మైలురాయి చిత్రాల‌కి చిరునామా

Updated By ManamFri, 03/30/2018 - 22:41
sankranthi

sankranthiతెలుగు సినిమాల‌కి బాగా క‌లిసొచ్చే పండ‌గ అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ సీజ‌న్‌లో వ‌చ్చిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజయం సాధించాయి. కొన్ని సినిమాలు అయితే ఇండ‌స్ట్రీ హిట్స్‌గానూ నిలిచాయి. ఇలాంటి ఈ సీజ‌న్‌లో గ‌త మూడేళ్లుగా ఒక సంప్ర‌దాయం కొన‌సాగింది. వ‌చ్చే ఏడాది కూడా అది పున‌రావృతం కానుంది.

అదేమిటో కాస్త వివ‌రాల్లోకి వెళితే.. 2016లో నాలుగు చిత్రాలు సంక్రాంతికి సంద‌డి చేశాయి. వాటిలో 'నాన్న‌కు ప్రేమ‌తో' ఒక‌టి. యువ క‌థానాయ‌కుడు ఎన్టీఆర్‌కు హీరోగా ఇది 25వ చిత్రం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా.. న‌టుడిగా తార‌క్‌కు మంచి పేరు తీసుకువ‌చ్చింది. కొత్త లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో ప‌ల‌క‌రించిన ఎన్టీఆర్‌.. ఆ సినిమాతో చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా మంచి వ‌సూళ్ళ‌ను సాధించింది.

ఇక 2017 విష‌యానికి వ‌స్తే.. ఈ సంవ‌త్స‌రంలో ఏకంగా రెండు ల్యాండ్ మార్క్ చిత్రాలు సంద‌డి చేశాయి. అందులో ఒక‌టి 'ఖైదీ నంబ‌ర్ 150' కాగా, మ‌రొక‌టి 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'. 'ఖైదీ నంబ‌ర్ 150'.. న‌టుడిగా చిరంజీవికి 150వ చిత్రం. అంతేగాకుండా, ప‌దేళ్ళ త‌రువాత చిరు క‌థానాయ‌కుడిగా తెర‌పై సంద‌డి చేసిన సినిమా. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లోనూ మంచి లాభాల‌ను మూట‌గ‌ట్టుకుంది. అలాగే 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' విష‌యానికి వ‌స్తే.. నంద‌మూరి బాల‌కృష్ణకి న‌టుడిగా ఇది 100వ‌ చిత్రం. క్రిష్ తెర‌కెక్కించిన ఈ చారిత్రాత్మ‌క చిత్రం.. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోనూ లాభాల బాట ప‌ట్టింది. అంతేగాకుండా, న‌టుడిగా బాల‌య్య‌కి మ‌రింత గుర్తింపు తీసుకువ‌చ్చింది.

ఇక ఈ ఏడాది కూడా మ‌రో ల్యాండ్ మార్క్ మూవీ వ‌చ్చింది. అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'అజ్ఞాత‌వాసి'. ఈ సంక్రాంతి(2018)కి సంద‌డి చేసిన ఈ సినిమా ప‌వ‌న్‌కు 25వ చిత్రం. అయితే.. ఫ‌లితం ప‌రంగా ఈ సినిమా నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ ఓవ‌ర్సీస్‌లో 2 మిలియ‌న్ డాల‌ర్స్ రాబ‌ట్టుకుని వార్త‌ల్లో నిలిచింది.

ఇలా మూడేళ్ళ పాటు వ‌రుస‌గా ల్యాండ్ మార్క్ చిత్రాల‌తో క‌ల‌ర్‌ఫుల్‌గా సాగిన సంక్రాంతి.. వ‌చ్చే ఏడాది కూడా మ‌రో మైలురాయి చిత్రానికి చిరునామాలా నిలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే.. మ‌హేష్ బాబు న‌టిస్తున్న 25వ చిత్రం. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. కాగా, 2019 సంక్రాంతికి ఈ సినిమా తెర‌పైకి వ‌చ్చే అవకాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మొత్త‌మ్మీద‌.. ప్ర‌ముఖ క‌థానాయ‌కుల మైలురాయి చిత్రాలు సంక్రాంతినే టార్గెట్ చేసుకుంటూ విడుద‌ల అవుతుండ‌డం యాదృచ్ఛికంగా జ‌రిగినా ఓ విశేషంగానే చెప్పుకోవాలి.

English Title
care of address for milestone films
Related News