6న రద్దు... 7న శంఖారావం

Updated By ManamWed, 09/05/2018 - 01:18
kcr
  • గవర్నర్‌ను కలిసిన సీఎస్, అసెంబ్లీ కార్యదర్శి

  • ఫామ్‌హౌజ్‌లో సీనియర్లతో సీఎం సమాలోచన

  • నేడు మరో సారి మంత్రివర్గ సమావేశం

  • గురువారం పొద్దున్న 6.45 గంటలకు రద్దు ప్రకటన

  • ఏకమయ్యే యత్నాల్లో విపక్షాలు

kcr హైదరాబాద్: శాసనసభ రద్దుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అధికార యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. రద్దు, అనంతర పరణామాల పైన రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. ఎస్. కె. జోషి,  ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, శాసనసభ కార్యదర్శి నర్సింహ్మాచార్యులు, అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శాసనసభ రద్దు తీర్మానానికి సంబంధించిన అంశాలపైన చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారులు, సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికలు, ఓటరు నమోదు ప్రత్యేక కార్యాచరణపై చర్చించారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే 6వ తేదీన శాసనసభ రద్దు నిర్ణయం వెలువడుతుందని పార్టీ వర్గాలు మరోసారి స్పష్టం చేశాయి. సభ రద్దయిన మరుసటి రోజు 7వ తేదీన హుస్నాబాద్‌లో ప్రజల ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు 65 వేల మంది జనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంటిమెంటు ప్రకారం కరీంనగర్ నుండే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారని తెరాస వర్గాలు తెలిపాయి. బుధవారం మంత్రివర్గం సమావేశమవుతుందని, గురువారం 6వ తేదీన ఉదయం 6.50 గంటలకు మంత్రివర్గం మరోసారి సమావేశమై శాసనసభ రద్దు నిర్ణయం తీసుకుంటుందని తెలియచేశారు. ఆ వెంటనే గవర్నర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్‌లో కలుసుకొని మంత్రివర్గ నిర్ణయాన్ని తెలియ చేస్తారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌ను కలుసుకొంటారు. బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ అంశాలపైన నిర్ణయాలు ఉంటాయని, గురువారం నాటి సమావేశంలో కేవలం శాసనసభ రద్దు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి ముందస్తుకు సిద్దమైనందున తెలంగాణ అంతటా 50 రోజుల్లో 100 సభలు ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్న అధికారులు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలుసుకున్నారు. శాసనసభ రద్దు తీర్మానం తయారు చేయడంలో రాజ్యాంగపరమైన సమస్యలు ఉత్పన్నం కాని విధంగా చర్యలు తీసుకొనేందుకే ముందస్తుగా గవర్నర్‌ను కలుసుకోవడం, రాజ్‌భవన్ చర్చల వివరాలను ముఖ్యమంత్రికి తెలియచేయడం జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

తెరాస పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మరోసారి ప్రజా మద్దతు పొందడానికి హుస్నాబాద్‌లో సభ ఏర్పాటు చేశామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ నెల 2వ తేదీన ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేసిన తెరాస నాయకత్వం ప్రజాభిప్రాయం తమకు సానుకూలంగా ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సోమవారం రోజంతా మేధోమథనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం వడివడిగా అడుగులు వేశారు. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. పెండింగ్ ఫైళ్లు, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన నిర్ణయాలపై బుధవారం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ రద్దు, అనంతర పరణామాలపై తుది నిర్ణయానికి రావడంతో హుస్నాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాట కోసం ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ ఈ సభను విజయవంతం చేయడానికి ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభను రద్దు చేసిన తర్వాత జరిగే తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో భారీగా జన సమీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. 

ఎన్నికల సమరానికి ఏకమవుతున్న విపక్షాలు
శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా నిర్ణయాలు తీసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. భావసారూప్యత గలిగిన రాజకీయ పక్షాలతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పటికే తొలి విడత చర్చలు ముగించింది. మరో సారి చర్చలు జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌తో జత కట్టడానికి తెదేపా కూడా ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే ఎన్నికల రంగంలోకి దిగేందుకు విపక్షాలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. సీట్ల పంపకం, జన సమీకరణ, ప్రచారం విషయంలో విపక్షాల మధ్య స్పష్టత ఉందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పార్టీలు, వాటి బలాబలాల ఆధారంగా ఎన్నికల్లో కలిసి పని చేయడానికి విపక్షాలన్ని ఒక్కతాటిపైకి వస్తున్నాయని పేర్కొన్నారు.  సభలు, సమావేశాలతో ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు మరింత దూకుడుగా ప్రచారం సాగించబోతున్నాయని కాంగ్రెస్  నాయకత్వం పేర్కొంది.

సభ బాధ్యత హరీశ్‌కు
harishపండితుల సూచన మేరకు రా్రష్ట్రంలోని ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభను ఈ నెల 7వ తేదీన నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో ఈ సభ నిర్వహణ బాధ్యతలను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు అప్పగించారు. దీంతో మంత్రులు సభ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న బహిరంగ సభ పేరు ప్రజల ఆశీర్వాద సభ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.  ఈ నెల 7న సీఎం కేసీఆర్ హుస్నాబాద్ పర్యటనపై మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లో బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..50 రోజుల్లో వంద బహిరంగసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.  సభ నిర్వహణపై స్పందించిన మంత్రి ఈటల.. 50వేల మందితో హుస్నాబాద్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100 బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.

Tags
English Title
Canceled on 6th ... 7th Clarion
Related News