మాల్దీవ్స్‌కు సైన్యాన్ని పంపితే.. ఖబర్దార్

Updated By ManamTue, 02/13/2018 - 21:47
maldives
  • పంపితే తీవ్ర పరిణామాలు.. చూస్తూ ఊరుకోం

  • మేమూ జోక్యం చేసుకుంటాం.. భారత్‌కు చైనా హెచ్చరిక

  • మాల్దీవ్స్‌లో పరిణామాలపై భారత్‌లో కలవరం

  • భారత నౌకా రవాణాలో ఆ దీవులు కీలకం

  • అనిశ్చితితో నౌకల భద్రతకు ముప్పు

Maldives బీజింగ్: సంక్షోభంలో కూరుకుపోయిన మాల్దీవ్స్‌లోకి భారత్ తన సైన్యాన్ని పంపితే తీవ్ర పరిణామాలు తప్పవని చైనా హెచ్చరించింది.  ఈ విషయంలో భారత్‌పై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని, తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనక తప్పదని కూడా తీవ్ర స్వరంతో పేర్కొంది. మాల్దీవ్స్‌లో నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకు భారత్ సైన్యాన్ని పంపాలని మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు నషీద్‌తో పాటు పలువురు విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఈ విధంగా స్పందించింది. దీనికి తోడు.. మాల్దీవ్స్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోనూ ప్రధాని నరేంద్రమోదీ మంతనాలు జరిపుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పత్రిక స్పందించింది. ‘‘ఐక్యరాజ్యసమితి ఆమోదం లేనిదే ఏ దేశం కూడా మాల్దీవ్స్‌లో సైన్యాన్ని దింపకూడదు. మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో చైనా ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు. అలా అని మేం చేతులు ముడుచుకుని కూర్చుంటామని భావించొద్దు. ఒకవేళ ఇండియా తన సైన్యాలను మాల్దీవ్స్‌కు పంపితే.. న్యూఢిల్లీని నిలువరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటాం. ఇందులో ఎలాంటి సంశయం లేదు’’ అని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. సైనిక దళాలను పంపకూడదనే తమ హెచ్చరికను భారత్ తక్కువగా అంచనా వేయకూడదని కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది. భారత్ సైనిక చర్యకు దిగితేనే చైనా కూడా రంగంలోకి దిగుతుందని, అంతవరకు మాల్దీవ్స్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోబోదని వెల్లడించింది.

భారత్ మరో సమస్య కావొద్దు: చైనా విదేశాంగశాఖ
మాల్దీవుల సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చైనా పేర్కొంది. భారత్‌తో తమ సంబంధాల్లో ఈ వ్యవహారం మరో సమస్యగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. మాల్దీవుల సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించి తదనుగుణంగా మసలుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ శుక్రవారం సూచించారు. మాల్దీవుల్లో మోహరించడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ..ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్య సూత్రమని వ్యాఖ్యానించారు.
 
మాల్దీవుల్లో పరిణామాలపై భారత్ కలవరం..
హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర సంక్షోభం ఇండియాను కలవరపెడుతోంది. ఇటీవలే మాల్దీవులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న మరో ఆసియా దిగ్గజం చైనా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్ సర్కారు రద్దు చేసింది.

22 వేల మంది భారతీయులు..
లక్ష దీవులకు 700 కి.మీ. దూరంలోని ఈ చిన్న దేశం జనాభా నాలుగున్నర లక్షలు. ప్రస్తుతం 22 వేల మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం 400 మంది వైద్యుల్లో 125 మందికి పైగా భారతీయులే. ఉపాధ్యాయుల్లో నాలుగో వంతు మంది కూడా ఇండియా నుంచి వెళ్లినవారే. దాదాపు అందరూ ముస్లింలే ఉన్న మాల్దీవుల్లో సంక్షోభం ముదిరితే అక్కడ మత ఛాందస వాదం, వాణిజ్య నౌకల దోపిడీ, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా పెరిగి తన భద్రతకు ముప్పువాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భారత సరుకు రవాణా 97 శాతం ఈ ప్రాంతం మీదుగానే జరుగుతోంది. 1988లో మాల్దీవులను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి శ్రీలంక తీవ్రవాదుల ముఠా యత్నించినా భారత సైన్యం అండతో నాటి అధ్యక్షుడు గయూమ్ ఆ చర్యను తిప్పికొట్టారు.

2011లో చైనా పాదం!
మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయాన్ని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ద్వీపదేశంతో చైనా వాణిజ్య సంబంధాలు వేగంగా వద్ధి చెందాయి. సార్క్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత చైనాతో స్వేచావాణిజ్య ఒప్పందం చేసుకున్న రెండో దేశం మాల్దీవులు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.  చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్టులో మాల్దీవులు కూడా భాగస్వామి. మాలే-హల్‌హూల్ ద్వీపాల మధ్య వంతెన సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా సహాయంతో ఇక్కడ నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర సిల్క్ రూట్ ప్రాజెక్టు నిర్మాణంలో మాల్దీవులది కీలకపాత్రగా చైనా భావిస్తోంది. శ్రీలంకలో హంబన్‌టోటా రేవు ప్రాజెక్టుతోపాటు జిబూటీలోనూ సైనిక స్థావరం నిర్మాణానికి స్థలం సంపాదించిన చైనా చెప్పుచేతల్లో నడిచే రాజ్యంగా మాల్దీవులు మారడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే.

Tags
English Title
China will 'take action' if India sends troops to crisis-hit Maldives – state media
Related News