బ్యూనస్ ఎయిర్స్‌లో బులెట్ డుగ్ డుగ్

Updated By ManamTue, 03/13/2018 - 22:09
Royal-Enfield-Argentina

Royal-Enfield-Argentinaన్యూఢిల్లీ: అనన్యమైన బైక్‌ల తయారీ సంస్థగా ఖ్యాతి వహించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అర్జెంటీనా మార్కెట్లోకి ప్రవేశించినట్లు మంగళవారం ప్రకటించింది. లాటిన్ అవెురికాలో రెండవ పెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్‌గా అర్జెంటీనాకు పేరుంది. బ్యూనస్ ఎయిర్స్‌లో కంపెనీ మొదటి స్టోరును తెరిచి పూర్తి స్థాయిలో సేవలందించడం మొదలుపెట్టింది. విక్రయానంతర సేవలు, స్పేర్ పార్టులు, సర్వీసుతో సహా అన్నింటికి ఏర్పాట్లు చేసింది. అర్జెంటీనాలో అధికారిక డీలర్-భాగస్వామిగా గ్రూపో సింపాను రాయల్ ఎన్‌ఫీల్డ్ నియమించింది. మార్కెట్ అభివృద్ధి, మార్కెటింగ్, అర్జెంటీనాలో ఈ బ్రాండ్‌కి విక్రయానంతర సేవల వంటి ఆలంబన కార్యకలాపాల బాధ్యతంతా గ్రూపో సింపాయే చూసుకుంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘మా నగర కేంద్రీకృత అంతర్జాతీయ విస్తరణ వైఖరికి బ్యూనస్ ఎయిర్స్‌లోని స్టోరు సరిగ్గా సరిపోయేదిగా ఉంది.

అర్జెంటీనాలో జనం ఆనందదాయమైన, ఉత్సాహపూరితమైన లీజర్ మోటార్‌సైక్లింగ్ అవకాశాల కోసం చూస్తున్నారు. అవి నగరంలో సంచారానికి కూడా అనువైనవిగా ఉండాలని భావిస్తున్నారు’’ అని రాయల్ ఎన్‌ఫీల్డ్ అధ్యక్షుడు రుద్రతేజ్ (రూడీ) సింగ్ చెప్పారు. అర్జెంటీనాకు పరిశుద్ధమైన మోటార్‌సైక్లింగ్ ప్రపంచాన్ని చూపాలని కంపెనీ ఎదురు చూస్తోందని, దక్షిణ అవెురికా ప్రాంతంలోని రెండవ పెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్‌లో పోటీ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు కంపెనీకి అవకాశం ఏర్పడుతోందని ఆయన అన్నారు. లాటిన్ అవెురికా ప్రాంతంలో బ్రెజిల్, కొలంబియాలలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఇప్పటికే ప్రత్యేక స్టోరులు ఉన్నాయి. అర్జెంటీనాలో కంపెనీ నాలుగు (బులెట్ (500సిసి), క్లాసిక్ (500సిసి), కాంటినెంటల్ జి.టి (535సిసి) కేఫ్ రేసర్, హిమాలయన్ (410సిసి) మోడళ్ళను విక్రయిస్తుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను 540కి పైగా డీలర్‌షిప్‌ల ద్వారా 50కి పైగా దేశాల్లో విక్రయిస్తున్నారు. మిల్వౌకీ, లండన్, ప్యారిస్, మాడ్రిడ్, బార్సిలోనా, మెల్‌బోర్న్, శంపావ్లో, దుబాయ్‌లలో ప్రత్యేక బ్రాండ్ స్టోర్సులు ఉన్నాయి. కంపెనీ 2016-17లో ప్రపంచ వ్యాప్తంగా 6.6 లక్షల యూనిట్లు విక్రయించింది. బైక్‌ల తయారీ సామర్థ్యాన్ని 2018 అంతానికి 9 లక్షల యూనిట్లకు పెంచుకోవాలని భావిస్తోంది.

English Title
Bullet Dug Dug in Buenos Aires
Related News