టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

Updated By ManamSat, 09/08/2018 - 12:53
chandrababu naidu meets telangana tdp leaders over tdp-congress alliance
chadrababu-telangana tdp leaders

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. అనంతరం లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో జరుగుతున్న టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికలపై వ్యూహం, పొత్తుల ఖరారుపై చర్చిస్తునట్లు తెలుస్తోంది. 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. 

ఈ సమావేశంలో...తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్నట్లు, పార్టీకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని టీ టీడీపీ నేతలు  తమ అధినేత దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. 35 శాతం ఓటింగ్ ఉన్నట్లు పదిలంగా ఉందని చెప్పగా, మరోవైపు కమ్యూనిస్టులతో పాటు కోదండరాం పార్టీపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. అలాగే ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఆ సందర్భంగా పొత్తులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కాగా తెలంగాణలో శాసనసభ రద్దుతో రాజకీయ పార్టీలు పొత్తుల ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను  ఓడించాలనే లక్షంతో ఉన్న  కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకు వేసి,  పొత్తులపై చర్చించేందుకు  తెలుగుదేశం పార్టీని ఆహ్వానించింది. అందుకు టీడీపీ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. 

కాంగ్రెస్ ఆహ్వానాన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తమ పార్టీ  అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  దృష్టికి తెచ్చారు. ఆందుకు చంద్రబాబు కూడా సుముఖంగా ఉండటంతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తులపై రాష్ట్ర నాయకత్వాలు ప్రాథమిక చర్చలు మొదలయ్యాయి.

మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ కూడా ఈ నెల 12న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా పొత్తులపై తుది విడతగా చంద్రబాబుతో చర్చలు జరిపి అదేరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

English Title
chandrababu naidu meets telangana tdp leaders over tdp-congress alliance
Related News