వైజ్ఞానిక విప్లవానికి పిలుపు

Updated By ManamSun, 02/11/2018 - 01:27
image

imageమానవ వనరుల మంత్రిత్వ శాఖను కేంద్రంలో నిర్వహిస్తున్న సత్యపాల్‌సింగ్  మన పాఠశాలల్లో, కళాశాలల్లో బోధిస్తున్న డార్విన్ పరిణామ వాద పాఠ్యాంశాలను తొలగిం చాలని ప్రకటన చేశారు. ఈయన ఆర్.యస్.యస్. కార్య కర్తగా ఎదిగినవాడు. ఆర్.యస్.యస్.వాళ్ళు భారతదేశానికి చేసిన విద్రోహం  చరిత్రలో చెరిగిపోనిది. భారతదేశంలో విస్తరిస్తున్న శాస్త్రజ్ఞానానికి అవరోధంగా మతోన్మాద కార్య క్రమాలు నిర్వహించడం ఆర్.యస్.యస్.దినచర్య.  ప్రపం చం మొత్తంగా సైన్స్ దినదినం అభివృద్ధి చెందుతూనే వుంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు నూత్న సిద్ధాంతాన్ని ప్రపంచానికి వెలుగుదివ్వెగా అందిస్తారు. డార్విన్ ఈ శాస్త్రీయ సత్యాన్ని కనుగొనడం కోసం ఎంతో శ్రమించారు. పరిణామవాదం అనే సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ ప్రమాణబద్ధంగా ప్రపంచం ముందుకు తెచ్చారు. ఇందులో పరిశోధనా దృష్టి వుంది. శాస్త్రీయ దృక్పధం వుంది. నిరంతర అధ్యయనం వుంది. ఆయన దీన్ని శాస్త్ర బద్ధంగా నిరూపించారు. ఈ సిద్ధాంతాన్ని స్వీకరించక పోవ డం వల్ల ఆర్.యస్.యస్. మరింత జ్ఞాన వ్యతిరేకశక్తిగా మారే ప్రమాదం వుంది. ఈ సిద్ధాంతాలు గాని విద్యార్ధు లకు తెలియకపోతే వారు పుక్కిట పురాణాలు చదివే అంథు లుగా తయారౌతారు.
 
బ్రిటన్‌లో ఎడిన్‌బర్గ్ మెడికల్ అధ్య యనానికి మంచి స్ధలం. డార్విన్ ఇక్కడ మెడిసన్ చది వాడు. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల కంటే కూడా ఇక్కడ విద్యలో స్వేచ్ఛవుంది. డార్విన్‌నే కాదు ఎందరో మేథావుల్ని ఎడిన్‌బర్గ్ తయారు చేసింది. ఏ మనిైషైనా, పరిశోధకుడైనా కేవలం పాఠ్యగ్రంథాలు బట్టీ పెట్టడం వలన ఏమీ సాధించలేడు. డార్విన్ కొత్తగా ఆలోచించేవాడు. ఆయ నది పరిశోధనాత్మకమైన మేధస్సు. మెడిసన్‌కు వెళ్ళక ముందు ఆయన కేంబ్రిడ్జిలో స్టడీ ఆఫ్ డివినిటీని అధ్య యనం చేయడానికి వెళ్ళినపుడు కూడా, ఆయన అందులో కుదురుకోలేదు. ఆయన వివిధ రకాలైన తుమ్మెదలను సేక రించి వాటిలోని మార్పులను, వైవిధ్యాన్ని గూర్చి పరిశోధించాడు. అంతేకాదు బైబిల్లోవున్న దైవత్వాన్ని ఆయ న నమ్మలేదు. మానవులు జీవుల పరిణామం నుంచి ఆవిర్భవించారని ఆయన కనుగొనగలిగాడు. రాబర్ట్ ఇంగర్ సాల్ దేవుణ్ని మానవుడే సృష్టించాడు. తన రూపంలో తన స్వభావాలతో, తనకంటే కూడా శక్తిమంతుడిగా దేవుణ్ణి తయారు చేసుకొన్నాడు.


