‘పద్దు’లో ఏముంది?

Updated By ManamWed, 01/31/2018 - 09:18
Budget Session 2018
  • 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పణ

  • మధ్య తరగతి జీవులలో మొలకెత్తిన ఆశలు

  • ఆదాయ పన్నులో మళ్లీ ‘ప్రామాణిక తగ్గింపు’!

  • వ్యవ‘సాయం’ కోసం ప్రత్యేక రుణహామీ నిధి?

  • స్థిరాస్తి రంగానికి ‘మౌలిక సదుపాయ’ హోదా?

  • 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పణ.. 

  • మధ్య తరగతిలో ఆశల మోసులు

Budget Session 2018

న్యూఢిల్లీ: కేంద్ర ‘పద్దు’ (బడ్జెట్)లో ఏముంది? జైట్లీ మనసులో ఏముంది? ఆర్థిక మంత్రి పెట్టెలో ఏముంది? జనంపై బడ్జెట్ వరాల జల్లు కురిపిస్తుందా... గుండె ఝల్లుమనిపిస్తుందా? మధ్య తరగతి మనిషికి ఊరట కలుగుతుందా? వేతనజీవికి కోతల నుంచి సాంత్వన లభిస్తుందా? అన్నీ ప్రశ్నలే... వీటన్నిటికీ పార్లమెంటు (పరీక్ష) హాలులో మన ‘విత్త సచివుడు’ అరుణ్ జైట్లీ గురువారం జవాబులు వెల్లడించబోతున్నారు. ఈలోగా సగటు మానవుల ఆరాటం ఆగుతుందా... ఆగదు! నానారకాల ఆలోచనలు, అధ్యయనాలు గట్రా మామూలే కదా! వివిధ రంగాల్లో పద్దులు ఇలా ఉండొచ్చునంటూ అలాంటి  కొన్ని అధ్యయనాలు ఊహించాయి... ఆ గుసగుసలేమిటో విందామా...

వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా రంగాలవారీగా ఆర్థిక మంత్రి అంచనాలు ఇలా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.

వేతన జీవులకు...
ఏటా బడ్జెట్ అనగానే మధ్యతరగతి వేతన జీవుల్లో ఆదాయపు పన్ను పరిమితి పంపుపై  ఆశలు మొలకెత్తడం ఆనవాయితీ. నిరుడు పన్ను శ్లాబులను అలాగే ఉంచిన ఆర్థిక మంత్రి... వార్షికాదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలదాకాగల చిన్న పన్ను చెల్లింపుదారులకు పన్నును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి స్వల్ప ఊరట కల్పించారు. అయితే, ఈసారి పన్ను శ్లాబులను, శాతాలను కిందకు దించి, వ్యక్తులపై భారాన్ని తగ్గించే యోచన ఉంది. పన్ను విధింపు ఆదాయ పరిమితిని పెంచడంద్వారా ప్రజల చేతిలో ఖర్చు చేయదగ్గ నగదు నిల్వ పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న 69 శాతం ప్రజలు భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడక్షన్)ను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదన్న మాట కూడా వినిపిస్తోంది.

పన్నులు
కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి, ప్రత్యా మ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గవచ్చు. వ్యక్తుల ఆదాయాలకు సంబంధిం చి కోతలు, మినహాయింపులు పెరగొచ్చు. పెట్టుబడులపై దీర్ఘకా లిక మూలధన లాభాలమీద పన్ను విధించవచ్చు.

ఐటీ/సాంకేతికత
డిజిటల్ లావాదేవీలకు మరింత ప్రోత్సాహకాలు. డిజిటల్ చెల్లింపు వేదికల మౌలిక వసతులకు మద్దతు. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లపై పన్నుల వ్యవస్థ, ఎక్సైజ్ సుంకాల హేతుబద్ధీకరణ. టెలికం సేవలపై ప్రస్తుతం విధిస్తున్న వస్తుసేవల పన్నును (జీఎస్టీ) 18 నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశం.

