కొచ్చర్ సెలవు శాశ్వతమా.?

Updated By ManamTue, 06/19/2018 - 15:33
 Chanda Kochar to continue on vacation

chanda kocharన్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్ రుణ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ విషయంపై ప్రచారంలో ఉన్న రకరకాల ఊహాగానాలకు ఐసీసీఐ బోర్డు తెరదించింది. రుణ మంజూరుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎండీ చందా కొచ్చర్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా సూచించింది. ఆరోపణలపై అంతర్గత విచారణ జరుగుతున్న నేపథ్యంలో చందా కొచ్చర్ పదవిలో ఉండడం సబబు కాదంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ సెలవు తాత్కాలికమా.. లేక కొచ్చర్‌ను శాశ్వతంగా సాగనంపినట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొచ్చర్‌ను సెలవుపై పంపిస్తున్న నేపథ్యంలో సంస్థ రోజువారీ విధుల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించడానికి సందీప్ బక్షిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా నియమిస్తున్నట్లు తెలిపింది. వీడియోకాన్ గ్రూపునకు రుణ కేటాయింపుల్లో క్విడ్‌ప్రో కో ఆరోపణలు వెలుగుచూసిన విషయం తెలిసిందే! చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నుపవర్ రెన్యూవబుల్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంతోనే వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేశారని ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఎలాంటి కుట్ర కానీ క్విడ్‌ప్రో కో కానీ జరగలేదంటూ చందా కొచ్చర్ వాదస్తూ వచ్చారు. ఐసీఐసీఐ బోర్డు కూడా కొచ్చర్‌ను సమర్థిస్తూ వచ్చింది. ఈ ఆరోపణలపై అంతర్గతంగా ఓ కమిటీని విచారణ జరిపించింది.

తాజాగా సోమవారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో కొచ్చర్‌ను సెలవుపై సాగనంపాలని సభ్యులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విచారణ పూర్తయ్యాక తిరిగి కొచ్చర్ బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నా.. అది దాదాపు అసాధ్యమేనన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మార్చితో కొచ్చర్ పదవీకాలం పూర్తికానుంది. ఈలోగా విచారణ పూర్తయ్యే అవకాశాలు లేవని, చందా కొచ్చర్‌కు ఐసీఐసీఐ శాశ్వతంగా గుడ్‌బై చెప్పినట్లేనని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చందా కొచ్చర్ స్థానాన్ని ఫ్రుడెన్షియల్ లైఫ్ సీఈవోగా వ్యవహరిస్తున్న సందీప్ బక్షి భర్తీ చేస్తారని బోర్డు తెలిపింది. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలన్నీ బక్షి పేరుపైనే జరుగుతాయని వెల్లడించింది.

English Title
Chanda Kochar to continue on vacation
Related News