మానవుడు గొప్ప శిల్పి, గొప్ప నిర్మాణ కర్త అని రాబర్డ్ ఇంగర్‌సాల్ విశ్లేషించాడు. చార్లెస్ డార్విన్ అభిప్రాయం కూడా అదే. అందుకు ఆయన ‘బీగల్’ నావలో 5 ఖండాలు 5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. హెచ్.యం.యస్. బీగల్ అనే నావే ఆయనకు 5 సంవత్సరాలు ఒక ఇల్లు. ఆయన ప్రయాణంలో ‘సీసిక్‌నెస్’కు గురయ్యాడు. అంతేకాదు ఆ అనారోగ్యం ఆయన్ని జీవితాంతం వేధించింది కూడా. ఆయన ఆయా జాతులను పరిశో దించడమే కాదు. ఒక శాస్త్రీయ సత్యాన్ని కనుగొనడం కోసం ఇంత ప్రయాణం చేసిన వ్యక్తిని, అందునా 5 ఖండాలు 5 సంవత్సరాల్లో తిరిగిన వ్యక్తిని ప్రపంచంలో మరొకరిని చూడలేము. అసలు ప్రపంచం డార్విన్ అనే శాస్త్రవేత్తను గుర్తించడమే నిజమైన వెలుగు. ఎందరో తత్వవేత్తలు అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ఎన్నో తాత్వికమైన, శాస్త్రీయమై న, చారిత్రాత్మకమైన కొత్త అంశాలు కనుగొంటారు. అవి వెలుగులోకి రావడం చాలా కష్టం. అయితే అనేక వైరుధ్యా ల మధ్య డార్విన్ వాటిని బయటకు తెచ్చాడు. డార్విన్  ముందు కూడా జీవశాస్త్ర పరిణామం గురించి కొంత పరిశో దన జరిగింది. ఆ పునాదులను కూడా డార్విన్ పరిశోధిం చాడు. 1707-1778 మధ్య జీవించిన జీవశాస్త్రజ్ఞుడు లినేని యన్ స్వీడన్ దేశస్ధుడు. ఆయన సిద్ధాంతాలు శాస్త్రజ్ఞానంతో ప్రపంచానికి వెలుగునిచ్చాయి. ప్రపంచంలో శాస్త్రవేత్త అనే వాడు ఏ దేశంలోనైనా వుండవచ్చు. ఆ శాస్త్ర జ్ఞానాన్ని మనమందరం అందుకోవడం మన జ్ఞాన విస్తృతికి మూలం అవుతుంది. శాస్త్రం అనేది మానవాభ్యుదాయానికి నిచ్చెన వంటింది. ఈనాడు మానవుని ప్రతి అడుగులో అభ్యుద యం శాస్త్రజ్ఞానం వల్లే జరుగుతుంది. సంఘపరివార శక్తులు భారతదేశంలో వున్న విద్యా వ్యవస్ధకు గొడ్డలి పెట్టుగా వున్నారు. చరిత్రలో, అర్ధశాస్త్రంలో, పర్యావరణ శాస్త్రంలో, భౌగోళిక శాస్త్రంలో అభూత కల్పనలు జూపించి సత్య నిష్ఠవైపు, శాస్త్ర జ్ఞానార్జనవైపు విద్యార్ధులు పయనించకుండా పుక్కిట పురాణాలకు బానిసలు అయ్యేటట్లు చేస్తున్నారు. డార్విన్ అధ్యయనం చేయడం వల్ల ఒక శాస్త్ర సత్యాన్ని కను గొనాలంటే ఎంత సుదీర్ఘమైన ప్రయాణాలు చేయాలి, ఎన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి, ఎంత త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలనే విషయాన్ని అర్ధం చేసుకోవాలని మన పరిశోధకులకు అర్ధం అవుతుంది. మోదీ రాజ్యంలో మతఛాందస్సులుగా వున్న మంత్రులు చాలామంది వున్నా రు. వాళ్ళు జ్ఞాన విదూరులు, మానవతా రహితులు, మేథోసంపన్న విధ్వంసుకులు. నిజానికి హేతువాద భావజా లానికి, మతానికి చాలా వైరుధ్యం వుంది. శాస్త్రజ్ఞానం అనేది మనుష్యుల బుర్రలకెక్కాలంటే, విశ్వాసాలకు అతీ తంగా ఆలోచించగలిగాల్సివుంది.


ఏగతి రచియించినా, ఏ గతి జీవించినా సమకాలం వారలు తత్వవేత్తలకు శాస్త్రవేత్తలకు మెచ్చరనేది ఒక సత్యం. తత్వవేత్తలను, శాస్త్ర వేత్తకు సమన్వయం సాధించడంలో అద్వితీయమైన పాత్ర ను బెట్రండ్ రస్సెల్ సాధించాడు. డార్విన్‌లో కాని, కారల్ మార్క్స్‌లో కాని మరి ఏ తాత్వికునిలోను శాస్త్రవేత్తలోను వున్న శాస్త్రీయ భావజాల విస్తృతిని రస్సెల్ మన ముందుకు తెచ్చాడు. ప్రతి తత్వవేత్తకు, శాస్త్రవేత్తకు జ్ఞానానికి పరిమి తులుంటాయి. రాబోయే కాలం వారు వాటిలో కొన్నింటిని ఖండించవచ్చు. కొన్నింటిని పూరించవచ్చు. ఇదొక సత్యా న్వేషణాక్రమం. ప్రతి పౌరుడు, విద్యార్ధి, పరిశోధకుడు శాస్త్రవేత్తల జీవితాలను అధ్యయనం చేయడం వలన, స్పూర్తి పొందవచ్చు. అంతేకాదు, వారి నుంచి అధ్యయన క్రమాన్ని పరిశోధనా  క్రమాన్ని మనం అనుసరించవచ్చు. చార్లెస్ డార్విన్ గొప్ప పరిశోధకుడే కాదు, గొప్ప అధ్యయన పరుడు. ఆయనది శాస్త్రపరమైన రచన. ఆయన జీవితం లోని ఆటుపోటులను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. డార్విన్ పరిణామ వాదాన్ని 6వ తరగతి నుండే పిల్లలకు అభ్యసనం చేయించకగలిగితే శాస్త్రం ఆవశ్యకత, మానవుని పుట్టుక యొక్క మూలాలు విద్యార్ధులకు ప్రాథమిక దశలోనే అర్ధమౌతాయి. భూమి దేవత, పాలసముద్రం, శేషశాయి తల్పాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి పెంపులయ కారుకులనే భ్రమలు తొలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం పచ్చి బూటకం, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని తెలు స్తుంది. పరిణామ వాదం బుద్ధికి పదును పెడుతుంది.


