విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టు షాక్

Updated By ManamWed, 05/09/2018 - 11:45
Britain High Court Shocks Vijay Mallya
  • భారత బ్యాంకులకు అనుకూలంగా తీర్పు.. ఆస్తుల అమ్మకానికి ఓకే

Britain High Court Shocks Vijay Mallyaలండన్: విజయ్ మాల్యా విదేశీ ఆస్తుల వేలానికి అంతా సిద్ధమైంది. భారత బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు విదేశాల్లో చుక్కెదురైంది. బ్రిటన్ కోర్టులో మాల్యాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్, వేల్స్‌లోని అతడి ఆస్తులను అమ్మేసేలా భారత న్యాయస్థాన తీర్పును అమలు చేయాల్సిందిగా బ్రిటన్ హైకోర్టు జడ్జి తీర్పునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని 13 భారత బ్యాంకుల కన్సార్షియంకు అనుకూలంగా బ్రిటన్ హైకోర్టు జడ్జి ఆండ్రూ హెన్షా తీర్పునిచ్చారు. రుణ వసూలుకు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా ఆయన ఆదేశాలిచ్చారు.

‘‘ఇప్పటికే పలు భారత బ్యాంకులకు మాల్యా రుణాలను ఎగవేశారు. ఆస్తుల విలువ పడిపోయే ప్రమాదం ఉంది. రుణ వసూలుకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థలను ఇప్పటికే పలు బ్యాంకులు ‘దివాళా’గా ప్రకటించాయి. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన నాటి నుంచి అతడు భారత్ వదిలి బ్రిటన్‌కు వచ్చేశాడు. అప్పటి నుంచి భారత్‌కు తిరిగి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో అతడిపై భారత్ మోపిన తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో అతడి ఆస్తులను అమ్మాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని హెన్షా తన తీర్పులో పేర్కొన్నారు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా మాల్యాకు ఉన్న ఆస్తులను అమ్మితే రూ.10,210 కోట్లు వస్తాయని, వాటితో బ్యాంకుల రుణాలు తీరిపోతాయని 2017 నవంబరు 24న డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) బ్రిటన్ కోర్టులకు విన్నవించింది. కాబట్టి తదనుగుణంగా మాల్యా ఆస్తులను సీజ్ చేయాలని కోరింది. అయితే, దీనిపై విచారించిన కోర్టు భారత బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాగా, బ్రిటన్ హైకోర్టు తీర్పుతో మాల్యా నుంచి రావాల్సిన రుణాలను రాబట్టేందుకు ఉన్న అన్ని చట్టపరమైన దారులను బ్యాంకులు పరిశీలిస్తున్నాయని బ్యాంకుల తరఫు లాయరు తెలిపారు. 

English Title
Britain High Court Shocks Vijay Mallya
Related News