కుల మౌఢ్యాన్ని కాలరాయాలి!

Updated By ManamWed, 09/19/2018 - 01:16
honor killing

imageకులాంతర వివాహాల వలన మాత్రమే కులం (పాలక, ఆధిపత్య కుల పెత్తనం) పోవడం, లేక కులవివక్ష పోవడం జరగదు. పుట్టుక వలన మాత్ర మే మనిషికి విలువ ఉంటుందనే ఆలోచన, ఆచరణ బలహీన పడిపోతేనే అది అంతరిస్తుంది. కులాంతర వివాహాలు, మనుషులు కలసి సహజీవన యానం చేసే దానికి సొంత కులం మాత్రమే కావాలనే ఆలోచన బలహీన పడే దానికి కొంతమేర పనికి వస్తాయి. 

ఈ ఆలోచనా ఆచరణ మార్పునకు చాలా పద్ధతిగా ప్రయత్నించినా చాలాకాలమే పడుతుంది, అయితే ఇంతలోపు కులాల మధ్య ప్రేమలు, పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇవి ఆర్థిక సాబాజిక స్థాయి స్థాయిలో ఉన్న వారి మధ్య జరగవచ్చు లేని వారి నడుమా జరుగవచ్చు. 

ముఖ్యంగా ఆడపిల్లను కుల పవిత్రత కాపాడే ఆస్తిగా చూసే కుల- కుటుంబాల వారి ఇంటి ఆడపిల్లలు కులం దాటి, ఆ అమ్మాయి కన్నా తక్కువ అని భావించిన కులంలోని అబ్బాయిని చేసుకుంటే (ప్రతిలోమ వివాహం) అది చాలా పెద్ద ప్రమాదంగా, సహించలేని నీచ ఘటనగా చూసేస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో సదరు పిల్లవాడు ఆర్థికంగా బలహీ నుడు అయి ఉంటే ఇంకా పరిస్థితి మరింత దారుణం. 

image


మిర్యాలగుడాలో ప్రణయ్, అమృతల మధ్య ఆర్థిక వర్గ దూరం పెద్దది ఏమీ కాదు కానీ, కులదూరం చాలా ఎక్కువ (ఇది ప్రతిలోమ వివాహం). అయితే బహుశా చదువుకునే చోట మొదలయిన పరిచయాలు ప్రేమపెండ్లి వైపు దారితీసి ఉంటాయి. చూడ ముచ్చటగా ఉన్న జంట. పిల్లవాని హత్య మనుసును కల్చివేస్తూనే ఉన్నది. ఇది కుల కావరంతో చేసిన ఆధిపత్య కుల పితృస్వామ్య హత్య. పరువు హత్యలు అని వీటికి ముసుగులు వేయనవ సరం లేదు. ఇటువంటి కడుపు కోతను కడుపు మంటను మిగిలించే దురా గతాల సందర్భంలో మనం వేసుకోవలసిన ప్రశ్నలు ఉన్నాయి. ఇవి మనం మన వర్తమానంలో వేసుకోవలసిన ప్రశ్నలు. ఇవి మనపిల్లల జీవితాలకు సంబంధించిన ప్రశ్నలు. 

కుల (మత) ఆవరణ దాటి, నానారకాల కులాల (మతాల) వాళ్ళు కలిసే ఆవరణలలోకి పిల్లలు వెళుతారు (అటువంటి ఆవరణలు ఇటీవల కాలంలో తగ్గిపోతూ ఉన్నా). అక్కడ పరిచయాలు స్నేహాలు కుదురుతాయి, వివాహం విషయంలో పిల్లలు (ఆడగానీ మగగానీ) కులం పరిధి దాటే అవకాశం ఉంటుంది. అది జరిగితే ఎట్లా ఆ వాస్తవాన్ని స్వీకరించాలనే ఆలోచన ఎందుకు పెరగడం లేదు? అది అతిపెద్ద నీచకార్యం అనే ఆలోచన ఎందుకు ఉన్నది? ముందు రాసినట్టు కులం దాని పవిత్రత గొప్ప విష యమేమీకాదనే ఆలోచన ఆచరణ రూపుమాసే లోపు ఇటువంటి కులాంతర సంబంధాలను ఎట్లా కాపాడుకోవాలి? కాపాడుకోవడంలో ఎవరి బాధ్యత ఎంత? కులాంతర వివాహాలను కాపాడటంలో (మరీ ముఖ్యంగా అవి అస మాన సామాజిక ఆర్థికస్థాయి వారి నడుమ జరిగినప్పుడు) రాజ్యానికి ఉన్న బాధ్యత మాట ఏమిటి? వాటిని కాపాడుకోవడంలో కుల నిర్మూలన వాద బృందాల, ఇతర ప్రజాస్వామిక, మానవతావాద బృందాల పాత్ర ఏమిటి? 

ఆటుపోట్లు చూసినవి అయినా, పెద్దల ఆమోదం పొందినవి అయినా చక్కగా సాగుతున్న కులాంతర సంబంధాలను ప్రచారంలో ఉంచవలసిన మీడియా పాత్ర ఏమిటి? కులాంతర వివాహం అనే అంశం మీద వివిధ స్థాయిలలో అంటే తలిదండ్రుల, స్థాయిలో, యవ్వనుల స్థాయిలో, సంభా షణ, చర్చ జరిగేదానికి ఏమి చేయాలి? కుల వివక్ష నిర్మూలన గురించి పన్నెండవ తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యక్రమం రూపొందించగలమా? (ఇప్పటికే జెండర్ సెన్సిటైజేషన్ దిశగా మహిళా సంఘాలు ఆ పనిచేసి దాన్ని ఒక కోర్సు కిందికి మార్చ గలిగినవి తెలుగు నేలలో). ఇప్పుడు జరిగిన దారుణం సందర్భంలో, జరగబోయే దారుణాలున్నాయి అన్న వాస్తవిక భయం ఉన్న స్థితిలో అంతగా ఇష్టం కలిగించని ఈ ఇన్‌కన్వీ నియంట్ ప్రశ్నలను మనం వేసుకుందామా? వాటితో కుస్తీ పడుదామా? ఇవీ అణిచివేతకు, హత్యలకు, తిరస్కారానికి గురవుతున్న కులాంతర వివాహ సంబంధాలు మన ముందు ఉంచుతున్న సంవేదన గల ప్రశ్నలు.  ఆవేశపడి వంతుకు గంతులేయడంకాకుండా బాధ్యతగా ప్రేమ (కులాంతర) పెళ్లిళ్లకు (ఆర్థిక సామాజిక వివక్షల నేపథ్యంలో) చైతన్యం తీసుకొచ్చి, మనసుల్లో పేరుకుపోయిన కులమౌఢ్యానికి తావు లేకుండా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.
 

-  డాక్టర్ హారతి వాగీశన్ 
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్, 
నల్సార్ యూనివర్శీటీ ఆఫ్ లా, హైదరాబాద్

English Title
The caste masseur!
Related News