రికార్డుల రన్‌కు బ్రేక్

Updated By ManamFri, 08/24/2018 - 23:50
bse

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ శుక్రవారం సుమారు 85 పాయింట్లు కోల్పోయి 38,251.80 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు సెషన్లలో  లాభపడుతూ వచ్చిన సెన్సెక్స్ శుక్రవారం లాభాల స్వీకరణకు తలొగ్గింది. ప్రపంచ మార్కెట్లలోని అప్రమత్త ధోరణి ఇక్కడా ప్రభావం చూపింది. అయితే, వారం వారీగా చూస్తే ‘సెన్సెక్స్’, ‘నిఫ్టీ’లు రెండూ వరుసగా ఐదో వారంలోనూ లాభాలతో ముగిసినట్లయింది. స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్ శుక్రవారం దెబ్బతింది. ఇది ప్రపంచ మార్కెట్లలోని బలహీన ధోరణికి చాలా వరకు అనుగుణంగా ఉందని చెప్పవచ్చు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి.  రెండు దేశాల మధ్య చర్చలు ఏ విధమైన గణనీయమైన పురోగతి సాధించకుండానే ముగిశాయి. ‘సెన్సెక్స్’ 38,366.79 వద్ద అత్యధిక స్థాయిలో మొదలై ఉదయం ట్రేడ్‌లో ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు కొనసాగడంతో 38,429.50కి పురోగమించిం ది. కానీ, అన్ని రకాల షేర్లలోను లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో రికార్డు స్థాయిల నుంచి అది 38,172.77కి దిగిరాక తప్పలేదు. చివరకు అది 84.96 పాయింట్ల నష్టంతో  38.251.80 వద్ద స్థిరపడింది. గత నాలుగు సెషన్లలో ‘సెన్సెక్స్’ 673.20 పాయింట్లు లాభపడింది. గురువారంనాడు అది ఆల్-టైమ్ అత్యధిక స్థాయి 38,336.76 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా రికార్డు స్థాయి నుంచి కిందకు దిగినా కీలకమైన 11,550 స్థాయికి ఎగువన ముగియగలిగింది. అది 25.65 పాయింట్లు నష్టపోయి 11,557.10 వద్ద ముగిసింది. శుక్రవారం సెషన్‌లో అది 11,532 నుంచి 11,604.60 మధ్య ఊగిసలాడింది. గురువారంనాడు అది నూతన జీవితకాల గరిష్ఠ స్థాయి 11,582.75 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు గురువారం రూ. 142 కోట్ల విలువ చేసే షేర్లను కొనగా, విదేశీ మదుపు సంస్థలు కూడా రూ. 433.21 కోట్ల విలువ చేసే షేర్లను సమీకరించు కున్నాయని తాత్కాలిక డాటా సూచించింది.

English Title
Break the run of records
Related News