కార్డు క్లోన్ చేసి నగదు దోచేశారు

Updated By ManamTue, 02/13/2018 - 22:14
atm
  • 50 ఖాతాల్లోంచి 9.11 లక్షలు స్వాహా

  • ముంబైలో ఏటీఎంలో ఘటన

  • బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ

atmముంబై: ఏటీఎం కార్డుల క్లోనింగ్ ద్వారా పెద్ద మొత్తంలో ఖాతాదారుల నగదు కాజేసిన అంతరాష్ట్ర ముఠా వ్యవహారం ముంబైలో వెలుగులోకి వచ్చింది. చార్ని రోడ్‌లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో కొందరు దుండగులు స్కిమ్మింగ్ పరికరాలను, కెమెరాను అమర్చి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో కనీసం 50 మంది ఖాతాదారుల ఏటిఎం కార్డులను క్లోన్ చేసివారి ఖాతాల్లోం చి 9.11 లక్షల నగదును మాయం చేశారు. ఏటిఎం కార్డు పర్సులోనే ఉన్నా ఎక్కడో నగదు కాజేశారంటూ సెల్‌కు సందేశం రావడంతో బాధితులు నివ్వెరపోయారు. దీనిపై బ్యాంకులో ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. అక్కడ తమలాగే మరికొందరు ఉద్యోగులు కూడా ఉండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బాధితుల సంఖ్య పెరిగింది. ఇలా మోసపోయిన వారిలో గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులే ఎక్కువ.. వీరిలో ఎక్కువ శాతం మందికి స్థానిక యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతాలున్నాయి. దీంతో తరచుగా చార్ని రోడ్‌లోని ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం పరిపాటి. ఈ క్రమంలో ఏటిఎంలోని స్కిమ్మింగ్ పరికరాల వల్ల బాధితుల ఖాతా వివరాలు, కెమెరాల్లో పిన్ నంబర్లు నమోదయ్యాయి. ఆపై నకిలీ ఏటిఎం కార్డులు తయారుచేసి దుండగులు ఒక్కో ఖాతాలోంచి 10 వేల నుంచి 40 వేల వరకు కాజేశారు. గుజరాత్‌లోని వివిధ పట్టణాలతో పాటు హరియాణాలోని ఫరీదాబాద్ నగరంలోని ఏటీఎంల ద్వారా వారు నగదును ఉపసంహరించుకున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఒక ఉద్యోగి మాత్రం తన ఖాతాలోంచి 80 వేలు కాజేశారని చెప్పారు. కాగా, ఖాతాదారులను మోసం చేసిన ఘటనపై యాక్సిస్ బ్యాంకు ఉన్నతాధికారులు స్పందిస్తూ.. తమ ఖాతాదారులు నష్టపోకుండా చూస్తామని తెలిపారు. ఈ మోసపూరిత నగదు బదిలీలను సరిచేసి నగదును ఖాతాలోకి జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖాతాదారులకు అసౌకర్యం కలగకూడదన్నదే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని వివరించారు. మరోవైపు ఈ ఏడాదిలో బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి చోటుచేసుకున్న భారీ మోసం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తమకు ఇప్పటి వరకు కేవలం ఐదు ఫిర్యాదులు మాత్రమే అందాయని, విషయం తెలిసుకుని మరింతమంది ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మోసానికి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా సభ్యులు కావొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు.


 

Tags
English Title
The card was cloned and cash was looted
Related News