చంద్రబాబు.. అపర భగీరథుడు

Updated By ManamMon, 04/16/2018 - 02:28
image
  • రాయలసీమకు కృష్ణా జలాలు తెచ్చారు

  • హిందూపురం దాహార్తి తీరుస్తున్న సీఎం

  • లేపాక్షి జలహారతి సభలో దేవినేని ఉమా

  • గొల్లపల్లి నుంచి హిందూపురానికి పైప్‌లైన్

  • జూన్ కల్లా ప్రజల దాహం తీరుస్తాం: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

imageహిందూపురం: కృష్ణా జలాలను రాయలసీమకు చేర్చడంలో సీఎం చంద్రబాబు అవిరళ కృషి చేసి అపర భగీరథుడిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలుస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తెచ్చి హిందూపురం, లేపాక్షి దాహార్తిని తీరుస్తున్నామని ఆయన చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో లేపాక్షి చెరువు, గొల్లపలి రిజర్వాయర్‌కు జలహారతి ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడూతూ హిందూపురం అభివృద్ధికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఈ నియోజకర్గానికి దత్తపుత్రుడిలా మారి సేవ చేశారని అన్నారు. 1983లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లోనే సీఎం పీఠాన్ని అధిష్ఠించారని, నాడు ఆయన మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా హిందూపురం శాసనసభ్యుడిగానే కొనసాగారని గుర్తుచేశారు.

హంద్రీనీవా, నగరి-గాలేరు నీళ్లు రాయలసీమకు తెస్తారా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకొని పట్టుదలతో నీరు తెప్పించారన్నారు.శ్రీకృష్ణదేవ రాయల కాలంలో లేపాక్షిలో తవ్వించిన పెద్ద చెరువుకు కృష్ణాజలాలు తెప్పించి ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా జలహారతి చేయించడం హిందూపురం ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధ్ధికి పాటుపడాలని ఎన్టీఆర్ పెట్టుకున్న లక్ష్యాలను నేడు చంద్రబాబు, బాలకృష్ణలు అక్షరాలు నిజం చేశారని ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందుపురం ప్రజల దాహార్తిని తీర్చేందుకు జూన్ నాటికి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీటిని అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, టిడిపి జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్యేలు అబ్ధుల్‌గని, రంగనాయకులు, లేపాక్షి సర్పంచి జయప్ప, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

English Title
Chandra Babu .. Bhagiratha
Related News