కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా కంబర్

Updated By ManamTue, 02/13/2018 - 01:44
kambar-sahity-academy

20 ఏళ్ల తర్వాత మూడో కన్నడ వ్యక్తిగా రికార్డు
kambar-sahity-academyన్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ కవి, రచయిత చంద్రశేఖర కంబర్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అయిన కంబర్.. సాహిత్య అకాడమీ అధ్యక్ష ఎన్నికల్లో మరాఠీ రచయిత బాల్‌చంద్ర వి నెమాడే, ఒడిశా రచయిత ప్రతి భారాయ్‌లతో పోటీ పడ్డారు. కంబర్ ప్రస్తుతం అకాడమీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సోమవారం జరిగిన ఈ ఎన్నికల్లో కంబర్ విజయం సాధించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా కంబర్ ఎన్నికై ఈ పదవి చేపట్టిన మూడో కన్నడ వ్యక్తిగా నిలిచారు. గతంలో కర్ణాటకకు చెందిన వినాయక కృష్ణ గోకక్(1983), యూఆర్ అనంతమూర్తి(1993) అకాడమీ అధ్యక్షులుగా వ్యవహరించారు. మళ్లీ  ఇరవై ఏళ్ల తర్వాత కన్నడ రచయిత ఒకరు సాహిత్య అకాడమి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం. 1937, జనవరి 2న జన్మించిన కంబర్ పలు కన్నడ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతిగా కూడా ఉన్నారు. 1991లో సాహిత్య అకాడమీ అవార్డు, 2011లో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పదేళ్లు కొనసాగించారు. 2013లో అకాడమీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కర్ణాటక నుంచి ఎమ్మెల్సీగా కూడా బాధ్యతలు నిర్వహించిన కంబర్.. కేంద్ర నాటక అకాడమీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 

English Title
Central Sahitya Akademi Cumber as President
Related News