆరు నెలల నుంచి రెండేళ్ళ వరకు కారాగార శిక్ష, జరిమానా విధిస్తారు. తమ రోగాన్ని గురించిన, వివరాల్ని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడానికి రోగులు అంగీకరించరని, రోగులు తమ సమాచారాన్ని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడానికి ఇష్టపడకపోతే, తమ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కొందరు వైద్యులు అంటున్నారు. 2015లో ప్రపంచంలో ప్రజల ప్రాణాల్ని బలిగొన్న పది వ్యాధుల్లో క్షయ కూడా ఒకటి. మలేరియా, ఎయిడ్స్ వంటివి కూడా దీని తరువాతే.


 

Tags
English Title
The booming pandemic
Related News