బ్రహ్మోత్సవ శోభ

Updated By ManamMon, 09/10/2018 - 00:11
Tirumala Temple
  • వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల

  • భారీ స్థాయిలో విద్యుదలంకరణలు.. రూ.9 కోట్లతో ఇంజినీరింగ్ పనులు

  • స్వామికి పరదాలు సిద్ధంచేసిన మణి.. న భూతో.. అన్నట్లుగా ఉత్సవాలు

tirumaతిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఈనెల 13 నుంచి జరగనున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుపతి, తిరుమల నగరాలను టీటీడీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తిరుమలలో ప్రత్యేకాలంకరణలపై దృష్టి సారించారు. అలంకరణలు, పెయింటిం గుల పనులను టీటీడీ ఇంజినీరింగ్ విభాగం తొమ్మిది కోట్ల రూపాయలతో చేపడుతోంది. తిరుపతి నుంచి భక్తులు బస్సులు, రైళ్లు దిగిన ప్రాంతాల నుంచి తిరుమల వెళ్లే మార్గాల్లో విద్యుత్తు దీపాలంకరణలు చేస్తోంది. భక్తుడు తిరుపతికి రాగానే ఇల వైకుంఠంలో అడుగుపెట్టిన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకుంటోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ‘నభూతో న భవిష్యతి’ అన్న చందాన ప్రతి సంవత్సరం జరుగుతాయి. వేంకటేశ్వరుడు శ్రవణం నక్షత్రం రోజున ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ఏనాటి నుంచో జరుగుతున్నాయి. బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందిన ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో  వైకుంఠం నుంచి దేవతలు అందరూ తిరుమాడ వీధుల్లో తిరుగుతూ ఉంటారని అంటారు.  అందుకే తిరుమల, తిరుపతిలలో అన్ని మార్గాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి, తిరుమలలో దేవతామూర్తుల ప్రతిమలను లైటింగ్‌తో అలంకరిస్తున్నారు. వేంకటేశ్వర స్వామితో సహా మహావిష్ణువు దశావతారాలను వివిధ ప్రాంతాలలో విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ధర్మప్రచార మండళ్ల సహకారంతో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. పుస్తకప్రసాదం పంపిణీ, సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న సంస్థలకు ఆర్థికసాయం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. కలియుగంలో శ్రీవారి కృపాకటాక్షాలు పొందేందుకు హరినామ సంకీర్తన ఒక్కటే మార్గమని,  దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులలను ఆహ్వానించి, తిరుమలలో ప్రధాన కల్యాణకట్ట వద్ద 24 గంటల పాటు భజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో పాటు తిరుమల, తిరుపతిలలోని ఆడిటోరియాలు, ఇతర వేదికలపై  వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ వేదికలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.  

స్వామివారి పరదాలు సిద్ధం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే పరదాలను తిరుపతికి చెందిన మణి సిద్ధం చేశారు. వంశపారంపర్యంగా ఈ పరదాలను మణి శ్రీవారికి అందజేస్తున్నారు. మణి పరదాలను తీసుకుని, తిరుమలకు కాలినడకన కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పరదాలను శ్రీవారికి అందజేస్తారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులకు పరదాలను ఆయన అందించనున్నారు.

English Title
Brahmotsava Chobha
Related News