భూమి గుండ్రంగా వుంది అన్నందుకు కొపర్నికస్‌ను జైల్లో బంధించారు.  బ్రూనోను మంటల్లో తగలబెట్టారు. డార్విన్ పరిణామ వాదం కనిపెట్టక ముందు కూడా ప్రపంచ వ్యాప్తంగా పదార్ధవాద చర్చ విస్తృతంగానే జరిగింది. డార్విన్ పరిణామ వాదం ఒక శాస్త్రంగా విద్యా వ్యవస్ధను సుసంపన్నం చేసి మానవుని ఆవిర్భావం మీద ఒక స్పష్టతను తీసుకొచ్చి మనుష్యుల్లో ఆత్మస్దైర్యాన్ని కలుగ జేస్తుంది. ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా డార్విన్ పరిణామవాదం వైపు నడుస్తుంది. ఆర్. యస్.యస్.వాళ్ళు శాస్త్ర జ్ఞాన ఫలితాలు అనుభవిస్తున్నారు. మనిషి పుట్టుక తెలిస్తేనే వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. వ్యక్తి ఏ అతీతశక్తులకో బానిసై తనను తాను నియంత్రించు కోలేక అదుపుతప్పి ఉన్మాదై, హంతకుడై, అణచివేత దారుడై, ఆత్మన్యూతతాపరుడై తనను తాను ధ్వంసం చేసుకొనే పరిస్ధితి నుంచి డార్విన్ పరిణామవాదం తానంటే ఏమిటో తెలుపుతుంది. సైన్స్ బోధించే ఉపాధ్యాయులే రాళ్ళకు మొక్కు తుంటారు. పిల్లలకివ్వాల్సిన పాలను రాళ్ళ పై పోస్తారు. భారతదేశంలో గుడులున్నన్ని లైబ్రరీలు లేవు. ఆశ్రమా లున్నన్ని ల్యాబ్‌లు లేవు. దేవుళ్ళు, దేవతల పేర్లను పిల్లలకు బట్టీపట్టిస్తారు. శాస్త్రవేత్తల పేర్లు రావు. రాముడు, కృష్ణుడు ఎవర్ని చంపారో నేర్పుతారు. ఏ వస్తువు ఎవరు కను గొన్నారో చెప్పరు. దీనివల్ల విద్య మూఢవిశ్వాసాల మధ్యలో నలిగిపోతోంది. సమాజం అంటే ఏమిటో తెలుపు తుంది. ప్రకృతికి, తనకు వుండే అంతస్సంబంధాలను తెలుపుతుంది.


అందువల్ల విద్య, జ్ఞానం, సమన్వయం అవుతాయి. సామాజిక ప్రగతికి అవి మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు సంఘ పరివారశక్తుల్ని, దాని పునాది మీద వున్న రాజ్యాన్ని దించడమే లౌకికవాదుల ముందున్న కర్తవ్యం. అందుకు ఐక్యంగా, సమన్వయంగా, సముజ్వలంగా, సముత్తేజంగా, వైజ్ఞానిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయ అధికారాన్ని కూడా లౌకిక వాదులు చేప్పటినప్పుడే ఆర్.యస్.యస్.వారి వైజ్ఞానిక వ్యతిరేక వాదాలకు చరమగీతం పాడగలుగుతుంది. ఇది వైజ్ఞానిక విప్లవ యుగం. ఈ యుగ పరిణామాన్ని ఎవరూ ఆపలేరు. ఇది చారిత్రక సత్యం..


డాక్టర్ కత్తి పద్మారావు
సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షుడు, నవ్యాంధ్రపార్టీ
9849741695 

English Title
Call for a science revolution
Related News