వ్యవసాయం
వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కోసం రుణహామీ నిధి ఏర్పాటు. పంట బీమా పథకాలకు మరిన్ని నిధుల కేటాయింపు. ఆనకట్టలు, కాలువలు, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలపై వ్యయం పెరగొచ్చు. నశ్వర పంటల వృథాను అరికట్టేందుకు శీతల గిడ్డంగుల నిర్మాణానికి రాయితీలు. ఎరువులపై రాయితీల తగ్గింపు.

బ్యాంకింగ్
రుణదాతల వద్ద నిరర్ధక ఆస్తుల కేటాయింపుల కోసం పూర్తి పన్ను కోతను అనుమతించే అవకాశం. బ్యాంకు డిపాజిట్లపై పన్ను కోతకు ఉద్దేశించిన వడ్డీ పరిమితిని రూ.10వేల నుంచి పెంచే వీలుంది. చిల్లర కాలవ్యవధి డిపాజిట్లపై పన్ను మినహాయింపు పరిమితి కాలాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచే అవకాశం. ఆర్థిక అశక్తత స్మృతి (ఇన్‌సాల్వెన్సీ కోడ్) కింద కార్యకలాపాలకు వీలుగా పన్ను ఉపశమన కల్పన.

మౌలిక సదుపాయాలు
మునుపటి బడ్జెట్‌తో పోలిస్తే రహదారుల నిర్మాణానికి పెట్టుబడులను 10 నుంచి 15 శాతందాకా పెంచే అవకాశం. ‘భారత్ మాల’ పథకంసహా తూర్పు-పశ్చిమ భారతాలను సంధానించే కీలక రహదారి నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు కల్పించవచ్చు. అలాగే 2017-18 బడ్జెట్‌లో కేటాయించిన రైల్వే పెట్టుబడులను 10 శాతం మేర పెంచవచ్చు.

స్థిరాస్తి రంగం
స్థిరాస్తి రంగంలోని అన్ని ప్రాజెక్టులకూ... ప్రత్యేకించి గృహ నిర్మాణంలో ప్రారంభ-సంపూర్ణ దశల్లో జాప్యం నివారణ దిశగా ఏక గవాక్ష (సింగిల్ విండో) అనుమతుల వ్యవస్థ. ప్రాజెక్టు వ్యయాలు, ఆర్థిక వనరుల సేకరణతోపాటు సముచిత ధరలో ఇళ్ల అందుబాటుకు వీలుగా స్థిరాస్తి రంగానికి మౌలిక వసతుల రంగం హోదా ఇవ్వొచ్చు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రస్తుత విధిస్తున్న పన్నును 12 శాతం నుంచి తగ్గించడం. సముచిత ధరలో ఇళ్ల నిర్మాణంపై వ్యయం పెంపు. ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి తగ్గింపుతోపాటు స్టాంపు రుసుములో కోతకు అవకాశం.

చమురు-సహజవాయువు
చమురు-సహజవాయు అన్వేషణ, ఉత్పత్తిపై పన్నేతర రుసుము 20 శాతం నుంచి 8-10 శాతానికి తగ్గింపు. సహజవాయువుపై మరింత లబ్ధికి వీలుగా జీఎస్టీ శాతాన్ని నిర్ణయించడం. నగరాల్లో సహజవాయు పంపిణీ కంపెనీలకు కేంద్ర సుంకం తగ్గింపు లేదా మినహాయింపు. ద్రవీకృత సహజవాయు దిగుమతులకు ప్రాథమిక కేంద్ర సుంకం నుంచి మినహాయింపు. ఎల్పీజీ, కిరోసిన్‌లను మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించే దిగువస్థాయి సరఫరా సంస్థలకు రాయితీల మద్దతు కల్పన.

ఆటోమొబైల్
పదిహేనేళ్ల వాడకం తర్వాత ఉద్గార ప్రమాణాలకు తగినవిధంగా లేని వాణిజ్య వాహనాలను తుక్కులో చేర్చడంపై విధాన ప్రకటన. విద్యుత్ వాహనాలపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి తగ్గించవచ్చు.

English Title
Budget Session 2018: Arun Jaitley tables Economic Survey 2017-18 in Lok Sabha
Related News